కోల్పోయిన చోటే వెతకాలె.. వ్యూహాత్మకత అవసరమే!

కోల్పోయిన చోటే వెతకాలె.. వ్యూహాత్మకత అవసరమే!

ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీకి చాలా పాఠాలనే నేర్పింది. సహజ మిత్రులెవరు, నటించే మిత్రులెవరు అనే అవగాహన ఆ పార్టీకి బాగానే పెరిగింది. అందుకే సాధ్యమైనంతవరకు కాంగ్రెస్​ తన పూర్వ వైభవానికి గట్టిగా  ప్రయత్నించాలనుకుంటున్నట్లు ఆ పార్టీ వ్యూహాత్మక రాజకీయాలు చెపుతున్నాయి. కేజ్రీవాల్​, మమతా బెనర్జీ అవసరాలను బట్టి ఒకసారి కూటమిలో ఉన్నామని, మరోసారి లేమని చెప్పి కాంగ్రెస్​ పార్టీని బాగా  ఆటపట్టించాయి కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఆ రెండు పార్టీలూ ఢిల్లీలో, పశ్చిమ బెంగాల్​లో కాంగ్రెస్​ పార్టీ బలాన్ని కొల్లగొట్టి ఏర్పడిన పార్టీలే. 

 ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్​ ఉనికిని కొల్లగొట్టిన పార్టీలవి.

అలాగే, దేశంలో కాంగ్రెస్​ పార్టీ సొంత నేతల వల్ల అనేక రాష్ట్రాలలో ఉనికిని కోల్పోయింది కూడా. అందుకు పశ్చిమ బెంగాల్​లో మమతా బెనర్జీ (టీఎంసీ), ఏపీలో వైయస్​ జగన్​ (వైయస్సార్​సీపీ) లు కాంగ్రెస్​ పార్టీ  ఉనికిని కాజేసి ప్రాంతీయపార్టీలుగా స్థిరపడడం ఉదాహరణ మాత్రమే. అలాగే, ఇటు ఇండియా కూటమిలో, అటు ఎన్​డీఏ కూటమిలో లేని ఇతర ప్రాంతీయ పార్టీల వల్ల కూడా రాజకీయంగా  ఎక్కువగా  నష్టపోయింది కాంగ్రెస్​ పార్టీయే. ఇది  కాంగ్రెస్​ అధిష్టానానికి బాగా అవగాహనలో ఉన్న విషయమే. ఫలితంగానే, కాంగ్రెస్​ పార్టీ తన పూర్వ బలాన్ని పునరుద్ధరించుకునే దారులను గట్టిగానే వెతుక్కుంటున్నట్లుంది.  

ఢి ల్లీలో తమ బలాన్ని ​ కొల్లగొట్టి అధికారం చేపట్టిన ఆప్​ను ఓడిస్తే తప్ప అక్కడ కాంగ్రెస్​ తన పూర్వ బలాన్ని తిరిగి పుంజుకోలేదనే విషయం కాంగ్రెస్​పార్టీకి తెలియంది కాదు. కాంగ్రెస్​ పార్టీ కొంత వ్యూహాత్మకంగా పోటీ చేయడం వల్లనే ఢిల్లీలో ఆప్​ పార్టీకి ఓటమి తప్పలేదు.  ఢిల్లీలో గెలిచింది బీజేపీయే అయినా.. ఆప్​  ఓటమిని ఎక్కువగా ఎంజాయ్​ చేసింది కాంగ్రెస్​ పార్టీయే అని చెప్పాలి. ఢిల్లీలో ఆప్​ ఓటమితో  తాము ​ తిరిగి పుంజుకునే అవకాశం ఉందని కాంగ్రెస్​ పార్టీ బలంగా నమ్ముతున్నది. 

పశ్చిమ బెంగాల్​లో..

వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ ​ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మధ్య కాంగ్రెస్​ పార్టీ అధిష్టానం బెంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో  తృణమూల్​ కాంగ్రెస్​ను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్​ నేతలకు దిశానిర్దేశం చేయడం గమనార్హం. బెంగాల్​లో మమతకు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ఉంది. ఇక కాంగ్రెస్​  పార్టీ, వామపక్షాలతో కలిసి రెండో ప్రత్యర్థిగా పోటీచేసే అవకాశం ఉంది. మమతా బెనర్జీ పాలనకు 15 ఏండ్లు  పూర్తి కావస్తున్నాయి. 

