ప్రభుత్వ వ్యతిరేకత గూడుకట్టుకున్న వివిధ వర్గాలు, సామాజిక సంస్థలు, పౌరసంఘాలను కూడగట్టుకోకుండానే కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా అంటే.. కాదనేవారు కనిపిస్తారు తప్ప అవుననే వారు కనిపించరు! బీజేపీ ప్రభుత్వంపై 40శాతం అవినీతి ప్రచారం ఒక నరేటివ్‌గా పనిచేసినా.. వివిధ వర్గాల ప్రభుత్వ వ్యతిరేకతను సమీకృతం చేసి కాంగ్రెస్ పార్టీని గెలుపు తీరాలకు చేర్చింది మాత్రం అక్కడ యాక్టివ్‌గా పనిచేసిన పౌర సంస్థలే. అలాంటి సంఘాలను, సమాజంపై ప్రభావం చూపగలిగే వ్యక్తులను, శక్తులను కర్నాటక కాంగ్రెస్ పార్టీ కూడగట్టుకోలిగింది. అధికారంలోకి రాగలిగింది.
అలాంటి అనుభవమే మనకు గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ ఉంది. 1996 నుంచి 2004 వరకు ఎదురు లేని ముఖ్యమంత్రిగా కొనసాగిన టీడీపీ చంద్రబాబు పాలనలో ప్రజలకు చేదు అనుభవాలు అనేకం. కరువు, కరెంటు కోతలు, ఆత్మహత్యలు, చచ్చుబడిన విద్య, వైద్యం ప్రజల జీవితాలను వెంటాడిన కాలమది. అప్పట్లో టీడీపీని ఓడించడం కష్టం అనే భావం ప్రబలంగా ఉండేది. ప్రజల్లో వ్యతిరేకత మాత్రం వివిధ రూపాల్లో అప్పటికే గూడుకట్టుకొని ఉంది. చంద్రబాబు ఏకపక్ష పాలన ప్రజాకంటకంగా మారడమే అందుకు కారణం. రాష్ట్రమంతటా పచ్చజెండాలు కనిపిస్తున్నా.. పౌర సంఘాలు, రైతుసంఘాలు, సామాజిక సంఘాలు ప్రజా వ్యతిరేకతను కూడగట్టి టీడీపీని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించాయి.
స్వయంగా రాజశేఖర్‌రెడ్డి ఈ సంఘాలచేత చంద్రబాబు ప్రజాకంటక పాలనను రాష్ట్రవ్యాప్తంగా ఎండగట్టించారు. ప్రభుత్వ వ్యతిరేకతను సమీకృతం చేయించగలిగారు. కాంగ్రెస్ గెలుపునకు బాటలు వేయగలిగారు. సామాజిక సంస్థలను, ప్రజా సంఘాలను కూడగట్టుకోకుండా కాంగ్రెస్ గెలవగలదని రాజశేఖర్ రెడ్డి లాంటి గొప్ప నాయకుడు కూడా ఎన్నడూ అనుకోలేదు. చంద్రబాబును గద్దెదించాలనుకున్నపుడు, రాజశేఖర్‌రెడ్డి ఉభయ కమ్యూనిస్టులు, టీఆర్ఎస్తోనూ పొత్తుకు కూడా వెనుకాడలేదు. ఆనాడు రాజశేఖర్ రెడ్డిలో ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష కన్నా చంద్రబాబు ప్రజాకంటక పాలనను గద్దెదించాలనే లక్ష్యమే ఆయనలో బలంగా ఉండేది.
ప్రజాస్వామిక శక్తులే, భావవ్యాప్తి సాధకులు
మొత్తంమీద రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయ నాయకుల కంటే ప్రజాసంఘాలు, సామాజిక సంఘాలనే ఆయన ఎక్కువ గౌరవించేవారు. వారి పట్ల ప్రత్యేక అభిమానం చూపేవారు. ఆయ సంఘాల పోరాటాలను గుర్తించి సమస్యల పరిష్కారానికి బాటలు వేసేవారు. అలాగే, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ మహా కూటమిగా ఏర్పడినా.. ప్రజాసంఘాలు, సామాజిక సంఘాలను మాత్రం రాజశేఖర్‌రెడ్డి వదులుకోలేదు. తాను అధికారంలోకి రావడానికి ఈ సంఘాల చేత రాష్ట్రవ్యాప్తంగా విస్త్రృత ప్రచారం చేయించారు. మరోసారి అధికారంలోకి వచ్చారు. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా ప్రజా సంఘాల నేతృత్వంలో వివిధ రూపాలలో చేసిన భావవ్యాప్తి వల్లే తెలంగాణ ఏర్పడిందనేది ఎవరూ కాదనలేని సత్యం. రాజకీయ నాయకుల మాటలకు విలువలు, విశ్వసనీయత లేకుండా పోయినందున, పౌర సంఘాలు, సామాజిక సంస్థల పోరాటాలే మార్పునకు నాంది పలుతాయి.
