పార్లమెంటు ఎన్నికల్లో 13- నుంచి14 సీట్లు గెలుస్తం: మంత్రి ఉత్తమ్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం హుజూర్నగర్ నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ పార్కుగా అభివృద్ధి చేస్తామని మోసం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్  కుమార్ రెడ్డి. ఐదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని... అప్పు చేసి కట్టిన కాళేశ్వరం మూడేండ్లలోనే కూలిపోయిందని ఉత్తమ్ మండిపడ్డారు. జనవరి 14వ తేదీ ఆదివారం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండల కేంద్రంలో శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి ఉత్తమ్. ఈ సందర్భంగా ఆలయ పండితులు.. మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 
 
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  వచ్చే ఎన్నికల్లో 13 నుంచి14 లోక్‌సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మూడు లక్షల మెజారిటీతో  విజయం సాధిస్తారని ఆయన జోష్యం చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ కుటుంబం, బీఆర్‌ఎస్‌ నేతలే లాభపడ్డారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పూర్తిగా అవినీతిమయం.. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు పునరుద్ధరించి సాగునీటిని మరింత విస్తరిస్తాం.. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు పెంచుతామని తెలిపారు.  ప్రజలకిచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని మంత్రి చెప్పారు.