తెలంగాణలో కాంగ్రెస్ హవా ఉందన్నారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పార్లమెంట్ ఎన్నికల్లో 12 నుండి14 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తరుపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని... బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఏమి చేయలేదన్నారు. మోదీ, అమిత్ షా.. అదానీ, అంబానీ లాంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తల కోసమే పనిచేశారని ఆరోపించారు.
వారికే లక్షల కోట్లు రుణమాఫీ చేశారన్నారు. పేదవారికి అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పి వేయలేదని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని చెప్పారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జగిత్యాలలో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసే అవకాశం ఉన్నా ఓపెన్ చేయలేదన్నారు. జగిత్యాలలో జీవన్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని.. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే సబ్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. 200 కోట్లతో త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని తెలిపారు.