- 12 స్థానాల్లో 11 చోట్ల కాంగ్రెస్ ఘన విజయం
- సూర్యాపేటలో స్వల్ప ఓట్లతో గట్టెక్కిన మంత్రి జగదీశ్ రెడ్డి
- నల్గొండలో ఫార్వర్డ్ బ్లాక్, సూర్యాపేటలో బీఎస్పీ ఎఫెక్ట్
నల్గొండ /సూర్యాపేట/యాదాద్రి వెలుగు : ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. మొత్తం 12 స్థానాలకు గాను సూర్యాపేట మినహా 11 చోట్ల గెలుపొందింది. ఉత్తమ్ దంపతులు, కోమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డి కొడుకు జైవీర్ రెడ్డి, వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బాలు నాయక్, బీర్ల అయిలయ్యతో పాటు చివరి సమయంలో టికెట్ కన్ఫర్మ్అయిన బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామెల్ సైతం గెలుపొందారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఒక్కరే మంత్రి జగదీశ్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాలో ఓడిపోయారు. అయితే ఒక్కడ బీజేపీ, బీఎస్పీ భారీగా ఓట్లు చీల్చడం బీఆర్ఎస్కు కలిసొచ్చింది.
రాష్ట్రం ఏర్పడ్డాక భారీ విజయం
2014లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, నల్గొండలో గెలుపొందింది. పొత్తులో భాగంగా దేవరకొండలో సీపీఐ గెలిచింది. తిరిగి 2018 ఎన్నికలకు వచ్చేసరికి పార్టీ కేవలం హుజూర్నగర్, మునుగో డు, నకిరేకల్ నియోజకవర్గాల్లో మాత్రమే గెలవగా బీఆర్ఎస్ 9 చోట్ల గెలుపొందింది. ఆ తర్వాత జరిగిన హుజూర్నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరడంతో బీఆర్ఎస్ బలం 12కు చేరింది.
ఈ సారి ఊహించని రీతిలో సూర్యాపేట మినహా మిగితా 11 స్థానాలు కైవసం చేసుకుంది. హ్యాట్రిక్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గొంగడి సునీత, ఎన్. భాస్కర్‌రావు, గాదరి కిశోర్ కుమార్, ఫైళ్ల శేఖర్‌రెడ్డి ఓడిపోయారు.
బీజేపీ, సీపీఎం అడ్రస్ గల్లంతు...
11 నియోజకవర్గాల్లో సూర్యాపేట మినహా బీజేపీ అడ్రస్ గల్లంతైంది. ఆ పార్టీకి కూడా డిపాజిట్ దక్కలేదు. అత్యధికంగా సూర్యాపేట లో సంకినేని వెంకటేశ్వరరావుకు 40,072 ఓట్లు పోలుకాగా, మునుగోడు లో చల్లమల్ల కృష్ణారెడ్డికి 22,319 ఓట్లు పోలయ్యాయి. సీపీఎం ఉనికి లేకుండా పోయింది. నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, నకి రేకల్, మునుగోడు, భువనగిరి నియోజకవర్గాల్లో కలిపి ఆపార్టీ అభ్యర్థుల కు 14,686 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
మిర్యాలగూడలో జూలకంటి రంగారెడ్డికి 3,234 ఓట్లు రాగా, మల్లు స్వరాజ్యం కోడలు, మల్లు లక్ష్మీకి హుజూర్‌నగర్‌లో 1914 ఓట్లు పోలయ్యాయి. ఇక నల్గొండలో ఆపార్టీ జి ల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డికి 1439 ఓట్లు పోల్ కావడం గమ నార్హం.
సత్తా చాటిన పిల్లి రామరాజు
నల్గొండలో బీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థి పిల్లి రామరాజు ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేశారు. ఆయనకు 27,096 ఓట్లు పోలయ్యాయి. నల్గొండలో బీజేపీకి ఎక్కువ ఓట్లు వస్తాయని భావించారు. కానీ ఆ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్‌కు కేవలం 7,828 ఓట్లు మాత్రమే వచ్చాయి. పిల్లి చీల్చిన ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి చెందినవే. ఈ చీలిక వల్ల ఆపార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డికి భారీగా ఓట్లు గండిపడ్డాయి.
దేవరకొండ, నాగార్జునసాగర్, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, నకిరకల్లో బీఎస్పీ అభ్యర్థులకు 2 6,521 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో సూర్యాపేటలో వట్టె జానయ్య యాదవ్‌కు 13,734 ఓట్లు వచ్చాయి. కోదాడలో బీజేపీ, జనసేనా కలిసి పోటీ చే యగా, ఆపార్టీకి 2,151 ఓట్లు మాత్రమే వచ్చాయి. అన్ని నియోజ కవర్గాల్లో కలిపి నోటాకు 11,294 ఓట్లు వచ్చాయి.
రికార్డు స్థాయిలో మెజార్టీ..
కాంగ్రెస్ అభ్యర్థులు రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించారు. 11 మంది అభ్యర్థుల్లో 10 మంది 45 వేల పైచిలుకు మెజార్టీ సాధించారు. అత్యధికంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీ రేశం 68,839 ఓట్లు, రెండో స్థానంలో కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి 58,461 ఓట్లు పొందారు.
నాగార్జునసాగర్‌లో జైవీర్ రెడ్డి , ఆలేరులో బీర్ల అయిలయ్య, తుంగతుర్తిలో మందుల సామెలు, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి తొలిసారిగా పోటీ చేసి 45 వేలకు పైగా మెజార్టీ సాధించారు. భువనగిరిలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి గతంలో పోటీ చేసి ఓడిపోయినా.. ఈ సారి 26,201 మెజార్టీతో గెలుపొందారు. ఈయన కూడా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.