కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు.. ఏ1, ఏ2, ఏ3లు: బీజేపీ ఎంపీ అర్వింద్
వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేసీఆర్, కేటీఆర్, కవిత ఎక్కడున్నారని ప్రశ్న
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు.. ఏ1, ఏ2, ఏ3లని, ఎవరికెవరు బీ టీమ్‌లు కాదని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో.. కాంగ్రెస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో ఉందని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని, అందుకే కాంగ్రెస్‌ను లేపాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. గురువారం బీజేపీ నేత బస్వ లక్ష్మీ నర్సయ్యతో కలిసి పార్లమెంట్ ఆవరణలో మీడియాతో అర్వింద్ మాట్లాడారు. కేసీఆర్ చెప్పినోళ్లకే కాంగ్రెస్ పార్టీలో టికెట్లు వస్తాయని తెలిపారు. ‘‘కాంగ్రెస్ వాళ్లను కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మనం గెల్వని చోట్ల కాంగ్రెస్ వాళ్లను గెలిపించుకోవాలి. తర్వాత ఆ ఎమ్మెల్యేలను కొనుక్కోవాలి’’ఇది కేసీఆర్ చేసే పని అని మండిపడ్డారు. పార్లమెంట్‌లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి బీఆర్‌ఎస్ జై కొట్టడంతో కాంగ్రెస్, -బీఆర్‌ఎస్ దొంగతనం బయటపడిందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు రూ.30 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. కనీసం 3 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. ఈ పైసలన్నీ కాళేశ్వరంలో ముంచుడు, కవితకు మళ్లించుడు అన్నట్లు కేసీఆర్ పనితీరు ఉందన్నారు.
ALSO READ:వానలు, వరదలకు.. 14 మంది బలి.. 20 మంది గల్లంతు
ఇండియా కాదు.. ఇటలీ అని పెట్టుకోవాల్సింది..
రాష్ట్రంలో వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పండుకున్నాడా? అని అర్వింద్ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా ప్రగతి భవన్, ఫాం హౌస్‌ల నుంచి తండ్రి, కొడుకు, కూతురు బయటకెళ్లి ప్రజలను ఆదుకోవాలన్నారు. వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో మంత్రులు పర్యటించాలని డిమాండ్ చేశారు. కరోనా టైమ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రజల్లో తిరిగారని, ఇప్పుడు భారీ వర్షాల సమయంలో కవితక్క ఎటు పోయిందని ప్రశ్నించారు. తెలంగాణ రోడ్లు కొట్టుకపోయాయని, దయచేసి బయటికెళ్లొద్దని రాష్ట్ర పోలీసులు తనకు మెసేజ్‌లు పెడుతున్నారని, ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంత్ రెడ్డి.. తన తమ్ముడు, బామ్మర్దులకు కాంట్రాక్ట్‌లు ఇస్తే రోడ్ల పరిస్థితి ఇలాగే ఉంటుందని ఫైర్ అయ్యారు. మరోవైపు, ప్రతిపక్షాల కూటమి పేరు ఇండియా కాకుండా, ఇటలీ అని పెట్టుకుంటే బాగుండేదని అర్వింద్ ఎద్దేవా చేశారు. అప్పుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్‌కు శాశ్వత అధ్యక్షుడిగా ఉండేవారన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిజాయితీగా కొట్లాడేటోళ్లకు కాంగ్రెస్‌లో చోటే లేదని, పైగా పార్టీ నుంచి పోవాలని పొగ పెడుతున్నారన్నారని విమర్శించారు.