కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు : : కేటీఆర్

  • ప్రజల్లో ముందు గ్యారంటీ సంపాదించుకోవాలి
  • గంభీరావు పేట డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో మంత్రి

రాజన్నసిరిసిల్ల, వెలుగు: కాంగ్రెస్​కు ఓటేస్తే ఆగమైపోతారని, ఆ పార్టీ ఇచ్చే గ్యారంటీలకు వారెంటీ లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల్లో ముందు గ్యారెంటీ సంపాదించుకోవాలని కాంగ్రెస్ లీడర్లకు సూచించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో 378 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లు పైసలిస్తే తీసుకోండి. కానీ, ఓటేస్తామని ఒట్టు మాత్రం వేయొద్దు. బీఆర్ఎస్​కు ఓటేసి గెలిపించాలి. మొండి చేయికి ఓటేస్తే జీవితాలన్నీ ఆగమైపోతాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు. కాంగ్రెస్​కు అధికారం ఇస్తే ఆరు గ్యారంటీలు పక్కా వస్తయ్. అవేంటో చెప్తా వినండి.. మొదటి గ్యారంటీ కరెంట్ పోయి చీకటి మిగులుతది. రెండో గ్యారంటీ కింద నీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కాల్సి వస్తది. మూడో గ్యారంటీ కింద రైతులు ఎరువుల కోసం క్యూలైన్లలో చెప్పులు పెట్టి నిలబడాలి. నాలుగో గ్యారంటీ కింద సీల్డ్ కవర్లో ఏడాదికి ఒక సీఎం మారుతడు. ఐదో గ్యారంటీ కింద జీపీలు తిరిగి తండాలుగా మారుతయ్. ఆరో గ్యారంటీ కింద విద్య, వైద్యంలో వెనుకబడటం ఖాయం” అని కేటీఆర్ విమర్శించారు.

65 ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేసిన్రు

కేసీఆర్ చేసిన అభివృద్ధి కంటే డబుల్ చేస్తామని కాంగ్రెసోళ్లు అంటున్నారని, 65 ఏండ్లు అధికారం ఇస్తే ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే మాయ మాటలు చెప్తారని, వాటిని నమ్మొద్దని సూచించారు. గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్​కు ఇంగ్లీష్​లో బోధన అందిస్తున్నామని అన్నారు. అందరూ ఇంగ్లీష్​లో మాట్లాడుతుంటే గుండె గర్వంతో ఉప్పొంగుతున్నదని చెప్పారు. తన పిల్లల్లాగే పేద పిల్లలు కూడా ఇంగ్లీష్​లో మాట్లాడే పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. గంభీరావుపేట నెత్తిన ఉన్న నర్మాల ఎగువ మానేరులో ఎప్పుడూ నీళ్లుంటాయని చెప్పారు. మల్లన్నసాగర్ నుంచి కూడెల్లి వాగు ద్వారా వచ్చే నీటితో నర్మాల నిండుతున్నదన్నారు. కాళేశ్వరం లింక్ ప్యాకేజీ 9 ద్వారా చేపట్టిన ఎత్తిపోతల పనులు పూర్తయ్యాయని వివరించారు. దీంతో కూడా నర్మాల నింపుతామన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో రూ.3కోట్లతో వెజిటేబుల్ మార్కెట్ నిర్మిస్తామన్నారు. నర్మాల వద్ద మరో రెండు హై లెవెల్ వంతెనలు ఏర్పాటు చేస్తామని వివరించారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు తాను బతికున్నంత కాలం సేవ చేస్తూనే ఉంటానని ప్రకటించారు.