- ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అండతోనే జరిగిందంటూ బీజేపీ ఆరోపణ
- ఎమ్మెల్యేను బద్నాం చేస్తే సహించేది లేదన్న కాంగ్రెస్
- డీసీపీ ఆఫీసులో పరస్పరం ఫిర్యాదులు
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాలకు చెందిన బీజేపీ లీడర్ మెట్టుపల్లి జయరామారావుపై బుధవారం జరిగిన దాడి కాంగ్రెస్, బీజేపీ మధ్య గొడవకు కారణమైంది. రెండు పార్టీల లీడర్లు పరస్పర దూషణలు, ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. జయరామారావు బుధవారం స్థానిక బైపాస్ రోడ్డులో చేపలు కొంటుండగా తమకు చేయి తగిలించావంటూ ముగ్గురు వ్యక్తులు గొడవ పడ్డారు. మాటామాటా పెరగడంతో జయరామారావును తీవ్రంగా కొట్టారు. స్థానికులు అడ్డుకోవడంతో యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. గతంలో బైపాస్‌లోని ఓ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ జయరామారావు మున్సిపల్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడంతో పనులు నిలిపివేశారని, దీంతో కాంగ్రెస్ లీడర్ మంతెన జగన్‌మోహన్‌రావు కక్ష కట్టి దాడి చేయించారని జయరామారావు భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు జయరామారావు తమపై అకారణంగా దాడి చేశాడని దీటి సాయితేజ ఫిర్యాదు చేయడంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ
జయరామారావుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు ఆధ్వర్యంలో గురువారం మారుతినగర్‌లోని పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీసీపీ భాస్కర్‌కు మెమొరాండం అందజేశారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అండతోనే కొందరు వ్యక్తులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న మంచిర్యాలలో అలజడులు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
ఒక వ్యక్తి ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ బ్యాచ్‌లను మెయింటేన్ చేస్తూ వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మరోసారి ఇలాంటి దాడులు చేస్తే సహించేది లేదన్నారు. నిందితులపై చర్యలు తీసుకోకపోతే డీజీపీ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దుర్గం అశోక్, పెద్దపల్లి పురుషోత్తం, నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, గాజుల ముఖేశ్‌గౌడ్, తుల ఆంజనేయులు, కర్రె లచ్చన్న, జోగుల శ్రీదేవి పాల్గొన్నారు.
తప్పుడు ప్రచారాలను సహించం
మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక వ్యక్తిగత గొడవలను ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ పార్టీకి అంటగడుతున్నారని ఆ పార్టీ లీడర్లు మండిపడ్డారు. జయరామారావుపై ఉదయం 9.30 గంటలకు దాడి జరిగితే, రాత్రి 9 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేయడం వెనుక అంతర్యం ఏమిటో చెప్పాలన్నారు.జయరామారావు భార్య లక్ష్మి, రఘునాథ్‌రావు, ముఖేశ్‌గౌడ్ కలిసి ఎమ్మెల్యేను బద్నాం చేయాలనే ఉద్దేశంతో తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఘర్షణలు, గొడవలు జరిగినా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. ముగ్గురిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డీసీపీ భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. నాయకులు చిట్ల సత్యనారాయణ, పూదరి తిరుపతి, రామగిరి బానేశ్, సురిమిళ్ల వేణు పాల్గొన్నారు.