తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలవైపు మళ్లాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమయ్యే అవకాశాలుండగా, బీఆర్‌ఎస్‌కు మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. సార్వత్రిక ఎన్నికలు కాబట్టి ప్రధాని మోదీ కరిష్మా పనిచేస్తుందనే ధీమాతో బీజేపీ ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌తోపాటు బీజేపీ నుంచి కూడా గట్టి సవాల్ ఎదురయ్యే అవకాశాలున్నాయి.
తెలంగాణలో 2014లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ రెండోసారి ఎన్నికలు జరగాల్సిన 2019లో కాకుండా 2018లో ముందస్తుగానే ఎదుర్కొన్నారు. 2019 ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలతో కలిపి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం ఇష్టంలేని కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి రెండోసారి పగ్గాలు చేపట్టారు. కేసీఆర్ అప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ప్రధాన కారణం లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ అంశాల ప్రభావం ఉంటుందని భావించడమే. ఆయన అంచనా వేసినట్టే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ విజయ దుందుభి మోగించారు. కానీ, కేసీఆర్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు పొందలేకపోయారు. 2014లో 11 పార్లమెంటు స్థానాలను సాధించిన బీఆర్‌ఎస్ 2019లో తొమ్మిది ఎంపీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2014లో కేవలం ఒక ఎంపీ స్థానంలో గెలిచిన బీజేపీ 2019లో మాత్రం నాలుగు స్థానాలు పొందింది. అదేవిధంగా 2014లో రెండు స్థానాలు సాధించిన కాంగ్రెస్ 2019లో మూడు ఎంపీ స్థానాలను గెలిచింది. మజ్లీస్ పార్టీ రెండు ఎన్నికల్లోనూ తన ఏకైక స్థానాన్ని నిలబెట్టుకుంది. 2014లో రెండు స్థానాలు గెలిచిన టీడీపీ 2019లో ఖాతా తెరవలేదు. ఈ అంశాలను పరిశీలిస్తే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా ఉంటాయని చెప్పవచ్చు.
జాతీయ అంశాలే కీలకం
అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్ర, స్థానిక అంశాలు ప్రభావితం చేస్తాయి. కానీ, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం జాతీయ అంశాలు కీలకంగా ఉంటాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలు మోదీ వర్సస్ రాహుల్‌గా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలో 28 పార్టీలు ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి ఏర్పడిన కొత్తలోనే కర్ణాటకలో కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించడం, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణలో కూడా పగ్గాలు చేపట్టడం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశాలు. ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖిగా తలపడ్డ మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో దేశంలో మోదీ ప్రధానిగా మరోసారి పగ్గాలు చేపట్టడం ఖాయమనే ప్రచారం మొదలయ్యింది. ఈ ప్రచారం నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ మూడో స్థానంలో ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ కీలకంగా మారే అవకాశాలున్నాయి.
రేవంత్‌కు సవాల్‌గా లోక్‌సభ ఎన్నికలు
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన రాష్ట్ర కాంగ్రెస్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి లోక్‌సభ ఎన్నికలు సవాలుగా మారనున్నాయి. ఉత్తరాదిన హిందీ రాష్ట్రాల్లో రోజురోజుకూ బలహీన పడుతున్న దృష్ట్యా కాంగ్రెస్ అధిష్టానం దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలపై ఆశలు పెట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధిక స్థానాల్లో గెలిస్తేనే రేవంత్‌కు పార్టీ హైకమాండ్ వద్ద అనుకూల వాతావరణం ఉంటుంది. లేకపోతే పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా గొంతులెత్తే అవకాశాలుంటాయి. రేవంత్ ఎంపీగా గెలిచిన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో కాంగ్రెస్ ఓడిపోవడం ఆయనకు సవాలే. రాష్ట్ర కాంగ్రెస్‌లోని హేమాహేమీ నాయకులంతా ఎమ్మెల్యేలుగా గెలవడంతో దీటైన ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేయడం కూడా ఆ పార్టీకి కత్తిమీద సామే. బీజేపీ దేశవ్యాప్తంగా పలు భావోద్వేగాల నిర్ణయాలతో ముందుకెళ్తుంది.
సున్నిత అంశాలే బీజేపీ అస్త్రాలు
కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి సున్నితమైన అంశాలను తనకు అనుకూలంగా మల్చుకున్న బీజేపీ.. ఏప్రిల్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే జనవరి 22వ తేదీన అయోధ్యలో రామాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసింది. దీనికి సంబంధించిన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా పక్షం రోజులపాటు నిర్వహించేలా బీజేపీతో పాటు సంఘ్‌పరివార్ కూడా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇటీవల బెంగాల్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మరోసారి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంశాన్ని లేవనెత్తారు. ఈ పరిణామాలను గమనిస్తే బీజేపీ సున్నితమైన అంశాలను ఎన్నికల అస్త్రాలుగా మల్చుకోనుందని తేటతెల్లమవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ ఆశించినట్టు హిందూ, ముస్లిం ప్రాతిపదికన జరగకపోయినా, లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి రాష్ట్రంలో కూడా ఈ భావోద్వేగాలు ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
ఫలించని బీసీ సీఎం నినాదం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ ప్రకటనలు బీజేపీకి ఆశించిన ఫలితాల్నివ్వలేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై కార్యాచరణను వేగవంతం చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో మేలు కలగవచ్చు. అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్షుడిని మార్చిన బీజేపీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న తీరులా ఇప్పుడు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్ర చీఫ్‌ను మారుస్తారనే వార్తలొస్తున్నాయి. లిక్కర్ కేసులో కవిత అరెస్టుకు సంబంధించిన ఎపిసోడ్‌లో పార్టీకి నష్టం జరిగిందనే భావనతో ఉన్న బీజేపీ ఇప్పుడు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. ఉత్తర తెలంగాణ, గ్రేటర్‌లో బీజేపీకి బలమైన కేడర్ ఉన్నా, పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ తరఫున ఉన్న నలుగురు ఎంపీలూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలను ఎదుర్కొన్నారు. ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోగా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలోనూ బీజేపీ పరాజయం పాలైంది. ఇక్కడ బీజేపీ రెండు చోట్ల రెండో స్థానంలో నిలవగా మరో ఐదు స్థానాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈ పరిణామాలు ఆ పార్టీకి ప్రమాద ఘంటికలే.
సర్వశక్తులూ ఒడ్డనున్న కాంగ్రెస్
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో తన పట్టును నిలబెట్టుకునేలా సర్వశక్తులను ప్రయోగించడం ఖాయం. కర్నాటకలో ఐదు గ్యారంటీల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో కూడా ఆరు గ్యారంటీల హామీతో విజయవంతం అయ్యింది. కర్నాటకలో గ్యారంటీల అమలులో కొంత లోటుపాట్లు ఉండడంతో పార్లమెంట్ ఎన్నికల్లోగా అక్కడ బీజేపీ పుంజుకునే అవకాశాలున్నాయనే వార్తలున్నాయి. కర్నాటక పరిణామాలను గమనిస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆరు గ్యారంటీల అమలే కీలకం కానున్నాయి. అందుకే రేవంత్ ప్రమాణ స్వీకారం రోజునే తొలి సంతకం ఈ గ్యారంటీలపైనే చేశారు. ఈ పథకాలను లోటుపాట్లు లేకుండా విజయవంతంగా అమలు చేస్తే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూరుస్తాయి. బీజేపీ భావోద్వేగాల ఎజెండాను దీటుగా ఎదుర్కొనేలా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కులగణన హామీని ముందుకు తెచ్చింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా త్వరలో కులగణన చేపట్టేందుకు చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.
కాంగ్రెస్ ప్రత్యర్థిగా బీజేపీ
రాష్ట్రంలో నిర్ణయాత్మకమైన ముస్లిం ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇచ్చారు. గ్రేటర్‌లోని ముస్లింలు బీఆర్‌ఎస్ పక్షాన నిలవగా, ఇందుకు భిన్నంగా ఇతర జిల్లాల్లో బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటే అని విశ్వసించిన ముస్లింలు ఎంఐఎం పిలుపును కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్‌కే ఓటేశారు. లోక్‌సభ ఎన్నికలొచ్చేసరికి ముస్లింల తీర్పు కచ్చితంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటుంది. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌నే చూస్తున్న ముస్లింలు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను కాదని కాంగ్రెస్ పక్షానే నిలిచే అవకాశాలున్నాయి. కొన్ని సెగ్మంట్లలో బీజేపీకి కూడా హిందూ ఓటర్ల ఆదరణ లభించవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అధిక అసెంబ్లీ స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతోనే ప్రధాన పోటీ ఉండే అవకాశాలున్నాయి. గ్రేటర్‌లో బీఆర్‌ఎస్ అధిక స్థానాలు సాధించినా లోక్‌సభ ఎన్నికలొచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రధాన పోటీ పార్టీగా ఉండవచ్చు. ఉమ్మడి మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్‌లో కూడా లోక్‌సభ ఎన్నికలొచ్చేసరికి బీజేపీ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పీపుల్స్ పల్స్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు శాసనసభ ఎన్నికల్లో స్థానిక అంశాల ఆధారంగా ఓటు వేస్తామని, లోక్‌సభ ఎన్నికల్లో మోదీకే ఓటు వేస్తామని కొందరు చెప్పడం గమనార్హం. ఈ పరిణామాల దృష్ట్యా అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉన్నా లోక్‌సభ ఎన్నికలొచ్చేసరికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మధ్యనే రాష్ట్రంలో ప్రధానంగా పోటీ జరగవచ్చు.
పార్టీని కాపాడుకోవడమే బీఆర్‌ఎస్‌కు సమస్య
గత లోక్‌సభ ఎన్నికల్లో కారు,-సారు, -పదహారు నినాదంతో పోటీ చేసిన బీఆర్‌ఎస్ పరిస్థితి ఇప్పుడు కొంత భిన్నంగా కనిపిస్తోంది. అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్ నాయకులు, కేడర్ షాక్‌లో ఉన్నారు. మరోవైపు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన మొదటి రోజు నుంచే గత పాలకుల విధానాలను సమీక్షించడం ద్వారా బీఆర్‌ఎస్‌పై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల, విద్యుత్ రంగం అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో బీఆర్‌ఎస్‌లో ఆందోళన నెలకొంది. మరోవైపు బీఆర్‌ఎస్‌కు పెద్ద సవాలు తమ ఎమ్మెల్యేలను, కేడర్‌ను కాపాడుకోవడమే. ఓటమితో నిరాశ నిస్పృహల్లో ఉన్న పార్టీ కేడర్‌లో ఒకవైపు ఉత్సాహాన్ని నింపుతూనే, మరోవైపు ముఖ్యనేతలు పార్టీని వీడకుండా కాపాడుకోవడం కీలకం. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లో రాణించాలని ఆశించి ఇతర రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్‌కు ఇప్పుడు ఇంట గెలవడమే పెద్ద సవాలుగా మారనుంది.
- ఐ.వి. మురళీ కృష్ణ శర్మ,రీసెర్చర్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