
చండీఘడ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రకటనపై దృష్టి సారించింది. ఆదివారం రాహుల్ గాంధీ లుథియానాలో పర్యటించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ తరహాలోనే కాంగ్రెస్ సైతం పంజాబ్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారని ప్రకటించింది. జనం ఫోన్ కాల్స్ ద్వారా పార్టీ సీఎం అభ్యర్థి ఎంపిక చేసే అవకాశం కల్పించింది. ఈ రేసులో ప్రస్తుత సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ వైపు కూడా మరికొందరు జనం మొగ్గుచూపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్లో ఫిబ్రవరి 20న పోలింగ్ జరనుండగా.. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.