
- కొంతమంది వ్యక్తుల గుత్తాధిపత్యంలోకి దేశం: ఖర్గే
- నెహ్రూ, పటేల్ ఒకే నాణేనికి రెండు వైపులు.. వారి మధ్య విభేదాలంటూ ప్రచారం
- ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇవన్నీ చేస్తున్నారని ఫైర్
- అహ్మదాబాద్లో సీడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభం
- కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హాజరు
అహ్మదాబాద్: దేశాన్ని మతపరంగా విభజించేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్, సంఘ్ పరివార్ కుట్రలు పన్నుతున్నాయని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దేశంలోని వనరులను సొంతం చేసుకోవడం ద్వారా ఒలిగార్కిక్ మోనోపలీ(కొందరి గుత్తాధిపత్యం) సృష్టిం చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ మోనోపలిలోని కొందరు వ్యక్తులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని నియంత్రించడం మొదలుపెట్టారని అన్నారు. మంగళవారం గుజరాత్లోని అహ్మదాబాద్ సిటీలో సర్దార్ పటేల్ మెమోరియల్ వద్ద ప్రారంభమైన రెండు రోజుల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు ఖర్గే, కాంగ్రెస్ మాజీ చీఫ్ లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. దేశంలోని ప్రాథమిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మతపరమైన విభజనకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ దిగ్గజ నేతలు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మధ్య విభేదాలు ఉండేవంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. నెహ్రూ, పటేల్ ఇద్దరూ గొప్ప నాయకులని, వారు ఒకే నాణేనికి రెండు వైపుల వంటి వారు అని కొనియాడారు. వారిద్దరి మధ్య ఎల్లప్పుడూ మంచి సంబంధాలు ఉండేవన్నారు. ‘‘నెహ్రూ, పటేల్ మధ్య రోజూ సంప్రదింపులు జరిగేవి. పటేల్ కు నెహ్రూ చాలా గౌరవం ఇచ్చేవారు. ఆయన ఇంటికి వెళ్లి కలిసేవారు. పటేల్ కు ఇబ్బంది కలగొద్దని ఆయన ఇంట్లోనే సీడబ్ల్యూసీ సమావేశాలు కూడా నిర్వహించారు” అని ఖర్గే తెలిపారు.
సీనియర్ నేతల హాజరు..
సీడబ్ల్యూసీ సమావేశాల్లో పార్టీ అగ్రనేతలు ఖర్గే, సోనియా, రాహుల్ తోపాటు సీడబ్ల్యూసీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, పీసీసీ చీఫ్ లు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతలు, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు, ఆఫీస్ బేరర్లు, మాజీ సీఎంలు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు సహా మొత్తం170 మంది నేతలు హాజరయ్యారు. ‘‘న్యాయ్ పథ్: సంకల్ప్, సమర్పణ్ ఔర్ సంఘర్ష్” థీమ్ తో బుధవారం సబర్మతి నదీతీరంలో జరిగే ముగింపు సమావేశంలో మొత్తం 1,700 మంది నేతలు పాల్గొననున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
డీసీసీలకు మరిన్ని అధికారాలు: సచిన్ పైలట్
కాంగ్రెస్ జిల్లా యూనిట్(డీసీసీ)లకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడంతోపాటు జవాబుదారీతనం పెంచేందుకు వీలుగా ఈ సమావేశాల్లో తీర్మానాలు చేయనున్నట్టు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సచిన్ పైలట్ వెల్లడించారు. సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ రోడ్ మ్యాప్, సంస్థాగత సంస్కరణలు, జిల్లా యూనిట్లకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం, జాతీయ సమస్యలపై అనుసరించాల్సిన విధానం వంటి అంశాలపై సమావేశాల్లో చర్చించి, తీర్మానాలు చేయనున్నట్టు ఆయన తెలిపారు.
సీఎం రేవంత్ హాజరు
ఏఐసీసీ సమావేశాలకు తెలంగాణ నుంచి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ వంశీ చంద్ రెడ్డి హాజరయ్యారు.
గాంధీజీ కళ్లజోడు, కర్రను దొంగిలిస్తరు..
మహాత్మా గాంధీతో సంబంధం ఉన్న సంస్థలను బీజేపీ, సంఘ్ పరివార్ వ్యక్తులు స్వాధీనం చేసుకుని, మహాత్ముడి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల చేతికి అప్పగిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. ‘‘వారణాసిలోని సర్వ సేవా సంఘ్ ను వాళ్లు టేకోవర్ చేశారు. గుజరాత్ విద్యాపీఠంలో ఏం జరిగిందో మీకందరికీ తెలుసు. ఇప్పుడు గాంధేయవాదులను, సహకార ఉద్యమకారులను పక్కన పెట్టేశారు. ఇలాంటి వ్యక్తులు గాంధీజీ కళ్లజోడు, కర్రను దొంగిలిస్తారు కానీ ఎన్నటికీ ఆయన సిద్ధాంతాలను పాటించరు. గాంధీజీ సిద్ధాంతాలను అనుసరించేది, పటేల్ వారసత్వాన్ని కొనసాగించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే” అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలని, బలమైన సంస్థ లేకుండా ఎంత ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నా అర్థరహితం అవుతుందన్నారు. కార్యకర్తలే కాంగ్రెస్ కు అసలైన బలమని, వారు సంస్థ అనే వస్త్రాన్ని నేసేందుకు ఉపయోగపడే దారాలు అని అన్నారు. పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తులో చేయాల్సిన పనులు, వ్యూహాల వంటివాటిపై నేతలంతా ఈ సమావేశాల్లో స్వేచ్ఛగా అభిప్రాయాలు పంచుకోవాలన్నారు.
దేశం కోసం వాళ్లు చేసిందేమీ లేదు..
దేశం కోసం 140 ఏండ్లుగా అవిశ్రాంత కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక వాతావరణం సృష్టించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఖర్గే విమర్శించారు. స్వాతంత్ర్య పోరాటంలో వారి పాత్ర ఏమీ లేదని, దేశం కోసం కూడా వాళ్లు చేసిందేమీ లేదన్నారు. నిజానికి సర్దార్ పటేల్ ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలే విరుద్ధంగా ఉండేవని, ఆర్ఎస్ఎస్ ను పటేల్ బ్యాన్ చేసిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలన్నారు. సర్దార్ పటేల్ కు కాంగ్రెస్ తగిన గౌరవం ఇవ్వలేదని, ఆయనకు తామే అసలైన వారసులమని బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ‘‘అంబేద్కర్ కు కూడా కాంగ్రెస్ ఎనలేని గౌరవం ఇచ్చింది. కానీ వాళ్లు ఈ నేతల దిష్టిబొమ్మలను, రాజ్యాంగం ప్రతులను దహనం చేశారు. రాజ్యాంగం మనువాద సిద్ధాంతాల ప్రకారం రాయలేదని వ్యతిరేకించారు. కాంగ్రెస్ మాత్రం రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతలను గౌరవిస్తుంది. రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా కాంగ్రెస్ కు తెలుసు” అని ఖర్గే చెప్పారు.