ప్రజాస్వామిక శక్తులుఎల్లప్పుడు సామాజిక ప్రయోజనాల కోసం ప్రాకులాడుతారు. కాకపోతే, వ్యక్తిగతంగా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం తగిన గుర్తింపు ప్రజల సేవ కోసం ఉండాలని కోరుకుంటారు తప్ప రాజకీయ పదవులకు ఎగబడరు. నేటి తెలంగాణలో ప్రజాస్వామిక శక్తులు ప్రతిపక్షపాత్రలో ప్రజల తరఫున పనిచేస్తున్నాయి. అలాంటి శక్తులను చేరదీసి ప్రజాభిమానాన్ని కూడగట్టుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షాలది. ముఖ్యంగా అధికారంలోకి రావాలనుకుంటున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీకి అది అవసరం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఆనాడు ప్రజాస్వామ్యశక్తులను కూడగట్టుకున్న తీరు, నేడు అదే కాంగ్రెస్ పార్టీలో కొరవడడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది! దాని ఫలితమే వైయస్ హయాం తర్వాత నుంచి ఆ పార్టీ ఘోర పరాజయాలను చవి చూడవలసి వచ్చిందనే వాస్తవాన్ని ఆ పార్టీ ఇప్పటికైనా గుర్తించవలసి ఉంది.
ఉద్యమ శక్తులతోనే భావవ్యాప్తి
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు సీట్ల సిగపట్లు, ఆధిపత్యపోరు, అంతర్గత లొల్లులు తప్ప, పార్టీ గెలుపు కోసం ప్రజాస్వామిక శక్తులను కూడగట్టుకునే ప్రయత్నం ఎక్కడా కనిపించదు. ప్రభుత్వ వ్యతిరేక విధానాల భావవ్యాప్తి ఒక పార్టీ మాత్రమే చేస్తే జరిగేది కాదు. దానికి ప్రజాస్వామ్య శక్తుల తోడు కావాలి. ఒక్కమాటలో చెప్పాలంటే, కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలు, వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతిపక్షాల కంటే, ఉద్యమ శక్తులే ముందు వరుసలో ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఉద్యమ నేతల సమన్వయం ఏది?
కేసీఆర్ అవినీతి, కుటుంబపాలనకు వ్యతిరేక భావసారూప్యం గల పార్టీలు, వ్యక్తులు, శక్తులు, సంఘాల గురించి చెప్పుకోవాలంటే.. తెలంగాణ సాధకుడైన జేఏసీ నాయకుడు ప్రొ. కోదండరాం టీజేఎస్ పేర రాజకీయపార్టీ ఏర్పాటు చేసినప్పటికీ, రాజకీయ నాయకుడుగా కాకుండా, ఉద్యమ నేతగానే ఆయన్ను ప్రజలు ఇప్పటికీ ఆదరిస్తున్నారు. కేసీఆర్ అవినీతి పాలనపై ఆయన నిరంతరం పోరాడుతున్నారు. ఎమ్మార్పీఎస్ మహాజన సోషలిస్టు పార్టీ నాయకుడు మంద కృష్ణ మాదిగ దళిత వర్గాల్లో మూడు దశాబ్దాలుగా నూతన చైతన్యం తెచ్చిన బలమైన నాయకుడు. ఇవాళ ఆయన పోరాటం కూడా తెలంగాణను ఆగం చేసిన కేసీఆర్ పాలనా తీరుపైనే!
కామ్రేడ్లను వదిలేస్తారా?
బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఉభయ కమ్యూనిస్టులు, మునుగోడు ఉప ఎన్నికలో మాత్రం అనూహ్యంగా బీఆర్ఎస్కే మద్దతిచ్చారు. వారి మద్దతు పుణ్యమా అని బీఆర్ఎస్ గెలుపుసాధ్యమైంది. తదనంతరం వారు కనీసం కేసీఆర్ అపాయింట్మెంటును కూడా పొందలేకపోయారు. మునుగోడు ఉప ఎన్నికలో ఉభయ కమ్యూనిస్టులు తప్పటడుగేసి ప్రజల్లో అభాసుపాలయ్యారు. బీఆర్ఎస్తో పొత్తుకు ఆశపడ్డ కమ్యూనిస్టులకు భంగపాటు తప్పలేదు. వారికి కేసీఆర్‌తో తగిన ప్రాయశ్చిత్తమే జరిగింది. తెలంగాణలో వామపక్ష భావ జాలం బలమైనదే. వామపక్షాలు ఎన్నికల్లో గెలవకపోవచ్చు. కానీ ప్రజల్లో భావవ్యాప్తిని చేయగలగే శక్తి మాత్రం వాటికి ఇప్పటికీ ఉంది. ఎన్నికలనే మరో తెలంగాణ ఉద్యమంగా మార్చడానికి సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ వంటి పార్టీలు తోడైతే కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడం కాంగ్రెస్ కు మరింత సులభం.
కుల, వృత్తి సంఘాల పోరాటాలను సమన్వయం చేసేకోలేరా?
ప్రజాసంఘాలైన కుల సంఘాలు, దళిత సంఘాలు, బీసీ వేదికలు, రెడ్డి సంఘాలు, గిరిజన వేదికలు మైనారిటీ సంస్థలు, కార్మిక, రైతు, నిరుద్యోగ, మహిళా సంఘాలు కేసీఆర్ ప్రభుత్వ పాలనా తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. అలాగే, న్యాయవాద, ఉపాధ్యాయ, జర్నలిస్టుల సంఘాలు, రచయితలు, కళాకారుల సంఘాలు.. కేసీఆర్ పాలనలో ఆగమైన తెలంగాణను కాపాడుకునే నిరంతర ప్రయత్నంలో ఉన్నారు. సామాజిక మాధ్యమాలైన అనేక యూట్యూబ్ ఛానెల్స్ కేసీఆర్ పాలనతీరును ప్రజల ముందు పెడుతున్నాయి. పైన పేర్కొన్న సామాజిక సంస్థలు, సంఘాలు, ప్రజాస్వామిక శక్తులు, వ్యక్తులు పదేండ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని, పాలనా వైఫల్యాలను వెలికి తీస్తూ వచ్చారు.
వారు చేసిన కృషి ప్రజాతీర్పుకు ఉపయోగపడాలంటే ఏంచేయాలో.. రేపు అధికారంలోకి వస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ తన మోనార్క్ భావాలను వదిలి ఆలోచించుకోవాలి. ఈ ప్రజాస్వామిక ఉద్యమ శక్తులను వాడుకోలేకపోతే.. కాంగ్రెస్ పార్టీ తన గొయ్యిని తానే తవ్వుకున్నట్లే కాదా? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా, ప్రజాస్వామ్య శక్తులను, ఉద్యమకారులను, వివిధ సం ఘాలను తమ పార్టీతో కలిసి పనిచేసేలా సమన్వయం చేసుకోవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల యుద్దానికి ఆ సమన్వయాన్ని ఒక మిషన్ గా మార్చుకుంటేనే అది విజయతీరాలకు చేరే అవకాశం ఉంటది.
ఆగమైన తెలంగాణను కాపాడాలంటే
పదేళ్లలో తెలంగాణలోని అన్ని రంగాలను కేసీఆర్ చెరపట్టేశారు. అవి ఒక వ్యక్తి గుప్పిట్లోకి వెళ్లి విలవిలలాడుతున్నాయి. దాని ప్రతిక్రియ రూపంలోనే ప్రజాస్వామిక శక్తులు, వ్యక్తులు కేసీఆర్ పాలనపై యుద్ధాన్ని ప్రకటించి పోరాడుతున్నారు. వారి శ్రమ సమాజానికి ఉపయోగపడాలి. ఆగమైన తెలంగాణను నిలబెట్టాలంటే.. ఏం చేయాలో అనే ‘బంతి’ ఇపుడు కాంగ్రెస్ పార్టీ కోర్టులోనే ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం మాత్రమే ఎన్నికల యుద్ధంలా కాకుండా.. ఆగమైన తెలంగాణను కాపాడుకునే మరో తెలంగాణ యుద్ధంగా పరిగణించాలి.
