న్యూఢిల్లీ: జమిలీ ఎన్నికల (వన్ నేషన్ వన్ ఎలక్షన్) బిల్లులు లోక్ సభ ముందుకు వచ్చాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా 2024 డిసెంబర్ 17వ తేదీన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలీ ఎన్నికల బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. వన్ నేషన్ –వన్ ఎలక్షన్ పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రమంత్రి సభ ముందుకు తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. జమిలి ఎన్నికల బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. దేశంలో ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం అనేది ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీయడమేనని కాంగ్రెస్ అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఎన్డీఏ సర్కార్ చేస్తోన్నవి రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసే చర్యలు అని విమర్శించింది కాంగ్రెస్. తక్షణమే జమిలి ఎన్నికల బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మనోజ్ తివారీ ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. రాష్ట్రాల అసెంబ్లీల కాలవ్యవధిని కుదించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన నొక్కి చెప్పారు. జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశ పెట్టడాన్ని కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలోని సమాజ్ వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకే పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. జమిలి ఎన్నికల బిల్లును ఉపసంహరించుకోవాలని సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి.
Also Read:-లోక్ సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు..
జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను గత వారమే కేంద్ర కేబినేట్ ఆమోదించిన విషయం తెలిసిందే. రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్రపాలిత చట్టాల సవరణ బిల్లు-2024ను కేంద్ర మంత్రి సభ ముందు ఉంచారు. ఇది ఢిల్లీ, జమ్మూకశ్మీర్, పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది. ఏదైన అసెంబ్లీకి ఎన్నికలను లోక్ సభతో పాటు నిర్వహించలేకపోతే.. ఆతర్వాత వాటిని జరిపే వీలు జమిలి ఎన్నికల బిల్లులో ఉంది. దీనిపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయాలి. ఏదైన ఒక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడినప్పుడు..వాటిని తర్వాత నిర్వహిస్తామని రాష్ట్రపతికి సిఫార్సు చేసే అవకాశం 129వ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ 2క్లాజ్ 5 కల్పిస్తుంది. రాష్ట్రపతి ఆదేశాలతో వాటిని తర్వాత నిర్వహించుకోవచ్చు.