 ఓవైపు 15 ఏండ్ల యాంటీఇన్​కంబెన్సీ, మరోవైపు త్రికోణపు పోటీ, మమతా బెనర్జీ  విజయావకాశాలను బాగా దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. టీఎంసీ,- బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉన్నప్పటికీ.. కాంగ్రెస్​, వామపక్షాలు కలిసి ఈ సారి వ్యూహాత్మకంగా మమతా బెనర్జీని  సీరియస్​గా టార్గెట్​ చేయనున్నాయి. ఎందుకంటే, అక్కడ అధికారంలో ఉన్న పార్టీ టీఎంసీయే కాబట్టి కూడా. అలాగే కాంగ్రెస్​ లక్ష్యం కూడా  అదే.  ఫలితంగా బీజేపీ గెలుపు అవకాశాలు పెరగొచ్చని విశ్లేషకుల అభిప్రాయం.  ఒకవేళ మమతా బెనర్జీ ఓడిపోయి అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చినా..  బెంగాల్​లో  కోల్పోయిన తన స్థానాన్ని పునరుద్ధరించుకునే అవకాశం దొరుకుతుందని కాంగ్రెస్​ పార్టీ భావించడం సహజం. 

ఢిల్లీలో కేజ్రీవాల్​ ఓటమిలో కాంగ్రెస్​ తన భవిష్యత్తు దాగి ఉందని ఎలా భావించిందో, బెంగాల్​లో మమతా బెనర్జీ ఓటమిలోనూ కాంగ్రెస్​ తన భవిష్య త్తు దాగి ఉందని భావించడం కూడా సహజమే. పునరుద్ధరణకు  దీర్ఘకాలిక ప్రణాళిక అయినా సరే గట్టి పునాదులే  వేసుకోవాలని కాంగ్రెస్​ చూస్తున్నట్లుంది.

ఒడిశాలో..                                                 
                                                                   
 అలాగే, ఏకూటమిలో లేని బీజేడీ(ఒడిశా), బీఆర్​ఎస్​(తెలంగాణ)లు కూడా పరోక్షంగా ఇంతకాలం కాంగ్రెస్​ పార్టీకి నష్టం చేస్తూ వచ్చినవే. ఒడిశాలో బీజేపీ అధికారంలో ఉంది. నవీన్​ పట్నాయక్​ పార్టీ 56 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కాంగ్రెస్​ పార్టీ 14 మంది ఎమ్మెల్యేలతో రెండో ప్రతిపక్షంగా ఉంది. అక్కడ బీజేపీ ప్రభుత్వంపై నవీన్​ పట్నాయక్​ కన్నా, కాంగ్రెస్​ పార్టీయే ప్రజా సమస్యలను ఎక్కువగా అడ్రస్​ చేస్తూ  పోరాటాలకు దిగుతుండడం గమనార్హం. ఒడిశాలో  కాంగ్రెస్​  పార్టీ మెల్లమెల్లగా నవీన్​ పట్నాయక్​ను​ వెనుకకు నెట్టివేస్తూ  ఆ రాష్ట్రంలో బీజేపీకి తానే ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు  తీవ్రంగా పనిచేస్తున్నది. 

తెలంగాణలో..

తెలంగాణలో  కాంగ్రెస్​  పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్​ నైతికత కోల్పోయిన పార్టీగా మారింది. పదేండ్లు ఏలిన బీఆర్ఎస్​పై ప్రజలు మరోసారి విశ్వసించే అవకాశాలు లేవనే చెప్పాలి.  తెలంగాణలోనూ రాబోయేకాలంలో కాంగ్రెస్,​- బీజేపీలు మాత్రమే ప్రధాన ప్రత్యర్థులుగా నిలిచే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. 

కాంగ్రెస్​ ఉనికిని కొల్లగొడుతున్నదెవరు?

పశ్చిమ బెంగాల్​, పంజాబ్​, ఢిల్లీ,  ఏపీ,  ఒడిశా రాష్ట్రాల్లో 113 లోక్​సభ స్థానాలున్నాయి.  కాంగ్రెస్  ​పార్టీ గత దశాబ్దకాలంగా మూడు అంకెల స్థానాలను కూడా గెలవలేకపోతున్నది. దశాబ్దకాలం పాటు ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా పొందలేకపోయింది. వాస్తవానికి కాంగ్రెస్​ ఉనికికి ప్రమాదం బీజేపీ కాదు. కాంగ్రెస్​ నుంచి వెళ్లిపోయి ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్నవారే. ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్​ ఉనికిని కోల్పోవడాన్ని  మనం గమనించొచ్చు. 

తాయిలాలే సిద్ధాంతంగా మారిన దుస్థితి

వాస్తవంగా చెప్పాలంటే,  దేశంలో  తాయిలాలను ఎర వేసి  రాజకీయంగా  బతకడమెలాగో ఈ దేశానికి మొదట ప్రాంతీయ పార్టీలే  నేర్పాయి. నాటి ఎంజీఆర్​ నుంచి  నేటి కేసీఆర్​, కేజ్రీవాల్​, మమతా బెనర్జీ దాకా  త్వరగా అధికారం దక్కడానికి తాయిలాలనే నమ్ముకున్నారు.  విద్య, వైద్యంలాంటి  అసలైన సంక్షేమం మరిచి, తాయిలాల ఎరలతో ఎలా అధికారం చేపట్టాలో  ఈ దేశానికి నేర్పారు. ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవాలంటే, తామూ తాయిలాలు ఇవ్వాల్సిందే నని జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్​ కూడా నేర్చుకున్నాయి. 

