పార్లమెంట్ ఎన్నికల తర్వాత వలసలతో హస్తం పార్టీ దూకుడు పెంచింది. ఓ వైపు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల చేరికలతో శాసనసభ, మండలిలో తన బలాన్ని పెంచుకుంటున్న కాంగ్రెస్ అటు జీహెచ్ఎంసీ కౌన్సిల్ లోనూ కార్పొరేటర్లను చేర్చుకుని నగరంపై పట్టు సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే పలువురు కార్పొరేటర్లను కాంగ్రెస్ లో చేర్చుకుంటుంది.
ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరగా.. జూలై 13న (ఇవాళ) శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ చేరారు. దీంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో బీఆర్ఎస్ కార్పొటర్ల సంఖ్య 56 నుంచి 41 కి చేరింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో ప్రస్తుతం కాంగ్రెస్ కార్పొరేటర్లు సంఖ్య 3 నుంచి 25 కు చేరింది. బీజేపీ కార్పొరేటర్ల సంఖ్య 39కి చేరింది.
అటు ఇప్పటి వరకు 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆరుగురు ఎమ్మెల్సీలులు కాంగ్రెస్ లో చేరగా.. మరికొందరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరుగుతోంది.