కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరు : అశోక్ చౌహాన్

ఆదిలాబాద్, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్ చెప్పారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్​రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం స్థానిక ప్రజా సేవభవన్​లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న అశోక్​చౌహాన్ అనంతరం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ కాంగ్రెస్​ఎన్నికల పరిశీలకుడిగా తన వంతు ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ లో మరాఠీలు అధిక సంఖ్యలో ఉన్నారని, వారంతా కాంగ్రెస్ కే మద్దతు తెలుపుతారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని, అబద్దాల సర్కారుగా గుర్తింపు తెచ్చుకుందని విమర్శించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు ఘోరంగా ఉన్నాయన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని వాపోయారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఓట్లు చీల్చేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ రాజకీయ విధానం అనుమానాస్పదంగా ఉందన్నారు. తెలంగాణలోనూ కర్నాటక ఫలితాలే రిపీట్ అవుతాయన్నారు.