కాంగ్రెస్‌కు ప్రజా సంఘాల పట్టింపు ఏది?
తెలంగాణ సాధనలోగానీ, మొదటిసారి కేసీఆర్ అధికారంలోకి రావడానికిగానీ, సామాజిక ఉద్యమ కారులను బలంగా ఉపయోగించుకొని తనకు అనుకూలంగా భావవ్యాప్తి చేయించుకోగలిగాడు. రెండవసారి అధికారంలోకి వచ్చాక కళ్లునెత్తికెక్కి, ప్రజస్వామ్యాన్ని అటకెక్కించి, అవినీతి, అధికార దుర్వినియోగం, ప్రజావ్యతిరేక విధానాలతో నియంతలా మారినారు. సామాజిక ప్రయోజనాలను విస్మరించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ కుటుంబపాలనకు అంతం పలకాలని ప్రజాస్వామిక సంఘాలు పోరాటాలు సాగిస్తున్నాయి. ప్రజాస్వామిక శక్తులు ప్రభుత్వాలను ఏర్పాటు చేయకపోవచ్చు. కానీ ప్రభుత్వాలను మార్చగలుగుతాయి. దాని అర్థం రాజకీయ పార్టీల లక్ష్యం అధికారం, స్వార్థం అయితే.. ప్రజాస్వామిక శక్తులకు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడమే ధ్యేయంగా పనిచేస్తారు.
ప్రభుత్వాలను మార్చగలిగే ప్రజాస్వామ్య శక్తులకు ప్రాధాన్యత, ప్రాముఖ్యం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆ పార్టీ దివాలాకోరు తనాన్ని తెలియజేస్తున్నది. తనను విమర్శించిన శక్తులను సైతం అవసరమైనపుడు కేసీఆర్ దగ్గరకు తీసుకుంటున్న సంఘటనలు అనేకం. వారితో తన రాజకీయ అవసరాలు తీర్చుకుంటున్నదీ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజాస్వామ్య శక్తులను దూరం పెట్టి పట్టించుకోకుండా వదిలేస్తున్నది. గాయకుడు ఏపూరి సోమన్ననే అందుకో ఉదాహరణ అనుకొవచ్చేమో? భావవ్యాప్తి చేయగలిగే సోమన్నను కాంగ్రెస్ పార్టీ పట్టించుకొని ఉంటే.. వారు ప్రగతి భవన్ వైపు చూసేవారా?
ఈబీసీ ఉద్యమ సంస్థ కృషి ఎనలేనిది
అగ్రవర్ణ పేదల అభ్యున్నతికై పోరాటాలు చేసినవాటిలో ఈబీసీ ఉద్యమ సంస్థ చేసిన విశేష కృషి ఉంది. అగ్రవర్ణ పేదలకు స్కాలర్షిప్లు, ఫీజు రియింబర్స్‌మెంట్, దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సాధించగలిగింది. కేసీఆర్ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ను తెలంగాణలో అమలు చేయకుండా తాత్సారం చేసినపుడు ఈబీసీ ఉద్యమ సంస్థ నిరంతరం పోరాడింది. ఫీజు రియింబర్స్‌మెంటు నిధులు విడుదల చేయకుండా పేద విద్యార్థులను విద్యకు దూరచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై ఈబీసీ ఉద్యమ సంస్థ ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నది. తెలంగాణలో కేసీఆర్ ప్రజాకంటక పాలనపై పోరాడుతున్న అనేక సంస్థల్లో ఈబీసీ ఉద్యమ సంస్థ పాత్ర కూడా కీలకమైనది.
విద్యావంతుల సేవలు వదిలేస్తారా?
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి, బీఎస్పీ పగ్గాలు చేపట్టి, కేసీఆర్ పాలనా వైఫల్యాలను అన్ని వర్గాల్లోకి తీసుకెళుతున్నారు. స్వతంత్ర భావాలు కలిగిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి, జస్టిస్ చంద్రకుమార్, సోషల్ డెమోక్రటిక్ ఫోరం పేరుతో కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నారు. వారు లేవనెత్తుతున్న విభిన్న సమస్యలు ప్రజల్లోకి వెళుతున్నాయి.
- వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి,జాతీయ అధ్యక్షుడు, ఈబీసీ సంక్షేమ సంఘం