- చైర్‌పర్సన్‌పై అవిశ్వాసానికి ప్రయత్నాలు
- కౌన్సిల్లో బలం పెంచుకుంటున్న హస్తం
- షబ్బీర్ అలీతో కౌన్సిలర్ల భేటీతో సంతరించుకున్న ప్రాధాన్యం
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత క్రమంగా కౌన్సిల్లో పార్టీ బలాన్ని పెంచుకుంటోంది. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన కౌన్సిలర్లు ఘర్‌వాపసీ అవుతుండగా, బీఆర్ఎస్ కౌన్సిలర్లు సైతం కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీతో బుధవారం హైదరాబాద్‌లో కౌన్సిలర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ప్రధానంగా సంఖ్యా బలం పెంపు, చైర్‌పర్సన్‌పై అవిశ్వాస విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు 17 మంది కౌన్సిలర్లు ఉండగా, అవిశ్వాసానికి మరో ఎనిమిది మంది మద్దతు అవసరముంది. మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులున్నాయి. గత ఎన్నికల్లో 23 చోట్ల బీఆర్ఎస్, 12 చోట్ల కాంగ్రెస్, 8 చోట్ల బీజేపీ, 6 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు.
చైర్పర్సన్ఎన్నికకు ముందు ఇండిపెండెంట్లుగా గెలిచినవారు బీఆర్ఎస్లో చేరారు. దీంతో చైర్‌పర్సన్‌గా నిట్టు జాహ్నవి, వైస్‌చైర్‌పర్సన్‌గా ఇందుప్రియ ఎన్నికయ్యారు. ఆ తర్వాత 7గురు కాంగ్రెస్కౌన్సిలర్లు బీఆర్ఎస్కు మారారు. ఇటీవల స్టేట్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కౌన్సిలర్ల హస్తం బాట..
బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లు ఇటీవల హస్తం బాట పడుతున్నారు. ఇందులో కొందరు తమ సొంత గూటికి తిరిగి రాగా, మరి కొందరు బీఆర్ఎస్వాళ్లు ఉన్నారు. ఎన్నికలకు మందు మున్సిపల్వైస్చైర్పర్సన్ ఇందుప్రియ కూడా కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య 17కు చేరింది. ప్రస్తుతం చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్కు చెందిన నిట్టు జాహ్నవి ఉండగా ఆమెను పదవి నుంచి దించాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు భావిస్తున్నారు. అవిశ్వాసానికి 25 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉండగా కౌన్సిలర్లతో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ సమావేశం ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ లా మారింది.త్వరలోనే తమ పార్టీలోకి మరికొందరు కౌన్సిలర్లు చేరుతారని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది.
అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌లో చేరుతున్నారు:ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జరిగిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని షబ్బీర్అలీ పేర్కొన్నారు. కౌన్సిలర్లతో ఆయన హైదరాబాద్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అభివృద్ధి విషయంలో తమతో కలిసి నడిచే వాళ్లను స్వాగతిస్తామన్నారు. త్వరలోనే రూ.500 గ్యాస్‌సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పథకాలు అమలు అవుతాయన్నారు. డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్శ్రీనివాస్రావు, వైస్‌చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, కౌన్సిలర్లు సయ్యద్ అన్వర్, శివకృష్ణమూర్తి, జ్ఞానేశ్వరి, రవీందర్ గౌడ్, శంకర్రావు, ఉరుదొండ వనిత, మమత, ఆస్మా, మామిండ్ల రమేశ్, మానస, లత, లావణ్య, సుగుణ పాల్గొన్నారు.