దేశంలో ఒక వర్గం సీఏఏపై భగ్గుమంటోంది. గతంలో ఎవరూ చేయని ఆలోచన మోడీ సర్కారు చేశారని చెబుతోంది. నిజానికి, ఈ అమెండ్మెండ్కి విత్తనం వేసింది ప్రతిపక్షాలే! 2003 లోనే అప్పటి ప్రతిపక్షమైన కాంగ్రెస్ చాలా సూచనలు, సవరణలు ప్రతిపాదించింది. 2012లో ఇతర దేశాల్లో మైనారిటీలైనవాళ్ల సమస్యను పాజిటివ్‌గా పరిష్కరించమని ప్రధాన మంత్రికి సీపీఎం లేఖ రాసింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేయని పనిని మోడీ సర్కారు పూర్తి చేసింది.
సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్–2019పై దేశంలో కొన్ని వర్గాలు బాగా యాంటీ కేంపయిన్ నడుపుతున్నాయి. ఈ యాక్ట్ పార్లమెంట్లో పాసయిన కొద్ది రోజులకే నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్)కూడా రావడంతో కేంపయన్ మరీ జోరందుకుంది. సీఏఏతో ఇండియా చుట్టుపక్కలగల మూడు దేశాల నుంచి వచ్చేసిన ఆరు మతాలవాళ్లకు రూల్స్ ప్రకారం సిటిజెన్షిప్ ఇస్తారు. దీనిలో ఆ యా దేశాల నుంచి వచ్చే ముస్లింలెవరికీ సిటిజెన్షిప్ ఇవ్వరు. ఇక, ఎన్పీఆర్ ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో డోర్–టు–డోర్ ఎన్యూమరేటర్లు వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఈ వివరాలను అడ్డం పెట్టుకుని దేశంలో ఇప్పటికే ముస్లింలను జల్లెడ పట్టేసి గెంటేస్తారనే దుర్మార్గమైన ప్రచారం బాగా సాగుతోంది. అయితే, ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఒకటుంది. ఇది కొత్తగా తెచ్చిన యాక్ట్ కాదు. పాత యాక్ట్‌కి సవరించిన కొత్త చట్టం.
2003లో అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం సిటిజెన్షిప్ అమెండ్మెంట్ బిల్లుని ప్రతిపాదించింది. హోం మంత్రి హోదాలో ఎల్.కె.అద్వానీ బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టారు. దానిని పరిశీలనకోసం హోం వ్యవహారాలపై ప్రణబ్ ముఖర్జీ నాయకత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపారు. ముఖర్జీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు. ఈ కమిటీ మెంబర్లుగా కపిల్ సిబాల్, లాలూ ప్రసాద్ యాదవ్, ప్రమోద్ మహాజన్, రామ్ జెఠ్మలానీ తదితర 14మంది రాజ్యసభ సభ్యులు; కరుణాకరన్, పి.ఏ.సంగ్మా, వినయ్ కతియార్ వంటి 26 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఈ బిల్లుకుగల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలనుంచి, సంస్థల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. అన్ని మెయిన్ ఇంగ్లిష్, హిందీ పేపర్లలోనూ, ప్రాంతీయ భాషా పత్రికల్లోనూ ప్రకటనలిచ్చి బిల్లులోని అంశాలపై అభిప్రాయాలను సేకరించింది.
పార్లమెంటరీ కమిటీ ప్రకటన తర్వాత వచ్చిన అనేక అభిప్రాయాల్లో ముఖ్యమైనవి ఇవీ:
బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ల నుంచి వచ్చిన మైనారిటీ రెఫ్యూజీలకు ఇండియన్ సిటిజెన్షిప్ ఇవ్వాలి. వాళ్లందరికీ నేషనల్ ఐడీ కార్డులుకూడా జారీ చేయాలి.
1971 యుద్ధమప్పుడు ఇండియాకి వచ్చేసినవాళ్లకు సిటిజెన్షిప్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి.
కొన్ని దేశాలకు సంబంధించి అక్కడి ఎన్నారైలకు డ్యూయల్ సిటిజెన్షిప్ అందజేయాలి.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్నవారు ఇండియాకి వచ్చేసినట్లయితే… అలాంటివాళ్లకు సిటిజెన్షిప్ కల్పించాలి. బంగ్లాలో మెజారిటీ అయినవాళ్లు మన దేశానికి వస్తే పౌరసత్వం ఇవ్వరాదు.
టిబెటన్ రెఫ్యూజీలకు (బౌద్ధులకు) సిటిజెన్షిప్ కల్పించాలి.
ప్రతి ఒక్క ఇండియన్ సిటిజెన్కి ఉచితంగా నేషనల్ ఐడీ కార్డు ఇవ్వాలి.
ప్రతి సిటిజెన్షిప్ సర్టిఫికేట్ పైన సదరు కార్డు హోల్డర్ ఏ మతానికి చెందినవారనేది ఉండాలి.
ఇలాంటి విజ్ఞాపనలన్నీ తీసుకున్న తర్వాత ప్రణబ్కమిటీ రిపోర్ట్ అందజేసిన తర్వాత డిసెంబర్ 2003లో పార్లమెంట్‌కి మళ్లీ బిల్లు వచ్చింది. డిసెంబర్ 18న ఏకగ్రీవంగా ఆమోదించగా, డిసెంబర్ 22న ఎలాంటి అవరోధాలు లేకుండా (వితవుట్ ఎనీ ఆక్రోమనీ) లోక్‌సభ ఓకే చేసింది. వాజ్‌పేయి ప్రభుత్వం తెచ్చిన ఈ సవరణ బిల్లుకి కాంగ్రెస్, అన్నాడీఎంకే, ఆర్జేడీ సహా ఇతర ప్రతిపక్షాలన్నీ మద్దతు పలికాయి.
