కాంగ్రెస్​తోనే..రాజ్యాంగ రక్షణ

కాంగ్రెస్​తోనే..రాజ్యాంగ రక్షణ

దేశమంతటా సార్వత్రిక ఎన్నికల వార్‌ వాతావరణం నెలకొంది. నిజానికి ఎన్నికలంటే యుద్ధ వాతావరణం ఉండకూడదు.  ప్రజాస్వామ్యంలో  ప్రతి పౌరునికి తనకు నచ్చిన వ్యక్తిని, నచ్చిన పార్టీని ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది.  ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పార్టీ ఐదేండ్లపాటు పరిపాలించే హక్కు కలిగి ఉంటుంది.  కానీ,  గత పదేండ్లకు పైగా గెలిచిన పార్టీ అమాంతంగా పార్టీ సభ్యులను మార్పించి, తమ పార్టీ పాలనను గద్దెనెక్కించడం, ప్రభుత్వాలను కూల్చివేయడం  ఇలాంటి  అప్రజాస్వామిక చర్యలు ఈ ఎన్నికల్లో  పరాకాష్టకు చేరాయి. అందుకు కారణం కేంద్రంలో మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చి తీరాలన్న పట్టుదల.  అదీ,  ఏం చేసైనా సరే  మళ్లీ గద్దెనెక్కాలన్నది  బీజేపీ పన్నాగం. ఏ పార్టీ అయినా సరే ఎన్నిసార్లయినా గెలవాలనుకోవడం తప్పుకాదు. కానీ, ఎలాగైనాసరే  గెలవాలనుకోవడం సరైంది కాదు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడిన కాంగ్రెస్​

 ప్రజాస్వామ్య  ప్రభుత్వాల యుగంలో  ప్రజలకోసం పనిచేయడం,  ఇది ప్రజలచేత పరిపాలింపబడుతున్న  ప్రభుత్వమేనని ప్రజలు భావించేలా చేయ డం ద్వారా  ప్రజాభిమానాన్ని పొంది గెలవవచ్చు.  అలా చేసి  ప్రజాస్వామ్యాన్ని భద్రంగా  కాపాడి, రాజ్యాంగాన్ని రక్షించి దేశాన్ని అభ్యుదయపథంలోకి నడిపించి 56 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్‌.  అనేక సమస్యలతో,  మతకలహాలతో, పేదరికంతో,  సామాజిక అంతరాలతో,  నిరక్షరాస్యతతో  కొట్టుమిట్టాడుతున్న భారతదేశాన్ని ఐక్యపరచి మతాతీత లౌకిక, సోషలిస్టు పంథాల్లో  దేశాన్ని అభివృద్ధి చేసింది  నెహ్రూ.  

పేదరిక నిర్మూలన కోసం, రాచరిక అవశేషాలను రద్దు చేయడం కోసం రాజభరణాల రద్దు,  బ్యాంకుల జాతీయీకరణ చేసిన మహా నాయకురాలు ఇందిరాగాంధీ.  బంగ్లాదేశ్‌ విముక్తి ప్రదాత.  దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టడానికి అణుశక్తి గల శక్తిగా నిలబెట్టింది కాంగ్రెస్‌.   ‘జైజవాన్‌.. జై కిసాన్‌’ అని రైతును సైనికుడితో సమానంగా గౌరవించింది శాస్త్రీజీ.  ఆధునిక టెక్నాలజీని, ఐటీని దేశానికి ఆహ్వానించి కోట్లమందికి ఉద్యోగకల్పన చేసింది రాజీవ్‌గాంధీ.  దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించి సమర్థవంతంగా నిలబెట్టింది పీవీ నరసింహారావు, మన్‌మోహన్‌సింగ్‌.   పదేండ్లుగా పాలిస్తున్న మోదీ ప్రభుత్వం దేశానికి చేసిందేంటి? ప్రజల ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి మోదీ ప్రభుత్వంలో బాగుపడ్డాయా?

రాజ్యాంగంపై బీజేపీకి నమ్మకం లేదు

పదేండ్లలో మోదీ ప్రభుత్వం అన్నిరంగాలను  ప్రైవేటీకరణ చేసి కార్మికులను రోడ్లపై నిలబెట్టారు. మత సెంటిమెంట్లను రెచ్చగొట్టడం, ద్వేషాన్ని పెంచడం,  సహోదరుల్లా కలిసి ఉన్న వివిధ మతాలవారి మధ్య చిచ్చుపెట్టి, విభజించి పాలించడం ఈ ప్రభుత్వం చేస్తున్న పని. రామమందిరాన్ని నిర్మించడం మంచికార్యమే కావచ్చు.  కానీ, 56 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో దేశంలో ఎన్ని రామమందిరాలు, శివాలయాలు, వైష్ణవాలయాలు, పోచమ్మ,  మైసమ్మ గుళ్లు ఇతర ఆలయాలను నిర్మించారో బీజేపీకి తెలియదా?  అయినా దాన్నో అడ్వాంటేజ్‌గా తీసుకొని రామునిపై పేటెంట్‌ తమకే ఉందని  బీజేపీ ఓటు రాజకీయాలకు పాల్పడటం  ప్రజాస్వామ్యానికే  ప్రమాదకరం. 

కాంగ్రెస్​ గెలుపు అనివార్యం

మహాత్మాగాంధీని హత్య చేసినవారే గాడ్సేకు గుడి కట్టించి గాంధేయ సోషలిజం పేరుమీద ఓట్లు పొందాలని చూశారు.  రాజ్యాంగాన్ని కాపాడతామని ఉత్తుత్తి కబుర్లు చెబుతారు. మోదీలాంటి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేసి హిందువులకి ఇస్తామనడం మత సెంటిమెంట్లను రెచ్చగొట్టడం కాదా? భారత రాజ్యాంగాన్ని రాయించి, ఆమోదించి, వీలైనంతవరకు  అమలుచేస్తున్న కాంగ్రెస్‌ మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షించగలదన్నది వాస్తవం. అందువల్ల ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి తద్వారా  కాంగ్రెస్‌ గెలుపు అనివార్యం. 

రిజర్వేషన్లకు కాంగ్రెస్​ భరోసా

రిజర్వేషన్ల రద్దుపై రేవంత్‌రెడ్డి అన్న మాటలకు ఉలిక్కిపడి బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులే కాక జాతీయ నాయకులు కూడా మేం రిజర్వేషన్లు రద్దు చేయమని స్టేట్‌మెంట్లిస్తున్నారు.  సామాజిక, రాజకీయ అగ్రస్థానంలో ఉన్న అగ్రవర్జాలు 14శాతం లేకున్నా వారికి10శాతం రిజర్వేషన్లు కల్పించింది బీజేపీ ప్రభుత్వం.  ఈ విపత్కర పరిస్థితుల్లో దేశానికి, రిజర్వేషన్లకు,  రాజ్యాంగానికి  భరోసా కాంగ్రెస్​ మాత్రమేనని రాహుల్‌ గాంధీ చెపుతున్న మాటల్లో పూర్తి వాస్తవం ఉంది.

డా. కాలువ మల్లయ్య,సోషల్ ​ఎనలిస్ట్​