
వరంగల్, వెలుగు : గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. ప్రభుత్వం మారడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒక్కొక్కరు కారు దిగుతున్నారు. ఇప్పటి వరకు ఏడుగురు కార్పొరేటర్లు బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. వచ్చే మే నెల నాటికి వరంగల్ కార్పొరేషన్‍లో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కావాల్సిన మూడేళ్ల గడువు పూర్తికానుంది. ఆలోగా బీఆర్ఎస్ నుంచి మిగిలిన కార్పొరేటర్లను ఆకర్షించి మేయర్ పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు అడుగులు వేస్తున్నారు. ఓ వైపు అధికారం కొల్పోయి, మరోవైపు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండడంతో బీఆర్‍ఎస్ పెద్దలకు ఏం చేయాలో తోచడం లేదు. ఎవరు ఎప్పుడు పార్టీకి బైబై చెబుతారోనని టెన్షన్ పడుతున్నారు.
గ్రేటర్ పాలకవర్గానికి మే నెలతో మూడేళ్లు
రాష్ట్రంలో బీఆర్‍ఎస్ పార్టీ దాదాపు పదేళ్లు అధికారంలో ఉండడంతో హైదరాబాద్ తర్వాత అంతపెద్ద సిటీ అయిన గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠాన్ని రెండు సార్లు దక్కించుకుంది. ఈసారి ప్రజలు ఊహించని తీర్పు ఇవ్వడంతో బీఆర్ఎస్ అపొజిషన్‍లో కూర్చుంది. ఉమ్మడి జిల్లాలో గత ఎన్నికల్లో 10 సీట్లు బీఆర్‍ఎస్, 2 సీట్లు కాంగ్రెస్ గెలవగా..ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 2 స్థానాలను దక్కించుకున్నాయి. గ్రేటర్ పరిధిలోనూ కాంగ్రెస్ పార్టీనే ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ఇప్పుడు ఫండ్స్, పవర్ కోసం బీఆర్ఎస్ కౌన్సిలర్లు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇదే అదనుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి బీఆర్ఎస్ అసంతృప్త కార్పొరేట్లను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అయితే మేయర్‍పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మూడేళ్ల పదవీకాలం పూర్తవ్వాలనే నిబంధన ఉంది. 2021 మే 7న గుండు సుధారాణి మేయర్‍గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ లెక్కన వచ్చే మే నెల నాటికి పాలకవర్గం మూడేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. దీంతో అప్పటివరకు అనుకున్న తమ మిషన్ ను పూర్తిచేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లాన్ చేస్తున్నారు. ఇక బల్దియాలో మొత్తం 66 మంది కార్పొరేటర్లు ఉన్నారు.
2021 ఏప్రిల్ 30న గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. మే 3న వెలువడిన ఫలితాల్లో 4 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 48 స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుంది. 10 చోట్ల బీజేపీ, 3 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. అనంతరం ఇద్దరు ఇండిపెండెంట్లు మామిడాల రాజు, పూర్ణచందర్ , బీజేపీకి చెందిన చింతాకుల అనిల్.. బీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీ బలం 51కి పెరిగింది. కాంగ్రెస్ నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఒక్కరంటే ఒక్కరూ గెలవలేదు. విజయం సాధించిన నలుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ రజాలీ.. వరంగల్ వెస్ట్ నుంచే గెలిచారు.
కారు దిగిన ఏడుగురు సిట్టింగ్ కార్పొరేటర్లు
తాజాగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‍లో బీఆర్‍ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఏడుగురు సిట్టింగ్ కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారితో పాటు మాజీ మేయర్‍తో కలిపి మరో 10 మంది మాజీ కార్పొరేటర్లు, పలువురు సీనియర్లు కూడా హస్తం గూటికి చేరారు. తూర్పు నియోజకవర్గ పరిధి 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల టైంలో బీఆర్‍ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈనెల 3న మరో ఆరుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇందులో 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, చీకటి శారద (9వ డివిజన్), మామిండ్ల రాజు (31వ డివిజన్), షర్తాజ్ బేగం (48వ డివిజన్), ఎనుగుల మానస రాంప్రసాద్ (49వ డివిజన్), నెక్కొండ కవిత (50వ డివిజన్) ఉన్నారు. ఆ ఏడుగురే కాకుండా గ్రేటర్ మాజీ మేయర్ గుండా ప్రకాశ్, హనుమకొండ గ్రంథాలయ సంస్థ చైర్మన్, మాజీ కార్పొరేటర్ అజీజ్ ఖాన్, మాజీలు శామంతుల ఉషాశ్రీ, వీరగంటి రవీందర్, స్వామిచరణ్, తాడిశెట్టి విద్యాసాగర్, వేల్పుల మోహన్, గోల్కొండ రాంబాబు, అబూ బాకర్, సుంచు అశోక్ కూడా కాంగ్రెస్ గూటికి చేరారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బిగ్ టాస్క్
మే నెల నాటికి గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ముందు పెద్ద టాస్క్ కనిపిస్తోంది. ఇప్పటివరకు ఏడుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని 4 నుంచి 11కు పెంచుకుంది. దీంతో బీఆర్ఎస్ బలం 51 నుంచి 44కు తగ్గింది. అలాగే ఎక్స్ అఫీషియో సభ్యుల రూపంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొండా సురేఖ, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‍రెడ్డి ఉన్నారు. అవిశ్వాసం సమయంలో అవసరాన్ని బట్టి ఆ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఉంది. దీంతో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ బలం 15కు చేరింది. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ కు అటుఇటుగా ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పెట్టే తీర్మానానికి బీజేపీ నుంచి 9 మంది కార్పొరేటర్లు మద్దతు తెలపాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా అవిశ్వాసం పెట్టాలంటే సొంతంగా మరో 19 మంది కార్పొరేటర్లు అవసరం. మొత్తంగా మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు కాంగ్రెస్ పార్టీకి నాలుగు నెలల గడువు ఉంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో ఉన్న నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగం చేస్తున్నారు.