- ఇల్లెందు, అశ్వారావుపేట టికెట్లు తమ వాళ్లకే ఇవ్వాలంటూ పట్టు
- కొత్తగూడెం తమకే ఫైనల్ అయిందంటున్న సీపీఐ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ ఆశావాహుల్లో టికెట్ టెన్షన్ కొనసాగుతోంది. ఇల్లెందు, అశ్వారావుపేటలో తమ వారికే టికెట్లు ఇప్పించుకునేందుకు టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫస్ట్ లిస్ట్‌లో పేర్లు లేకపోవడంతో ఆశావాహులు డీలా పడ్డారు. సెకండ్ లిస్ట్ లోనూ హైకమాండ్ ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాలకు క్యాండిడేట్లను ప్రకటించలేదు.
ఓ వైపు నామినేషన్ల దాఖలుకు టైం దగ్గరపడ్తుండడంతో ఆశావాహులు అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు జిల్లాలో ఏకైక జనరల్ సీటైన కొత్తగూడెంపై పీటముడి కొనసాగుతోంది. కొత్తగూడెం సీటు తమకే ఫైనల్అయిందని సీపీఐ నేతలు పేర్కొంటు న్నప్పటికీ కాంగ్రెస్ నేతల్లో ఇంకా ఆశ చావలేదు.
ఆశావాహుల్లో ఉత్కంఠ
ఫస్ట్ లిస్ట్‌లో భద్రాచలం, రెండో లిస్ట్‌లో పినపాక క్యాండిడేట్లను ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట క్యాండిడెట్ల సెలెక్షన్‌పై మల్లాగుల్లాలు పడుతోంది. ఇల్లెందు టికెట్ కోరం కనకయ్యకు, అశ్వారావుపేట టికెట్ జారే ఆదినారాయణకు ఇవ్వాలంటూ పొంగులేటి పట్టుపడ్తున్నట్టు తెలిసింది. కనకయ్యకు కాకుండా చీమల వెంకటేశ్వర్లు, డాక్టర్ రవిబాబులలో ఎవరో ఒకరికి ఇవ్వాలని విక్రమార్క పట్టుపడ్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఓ దశలో టికెట్కనకయ్యకు ఫైనల్ అయిందనే ప్రచారం జరగడంతో ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ పలువురు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు.
కనకయ్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌లోని కొందరు లీడర్లతో బీఆర్ఎస్అభ్యర్థి, ఎమ్మెల్యే హరిప్రియ ఆందోళన చేయిస్తున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సున్నం నాగమణిలకు టికెట్ ఇవ్వాలంటూ భట్టి, రేణుక చక్రం తిప్పుతున్నట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
కొత్తగూడెం తమదే అంటున్న సీపీఐ
మరో వైపు కొత్తగూడెం సీటు పొత్తులో భాగంగా తమకే ఫైనల్ అయిందని సీపీఐ నేతలు చెప్తున్నారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా గ్రామస్థాయిలో ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్ ఆశావహుల్లో మాత్రం టికెట్‌పై ఇంకా ఆశ చావలేదు. కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్న టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణతో పాటు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ఎవరికి వారు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు.