హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కుల గణనపై 2024, అక్టోబర్ 2న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని టీపీసీసీ ఆదేశించింది. శుక్రవారం (నవంబర్ 1) టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టీ శ్రేణులకు కులగణనపై దిశానిర్దేశం చేశారు.
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేపడుతోందని.. నవంబర్ 6వ తేదీ నుంచి గ్రామాలలో కుల గణణ కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు.ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచన.. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఆదేశాల మేరకు కుల గణనపై కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాల్సి ఉందన్నారు. పార్టీ తరపున కులగణన సమాచారం పంపడం జరుగుతుందని.. నవంబర్ 2వ తేదీన జిల్లా కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పరంగా ఈ సమాచారాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలని సూచించారు.
ఈ సమావేశానికి జిల్లాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్, దేవాలయ, గ్రంథాలయ కమిటీలు, సీనియర్ నాయకులను ఆహ్వానించి సమాచారాన్ని సంపూర్ణంగా చదివి మీ జిల్లాల్లో కులగణన ప్రాధాన్యత, ప్రచార అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా భావించి పెద్దఎత్తున విజయవంతం చేయాలని క్రాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ సూచించింది.