85 సీట్లలో మేమే గెలుస్తం .. అధికారంలోకి వస్తం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

85 సీట్లలో మేమే గెలుస్తం .. అధికారంలోకి వస్తం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • 85 సీట్లలో మేమే గెలుస్తం.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తం
  • కేసీఆర్​ది రజాకార్ల పాలన.. ఆయనను దించడమే మా టార్గెట్
  • బీఆర్ఎస్​ నేతలు సీట్లు అమ్ముకుంటున్నరని ఆరోపణ


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎంపీ, స్క్రీనింగ్ కమిటీ మెంబర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. 80 నుంచి 85 సీట్లలో గెలుస్తామని చెప్పారు. అక్టోబర్ 1న స్క్రీనింగ్ కమిటీ చివరి సమావేశాన్ని నిర్వహిస్తామని, సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి రిపోర్టు అందజేస్తామని చెప్పారు. 70 మందితో లిస్టు ప్రకటించే అవకాశం ఉంటుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పారు. శుక్రవారం ఆయన జూబ్లీహిల్స్​లోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. 

సీఎం కేసీఆర్​ది రజాకార్ల పాలన అని, ఆయన్ను గద్దెదింపడమే తమ టార్గెట్ అన్నారు. పరీక్షల నిర్వహణలో టీఎస్​పీఎస్సీ పూర్తిగా విఫలమైందన్నారు. సీట్లు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్​లో లేదని, బీఆర్ఎస్ నేతలే ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వాళ్ల పార్టీలో ఏం జరుగుతున్నదో ముందు హరీశ్ రావు తెలుసుకోవాలని మండిపడ్డారు. కొత్త మనోహర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు.

ALSO READ: కాంగ్రెస్ తో కొలిక్కిరాని చర్చలు  .. లెఫ్ట్ పార్టీల మొదటి జాబితా రెడీ! 

రాష్ట్రంలో కరెంట్ సమస్య

రాష్ట్రంలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని వెంకట్ రెడ్డి అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సబ్జెక్ట్​ లేని మంత్రి అని.. అయన ఉన్నా లేనట్టేనని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తుందని నిరూపిస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని హరీశ్​కు సవాల్ విసిరారు. కరెంట్ రాక వరి చేన్లు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ జ్వరంతో ఉంటే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కరెంట్ సమస్యపై ఎందుకు సమీక్ష చేయడం లేదని నిలదీశారు. టీఆర్ఎస్​ను బీఆర్ఎస్​గా మార్చుకున్నప్పుడే ఆ పార్టీ కథ ముగిసిపోయిందన్నారు. బీఆర్ఎస్​గా మార్చుకున్నాక ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదని నిలదీశారు.

జనం కేసీఆర్​ను నమ్మట్లేదు

సీఎం కేసీఆర్ ఎన్ని కొత్త పథకాలను విడుదల చేసినా జనం నమ్మే పరిస్థితిలో లేరని వెంకట్ రెడ్డి అన్నారు. దళితబంధు పథకం అందరికీ అమలయ్యే సరికి ఎన్నేండ్లు పడుతుందని ప్రశ్నించారు. దళితబంధు పథకం గురించి మాట్లాడుతున్న హరీశ్.. అందులో 30 శాతం కమీషన్ గురించి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ దోచుకున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే హైదరాబాద్​కు ఎక్కువ ఐటీ కంపెనీలు వచ్చి ఉండేవన్నారు. బీఆర్ఎస్ నేతల తీరుతో చాలా కంపెనీలు వెనక్కు వెళ్లిపోయాయన్నారు.