- మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కోటకు బీటలు
- మొన్నటిదాకా ఆయన వెంటే ఉన్న లీడర్లు హస్తంలోకి క్యూ
- నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి దూకుడు
వర్ని, వెలుగు: బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫస్ట్ టైమ్ వ్యవసాయ శాఖామంత్రిగా, రెండో టర్మ్‌లో అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించిన బాన్సువాడ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పట్టు కోల్పోతుంది. శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో క్యాడర్ క్రమంగా చేజారిపోతుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం పనిచేసిన లీడర్లు కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఏనుగు రవీందర్‌రెడ్డి ఎల్లారెడ్డి టికెట్ ఆశించారు. ఆ స్థానాన్ని మదన్మోహన్ కు కేటాయించడంతో ఏనుగు రవీందర్‌రెడ్డికి పక్కనే ఉన్న బాన్సువాడ టికెట్ఇచ్చారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే టికెట్కన్ఫర్మ్ కావడంతో ఆయనకు నియోజకవర్గంపై పట్టు దొరకలేదు. తాను గెలిచినా, ఓడినా నియోజకవర్గంలోనే ఉండి క్యాడర్‌కు అండగా ఉంటానని కార్యకర్తల్లో భరోసా నింపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఏనుగు ఓడినా, ఆయన ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బాన్సువాడను అడ్డాగా చేసుకుంటే రాజకీయ భవిష్యత్ ఉంటుందని గ్రహించిన రవీందర్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ చేరికలను ప్రోత్సహిస్తున్నారు. పోచారం ముఖ్య అనుచరులను కాంగ్రెస్ గూటికి ఆకర్షిస్తున్నారు. పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నిల్చొనే అభ్యర్థికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
చేజారుతున్న లీడర్లు
పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రధాన అనుచరులుగా ఉన్న కోటగిరి ఎంపీపీ దంపతులు మల్లేపల్లి సునీత, శ్రీనివాస్‌రావు, కోటగిరి మాజీ ఎంపీపీ గంధపు పవన్, దోమల్ ఏడ్గి మాజీ ఎంపీటీసీ అనంత విఠల్ ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. వర్ని ఎంపీపీ దంపతులు మేక శ్రీలక్ష్మి, వీర్రాజు చేరిక కూడా దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. వీరు శనివారం రాత్రి ఏనుగు రవీందర్‌ను కలిసి పార్టీలో చేరికపై చర్చించారు. ఎమ్మెల్యే కుడిభుజంగా భావించే మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్ సైతం హస్తం వైపు చూస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల వర్ని మండలంలోని జాకోరా విండో చైర్మన్ ను కూడా కాంగ్రెస్వశం చేసుకుంది. బీఆర్‌ఎస్ కు చెందిన కృష్ణారెడ్డి చైర్మన్‌గా ఉండగా మెజార్టీ డైరెక్టర్లను తమ వైపు తిప్పుకొని అవిశ్వాసం నెగ్గారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన దశరథ్ విండో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వీరే కాకుండా నియోజకవర్గంలోని కోటగిరి, వర్ని, బీర్కూర్, బాన్సువాడ, చందూరు మండలాలకు చెందిన పలువురు కీలక నేతలు, తాజా మాజీ సర్పంచులు ఏనుగు రవీందర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
కాంగ్రెస్ లీడర్లతో భేటీల వెనక ఆంతర్యం ఏమిటో?
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి చిన్నకొడుకు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి ఇటీవల బీసీ సంక్షేమ శాఖామంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అదే సమయంలో పోచారం రెండో కొడుకు సురేందర్‌రెడ్డి సైతం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీతో, తర్వాత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లీడర్లతో వీళ్ల భేటీలు నియోజకవర్గంలో బీఆర్ఎస్ లీడర్లను అయోమయంలో పడేశాయి. క్యాజ్వల్ గానే భేటీ అయ్యారా? లేదంటే మరేదైనా కారణాలున్నాయా? అని అనుమానిస్తున్నారు.