కామారెడ్డి, వెలుగు: కాంగ్రెస్‌పార్టీ ఇస్తున్న ఆరు గ్యారంటీలు దేశానికే రోల్ మోడల్ అని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఇచ్చిన మాటపై నిలబడే పార్టీ కూడా కాంగ్రెస్సే అని చెప్పారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో డీకే మాట్లాడారు. కర్నాటకలో తాము ప్రకటించిన గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణలో కూడా తమ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించిందని, అధికారంలోకి రాగానే కచ్చితంగా అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు.
తాము ఇచ్చిన గ్యారంటీలనే మోదీ నాలుగు రాష్ట్రాల్లో చెప్తూ ఓట్లు అడుగుతున్నారని, ఇది కాంగ్రెస్ మార్క్‌కు నిదర్శనమన్నారు. కర్నాటక రైతులకు సప్లయ్ చేస్తున్న కరెంట్ విషయంలో బీఆర్ఎస్ లీడర్లు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిందని విమర్శించారు. మార్పు రావాలంటే ప్రజలు కాంగ్రెస్‌వైపు నిలబడాలని కోరారు. దేశ భవిష్యత్తు కోసమే ఈ ఎన్నికలు అని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మాయమాటలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.