భువనగిరిలో 40 ఏండ్ల తర్వాత కాంగ్రెస్​ విన్

హైదరాబాద్, వెలుగు :  భువనగిరి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్​పార్టీ 40 ఏండ్ల తర్వాత పాగా వేసింది. భువనగిరి నియోజకవర్గం 1952లో  ఏర్పడగా.. ఇక్కడి నుంచి రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ  వంటి మహామహులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. రావి నారాయణ రెడ్డి, కొమ్మిడి నర్సింహారెడ్డి రెండేసి పర్యాయాలు, ఎలిమినేటి మాధవ రెడ్డి నాలుగు సార్లు విజయం సాధించారు. నక్సలైట్ల దాడిలో ఆయన మృతిచెందగా.. ఉప ఎన్నికలో గెలిచి మాధవరెడ్డి భార్య ఉమా మాధవ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 2004, 2009లోనూ టీడీపీ తరఫున ఆమె పోటీ చేసి విన్ అయ్యారు.

2014, 2018 ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్​అభ్యర్థి పైళ్ల శేఖర్​రెడ్డి గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్​తరఫున పోటీ చేసిన కుంభం అనిల్​కుమార్​రెడ్డి 26 వేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్​అభ్యర్థి, సిట్టింగ్​ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డిపై విజయం సాధించారు. ఇక్కడి నుంచి 1983లో కాంగ్రెస్​ తరఫున చివరి సారిగా కొమ్మిడి నర్సింహారెడ్డి  గెలిచారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్​హవాలోనూ ఇక్కడ గెలిచిన కాంగ్రెస్ ..1985 ఎన్నికల నుంచి మళ్లీ గెలువలేదు. కుంభం అనిల్​కుమార్​రెడ్డి విజయంతో  భువనగిరిలో  40 ఏండ్ల తర్వాత కాంగ్రెస్​ మళ్లీ విజయం అందుకుంది.