- అభివృద్ధికి ముందుకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
- నిండుకుండలా చెరువు
- అభయారణ్యంతో పర్యాటక సందడి
- మూలకుపడ్డ బోటింగ్, రిత హోటల్ సేవలు అంతంతమాత్రమే...
- ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో పెరగనున్న సౌకర్యాలు
వరంగల్/నర్సంపేట, వెలుగు : ప్రకృతి అందాలు.. రమణీయ దృశ్యాలకు నెలవు వరంగల్ పాకాల అభయారణ్యం. చెట్లు చేమలు, ఎత్తైనా కొండల నడుమ నిండుకుండలా కనిపించే కాకతీయుల సరస్సు. పక్షుల కిలకిలరావాలు, సేలయేటి గలగలలు.. పిల్లగాలులతో పర్యాటకులను మరో లోకంలోకి తీసుకువెళ్లే పాకాల అభయారణ్యాన్ని కాంగ్రెస్ సర్కారు ఎకో టూరిజంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో జీవ వైవిధ్యానికి ప్రతీకగా ఉండే ఏడు ప్రాంతాలను ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని బడ్జెట్ ప్రతిపాదనల్లో పెట్టగా..అందులో పాకాలకు సముచిత గౌరవం దక్కింది.
ప్రకృతి అందాల నడుమ..
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపురం మండలంలో పాకాల అభయారణ్యం ఉంది. వరంగల్‍కు 50 కిలోమీటర్ల దూరంలో సహజసిద్ధంగా పెరిగిన అడవులు, చిలుకలగుట్టల మధ్య1213 సంవత్సరంలో రెండవ ప్రతాపరుద్రుడి మునిమనుమడు.. మూడవ గణపతి దేవచక్రవర్తి నిర్మించిందే పాకాల చెరువు. దీనికి జాలు బంధం, తుంగబంధం, మాటు వీరారం, పసునూరు, సంగెం కాల్వలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా చెరువు చుట్టూ ఉండే 30–40 గ్రామాల్లోని 30 వేల ఎకరాలకు సాగునీరందించారు.
అంతేకాక.. నర్సంపేట టౌన్‌కు తాగునీరందిస్తున్నారు. 3.200 టీఎంసీల నిల్వసామర్థ్యం కలిగిన ఈ చెరువులో 32 ఫీట్లకు నీరు చేరితేనే మత్తడి పోస్తుంది. మండే ఎండాకాలంలోనూ చెరువు ఎండిపోయిన దాఖలాల్లేవు. పర్యావరణ కాలుష్య రహిత సరస్సుగా పాకాల ప్రపంచంలో 8వ స్థానం, దేశంలో 2 స్థానంలో నిలించిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో పాకాల చెరువు నిండుకుండలా మారి రోపోమాపో మత్తడి పోసేలా ఉంది.
కోట్లు ఖర్చుచేసి..మెయింటనెన్స్పట్టించుకోలే
గత ప్రభుత్వం అప్పట్లో ఎకో టూరిజం పేరుతో హడావుడి పనులు చేసింది తప్పితే ఆపై దాని మెయింటనెన్స్ పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడవి పర్యాటకులను ఆకర్షించడం లేదు. పాకాల సరస్సులో బోటింగ్ అనేది మూడు రోజుల ముచ్చటే అవుతోంది. పర్యాటకుల కోసం ప్రభుత్వం హరిత హోటల్ తరఫున ఆరు ఏసీ కాటేజీలు ఏర్పాటు చేసినా..వాటికిప్పుడు రిపేర్లు చేయాల్సిన పరిస్థితి ఉంది. కాలుష్యాన్ని నివారించే పేరుతో పాకాల కట్టపై బైకులు, కార్లు నిషేధించి..బ్యాటరీ ఆటో, సైకిళ్లు అందుబాటులోకి తెచ్చారు.
కేవలం వీఐపీల కోసమే వాటిని ఉపయోగించడంతో ఇప్పుడవి మూలకు పడ్డాయి. సీతాకోక చిలుకల పార్కు, ఔషధ మొక్కల పార్కు, త్రీడీ బొమ్మలతో పాటు ట్రెక్కింగ్,వాచ్‌టవర్స్, రోప్‌వేలు, జిప్‌లైన్, సైక్లింగ్, పిల్లల పార్కులు, ఉయ్యాలలు వంటి వాటికి రూ.కోట్లు ఖర్చు చేశామని గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చెప్పినప్పటికీ.. పట్టించుకోకపోవడంతో నిధులన్నీ వృథా అయ్యాయి. దీనికితోడు పాకాల ప్రాంతం అటవీ శాఖతో పాటు టూరిజం శాఖ చేతిలో ఉండడంతో క్రెడిట్ వచ్చే సమయాల్లో ముందట..సౌకర్యాలు కల్పించే చోట, పర్యాటకులకు జావాబుదారీతనం విషయంలో వెనక్కి వెళ్తున్నారు.
ఎకో టూరిజంతో..పాకాల అభివృద్ధికి చర్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే క్రమంలో అడవులు, పర్యావరణ శాఖకు రూ.1,064 కోట్లతో ప్రతిపాదనలు చేసింది. ఎకో టూరిజంలో ఏడు అటవీ ప్రాంతాలైన ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్స్, వికారాబాద్ అనంతగిరి సర్య్కూట్, ఖమ్మం కనకగిరి, ఆదిలాబాద్‍లోని కుంటాల వాటర్ ఫాల్, కొత్తగూడెంలోని కిన్నెరసాని, ఉమ్మడి వరంగల్‌లోని పాకాల, ఏటూరునాగారం సర్య్కూట్లను డెవలప్ చేయనున్నట్లు చెప్పింది. వరంగల్‌లోని పాకాల కేవలం అభయారణ్యంగానే కాకుండా అతిపెద్ద సరస్సు, వణ్య ప్రాణులు, అరుదైన పక్షులు, ఔషధ మొక్కలు ఉండడం అభివృద్ధిలో మరింత కలిసిరానుంది.
ప్రస్తుతం పాకాలలో కావాల్సిన స్థాయిలో సౌకర్యాలు, ట్రాన్స్పోర్ట్ లేకున్నా శని, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో వేలాది మంది పర్యాటకులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం వానల కారణంగా చెరువు నిండడం.. పచ్చని చెట్లతో ఆహ్లాదంగా ఉండడంతో జులై నుంచి జనవరి నెల వరకు టూరిస్టుల రాక మరింత ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజంలో భాగంగా నిధులు కేటాయిస్తే.. సరస్సులో బోటింగ్ ప్రారంభించడంతో పాటు పర్యాటకుల తాకిడి మేరకు వసతులు, రవాణా, ఇతరత్రా సౌకర్యాలు కల్పించవచ్చు. ‘పాకాల–గుండం చెరువు..చిలుకలగుట్ట’ ఒక సర్య్కూట్‍గా యాక్షన్ ప్లాన్ చేసి అభివృద్ధి చేస్తే పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశం ఉంది. తద్వారా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని జిల్లావాసులు భావిస్తున్నారు.