హర్యానా, మధ్యప్రదేశ్​, ఢిల్లీలో బీజేపీ మహిళలకు నెలకు ఉచితంగా నగదు పథకం ఇస్తామని హామీ ఇవ్వడం, కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ గంపెడు తాయిలాలు ప్రకటించడం అందుకు ఉదాహరణలు. మొత్తం మీద తాయిలాల పథకాలతో  ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి  దేశవ్యాప్తంగా రోజురోజుకూ దిగిజారిపోతున్నది.  జాతీయ పార్టీలు బలంగా  మనగలిగితే,  ప్రాంతీయపార్టీలు తగ్గుముఖం పడతాయి. దాంతో రాజకీయాల్లో తాయిలాల పోటీ హామీలు కూడా  కాస్తంత తగ్గే అవకాశం ఉంటుంది.    

వ్యూహాలను స్వాగతించాల్సిందే

దేశ జీడీపీలు పెరుగుతున్నాయి తప్ప, ప్రజల విద్య, వైద్యం లాంటి సంక్షేమాలు మాత్రం పెరగడంలేదు. ఏ పార్టీలోనూ  సంక్షేమ రాజ్యం ఆలోచన కనిపించడం లేదు. దేశానికి తాయిలాలను అలవాటు చేసిన ప్రాంతీయ పార్టీల స్థానంలో బీజేపీతోపాటు, అన్ని రాష్ట్రాల్లో  కాంగ్రెస్​ వంటి  జాతీయ పార్టీ బలపడితే.. కొంతమేరకైనా ఈ దేశానికి మేలు జరగొచ్చు. ఒకప్పుడు  ప్రజల కనీస అవసరాలైన సంక్షేమ పథకాలను బలంగా నడిపినవి  జాతీయ పార్టీలే.   కాబట్టి ఇవాళ కాంగ్రెస్​ తన బలాన్ని పునరుద్ధరించుకునేందుకు, ఢిల్లీ,   బెంగాల్​ వంటి రాష్ట్రాల్లో అనుసరిస్తున్న వ్యూహాలను    స్వాగతించాల్సిందే.     నిజానికి  ముందుగా.. కాంగ్రెస్​తన ఉనికిని కోల్పోయినచోట  తిరిగి వెతుక్కోవాల్సిందే. 

జాతి మనోగతంలో..

బీజేపీ ప్రత్యర్థి కాంగ్రెసే​ దేశంలో 13 రాష్ట్రాల్లో బీజేపీ, -కాంగ్రెస్​ పార్టీలు ప్రధాన ప్రత్యర్థులు. మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎన్​డీఏ,  ఇండియా కూటముల భాగస్వాములతో కలిసి పరస్పరం పోటీ పడుతున్నారు.  రాజకీయాల్లో ఓడించడం వేరు, అస్తిత్వాన్ని కొల్లగొట్టడం వేరు. కాంగ్రెస్​ ను బీజేపీ ఓడించగలుగుతున్నది తప్ప, దాని అస్తిత్వాన్ని కొల్లగొట్టడం లేదు. 

యూపీ, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలను వదిలేస్తే..  మిగతా అన్ని  హిందీ రాష్ట్రాలలో బీజేపీకి, కాంగ్రెస్​ పార్టీయే ప్రధాన ప్రతిపక్షం, ప్రధాన​ ప్రత్యర్థి పార్టీ కూడా. ఒకరకంగా చెప్పాలంటే, బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలలో   కాంగ్రెస్​ పార్టీ తన అస్తిత్వాన్ని ఏమాత్రం కోల్పోలేదు. కాబట్టి ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్​  భవిష్యత్తుకు డోకా లేదు. ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్​ తన ఉనికి కోల్పోవడానికి కారణం ఆప్​, తృణమూల్​, వైయస్సార్​సీపీ లాంటి ప్రాంతీయ పార్టీలే. యూపీ,  బిహార్​, జార్ఖండ్​ లాంటి రాష్ట్రాల్లో ఎస్​పీ, ఆర్​జేడీ,  జేఎంఎం లాంటి విశ్వసనీయ పార్టీలతో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్​ ఉనికికి వచ్చిన ప్రమాదం ఏమీలేదు. అవి కాంగ్రెస్​​కు మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి  కూడా.

కల్లూరి శ్రీనివాస్​రెడ్డి, పొలిటికల్​ ఎనలిస్ట్​