- మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
- రుణమాఫీ పూర్తయ్యాక బీఆర్ఎస్లోఎవరూ ఉండరని కామెంట్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో సీఎం ఉండడం ఎంత ముఖ్యమో ప్రతిపక్ష నేత ఉండడం కూడా అంతే ముఖ్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ప్రజలంటే కేసీఆర్కు లెక్క లేదని అందుకే అసెంబ్లీకి రావడం లేదన్నారు. అసెంబ్లీకి రానప్పుడు ఆ పార్టీకి గుర్తింపు అవసరం లేదని, అసలు తాము బీఆర్ ఎస్ ను లెక్కలోకే తీసుకోవడం లేదన్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీలోని తన ఆఫీస్లో వెంకట్రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.
పార్లమెంట్ ఎంత సేపు జరిగినా 80 ఏళ్లు వయసున్న మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్ వచ్చి చర్చల్లో పాల్గొంటారని కోమటిరెడ్డి గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్సే గెలుస్తుందని, రేవంతే సీఎంగా ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే లక్షన్నర వరకు రుణమాఫీ చేశామని, ఒకేసారి రూ.31 వేల కోట్ల రుణమాఫీ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదన్నారు.
రూ.2 లక్షలు రుణమాఫీ చేశాక బీఆర్ ఎస్ లో ఎవరూ ఉండరని మంత్రి తెలిపారు. ఇప్పటికే 10 మంది చేరారని, మరో 15 మంది వస్తే కాంగ్రెస్ లో బీఆర్ ఎస్ ఎల్పీ విలీనం అవుతుందన్నారు. మిగతా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారన్నారు. ఉదయం 3.30 గంటల వరకు దేశంలో ఏ అసెంబ్లీ జరగలేదని మంత్రి తెలిపారు.