సీఏఏ–2003ని ప్రవేశపెట్టే సమయానికి రాజ్యసభలో కాంగ్రెస్ లీడర్‌గా మన్మోహన్ సింగ్ ఉన్నారు. ఆయన బిల్లుపై చర్చిస్తూ… ‘బంగ్లాదేశ్‌లో వేధింపులకు గురైన మైనారిటీల విషయంలో చాలా ఉదారంగా వ్యవహరించాలి. దేశ విభజన తర్వాత బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఉండిపోయిన అక్కడి మైనారిటీలు హింసకు, వేధింపులకు గురయ్యారు. ఇలాంటి దురదృష్టవంతులు మన దేశంలో ఆశ్రయం కోరినప్పడు వాళ్లకు లిబరల్(ఉదారం)గా సిటిజెన్షిప్నివ్వాలి’ అన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఉన్న నజ్మా హెఫ్తుల్లా… బిల్లులో పాకిస్థానీ మైనారిటీల్నికూడా కలపాలని సూచించారు. ఈ అభిప్రాయాలను హోం మంత్రి అద్వానీ పరిగణనలోకి తీసుకుని ‘ఇల్లీగల్ ఇమిగ్రెంట్ (చొరబాటుదారు)’కు, ‘బోనఫైడ్ రెఫ్యూజీ (అర్హుడైన శరణార్థి)’కి మధ్య తేడాల్ని వివరించారు. ‘మత పరమైన కారణాలతో హింసకు గురై అక్కడి నుంచి పారిపోయి వచ్చేసినవాళ్లు బోనాఫైడ్ రెఫ్యూజీలు అవుతారు. వాళ్లను అక్రమంగా చొరబడినవాళ్లతో (ఇల్లీగల్ ఇమిగ్రెంట్లతో)కలిపి చూడలేం’ అన్నారు అద్వానీ.
సీఏఏ–2003 ఇల్లీగల్ మైగ్రాంట్ల గురించే ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఎవరెవరిని అక్రమ చొరబాటుదారులుగా చూడాలి, ఎవరెవరిని సిటిజెన్షిప్కి అర్హులుగా గుర్తించాలి వంటి అంశాలకే పరిమితమైంది. అయితే, ఈ సవరణలో తొలిసారిగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్నార్సీ)ని దేశమంతా అమల్లోకి తీసుకురావాలని, ప్రతి ఒక్క ఇండియన్ సిటిజెన్కి జాతీయ ఐడీ కార్డు ఇవ్వాలని స్పష్టం చేసింది. దీనికోసం అసలు యాక్ట్ (ఇండియన్ సిటిజెన్షిప్ యాక్ట్–1950)లోని సెక్షన్ 14లో కొన్ని క్లాజ్లు చేర్చారు.
- ప్రతి సిటిజెన్ వివరాలను కచ్చితంగా నమోదు చేసి, ఐడీ కార్డు ఇవ్వాలి.
- ఈ వివరాల సేకరణకోసం నేషనల్ రిజిస్ట్రేషన్ అథారిటీ (ఎన్నారే) ఏర్పరచాలి.
కొత్త చట్టం వెనుక….
సిటిజెన్షిప్ యాక్ట్–2003 అమల్లోకి వచ్చాక కొన్ని రాష్ట్రాల్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్లను ఏరేయడం మొదలైంది. 2005లో ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం 1551 మందిని బంగ్లాదేశీయులుగా గుర్తించింది. వీళ్లంతా మహాకల్పద ఏరియాలో ఉంటున్న నామశూద్ర మథువా కమ్యూనిటీవాళ్లు. అదే ప్రాంతంలో పెద్ద సంఖ్యలో బంగ్లా ముస్లింలుకూడా ఉంటున్నా పట్నాయక్ ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఈ సమస్యపై కాంగ్రెస్, సీపీఎం స్పందించాయి. ఇతర దేశాల్లో మైనారిటీలైనవాళ్ల సమస్యను సానుకూలంగా చూడాలని 2012లో సీపీఎం నాయకుడు ప్రకాశ్ కరత్ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కి రాశారు. అప్పటి అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ ప్రధానికి ఒక మెమొరాండం ఇచ్చారు. ‘మతపరమైన వేధింపులవల్ల మన దేశానికి పారిపోయి వచ్చినవాళ్లను ఫారినర్లుగా చూడవద్ద’ని గగోయ్ కోరారు. దీనిపై మన్మోహన్ సింగ్ చర్యలు తీసుకోలేదు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక 2015 సెప్టెంబర్‌లో ఫారినర్స్ యాక్ట్–1946ని సవరించింది. 2014 డిసెంబర్ కంటే ముందు ఇండియాకి వచ్చేసిన పాకిస్థానీ, బంగ్లాదేశీ మైనారిటీలను ‘ఇల్లీగల్ ఇమిగ్రేంట్స్ (అక్రమ చొరబాటుదారులు)’గా పరిగణించకూడదని, దీర్ఘకాల వీసాకి అర్హులుగా గుర్తించాలని మోడీ సర్కారు స్పష్టం చేసింది. దీనినే ఫారినర్స్ అమెండ్మెంట్ ఆర్డర్–2015 అంటారు.
2016లో అప్పటి హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సిటిజెన్షిప్ సవరణ బిల్లును ప్రవేశపెట్టగా ప్రతిపక్షాలు కొన్ని అభ్యంతరాలు చెప్పాయి. ఆ బిల్లునే మళ్లీ పోయినేడాది డిసెంబర్ 11న పార్లమెంట్ ఆమోదించింది.