పాత కాపులతోనే .. కాంగ్రెస్ సీనియర్ల ఫైట్!

  • నల్గొండలో కంచర్ల భూపాల్ రెడ్డితో వెంకటరెడ్డికి పోటీ
  • కోదాడ, హుజూర్​నగర్‌‌లో సిట్టింగ్‌లు వర్సెస్ ఉత్తమ్​ఫ్యామిలీ
  • మునుగోడులో కూసుకుంట్లతో రాజగోపాల్​ రెడ్డి వార్​ 
  • పేటలో మంత్రి జగదీశ్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి 

నల్గొండ, యాదాద్రి, వెలుగు:  ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పాతకాపులతోనే కాంగ్రెస్​దిగ్గజాలు తలపడే పరిస్థితి కనిపిస్తోంది.  సీఎం కేసీఆర్‌‌  ఉమ్మడి జిల్లాలోని 12 మంది సిట్టింగ్​లకే టికెట్లు డిక్లేర్​ చేయడంతో 2018 ఎన్నికల సీన్ రిపీట్ అయ్యేలా ఉంది.  12 సీట్లలో బీఆర్ఎస్​ తొమ్మిది చోట్ల గెలిస్తే కాంగ్రెస్‌ మూడు చోట్ల మాత్రమే గెలిచింది.   కాంగ్రెస్​హేమాహేమీలైన జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్​భార్య పద్మావతి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి లాంటి సీనియర్లు ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన హుజూర్​నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో హుజూర్​నగర్​, మునుగోడు ​స్థానాలను కూడా కోల్పోవాల్సి వచ్చింది. నకిరేకల్​ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ మారడంతో ఉన్న ఒక్కసీటు కూడా పోయింది. 

సీనియర్లకు తప్పని వార్..

కాంగ్రెస్​హైకమాండ్​ సీనియర్లను కాదని జిల్లాలో మరొకరికి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో సిట్టింగులు, సీనియర్ల నడుమ పోరు తప్పేలా లేదు.  హ్యాట్రిక్​ కోసం ఉవ్విళ్లూరుతున్న మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్​ రెడ్డి మధ్య టఫ్​ఫైట్ జరిగేలా ఉంది. ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయిన దామోదర్​రెడ్డికి ఈ సారి కొంత ఎడ్జ్‌ కనిపిస్తోందని సర్వేలు చెబుతున్నాయి. ఇక హుజూర్‌‌నగర్‌‌ ఉపఎన్నికల్లో సిట్టింగ్​స్థానం కోల్పోయిన పీసీసీ మాజీ చీఫ్ ఎంపీ ఉత్తమ్​ కుమార్​రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే సైదిరెడ్డికి,  కోదాడలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన తన భార్య మాజీ ఎమ్మెల్యే పద్మావతి, బొల్లం మల్లయ్య యాదవ్‌కు మధ్య గట్టి పోటీ జరగనుంది.

కొడుకుల కోసం జానా పాట్లు 

2018లో నోముల నర్సింహయ్య చేతిలో ఓడిపోయిన జానారెడ్డి, నర్సింహయ్య మరణించాక జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కొడుకు భగత్​ చేతిలోనూ ఓటమి పాలయ్యారు. దీంతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన జానారెడ్డి వచ్చే ఎన్నికల్లో తన కొడుకులు రఘువీర్, జయవీర్​ రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  వారికి టికెట్ల విషయంలో క్లారిటీ రాకున్నా.. నాగార్జునసాగర్​, మిర్యాలగూడలో ప్రచారం మాత్రం మొదలు పెట్టారు.  జానారెడ్డికి ఒకప్పటి కుడిభుజంగా ఉన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్​రావుపై పెద్ద కొడుకు రుఘవీర్, ​ సొంత నియోజకవర్గం సాగర్‌‌లో భగత్​పై జయవీర్​బరిలో దిగుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. 

కోమటిరెడ్డి బ్రదర్స్​పైనే ఫోకస్ 

కోమటిరెడ్డి బ్రదర్స్​పైన బీఆర్ఎస్​ హైకమాండ్ ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.  నల్గొండ, మునుగోడు, నకిరేకల్​, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో వీరి పట్టు ఉంది.  నల్గొండలో ఫస్ట్​ టైం బీఆర్ఎస్​ ఎమ్మెల్యేగా గెలుపొందిన కంచర్ల భూపాల్​రెడ్డి, మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన కూసుకుంట్లకు  రెండోసారి టికెట్​ఇవ్వరని ప్రచారం జరిగింది. కానీ,  హైకమాండ్​ వీరిపైపే మొగ్గుచూపింది.  కోమటిరెడ్డి 2018లో ఓడిపోయినా 2019లో భువనగిరి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే.  వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన మరోసారి భూపాల్‌రెడ్డితోనే తలపడాల్సి రావడం ఆసక్తికరంగా మారింది.  మునుగోడులో ఓడిపోయిన రాజగోపాల్​రెడ్డి కూడా మళ్లీ కూసుకుంట్లతోనే పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి బదులు ఆయన భార్య లక్ష్మి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 

కాంగ్రెస్‌లోకి వీరేశం!  

నకిరేకల్​మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి టికెట్​ ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్​లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లైన్​ క్లియర్‌‌ అయ్యిందని,  ఒకట్రెండు రోజుల్లో అనుచరులతో మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకుంటారని సమాచారం.  కోమటిరెడ్డి శిష్యుడిగా రాజకీయ గుర్తింపు పొందిన చిరుమర్తి బీఆర్ఎస్​లో చేరినప్పటి నుంచి బ్రదర్స్​ కోపంతో ఉన్నారు.  చిరుమర్తిని దెబ్బకొట్లాలంటే వీరేశంతోనే సాధ్యమవుతుందని కేడర్​నమ్ముతోంది.  నకిరేకల్‌తో పాటు తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లోనూ వీరేశం  ప్రభావం ఉంటుందని టాక్ నడుస్తోంది.  ఇక తుంగతుర్తిలో కాంగ్రెస్​కు సరైన క్యాండేట్​ లేకపోవడం ఎమ్మెల్యే కిషోర్‌‌కు అనుకూలంగా మారగా..  దేవరకొండలో రవీంద్రనాయక్‌పై క్యాడర్‌‌లో వ్యతిరేకత కనిపిస్తోంది. 

మంత్రి పదవిపై గొంగిడి సునీత ఆశలు..

మూడోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే వచ్చే కేబినెట్​లో మంత్రి పదవి లభిస్తుందని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత భావిస్తున్నారు.  కానీ, రెండు సార్లు వరుసగా గెలిచిన సునీత పట్ల పార్టీ కేడర్‌‌లో కొంత అసంతృప్తి నెలకొంది.  కాంగ్రెస్ బీసీ నుంచి బీర్ల అయిలయ్యను రంగంలోకి దింపితే  సునీత ఇబ్బందులు ఎదుర్కోకక తప్పదని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇక భువనగిరి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి బీఆర్ఎస్​లో చేరడం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​ రెడ్డికి కలిసొచ్చింది.  కానీ, కోమటిరెడ్డి బ్రదర్స్, పార్టీ హైకమాండ్​ ఎంపిక చేసే అభ్యర్థులను బట్టి భువనగిరి ఎంపీ సెగ్మెంట్​లో కాంగ్రెస్​, బీఆర్ఎస్​ మధ్య ఏ మేరకు పోటీ తేలనుంది.