
రోహ్తక్: హర్యానాలో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువతి హిమాని నర్వాల్ను అత్యంత కిరాతకంగా హత్య చేసి.. ఆమె మృతదేహాన్ని సూట్ కేసులో పడేసిన ఘటన కలకలం రేపింది. రోహ్తక్ బస్టాండ్ సమీపంలో ఆమె డెడ్ బాడీ సూట్ కేసులో పోలీసులకు లభ్యమైంది. ఈ యువతి కాంగ్రెస్ కార్యకర్త కూడా కావడంతో ఈ ఘటన హర్యానాలో చర్చనీయాంశమైంది.
‘భారత్ జోడో యాత్రలో’ రాహుల్ గాంధీతో పాటు ఈ యువతి పాదయాత్ర కూడా చేసింది. కాంగ్రెస్లో ఎంతో యాక్టివ్గా పనిచేస్తున్న ఈ యువతి చనిపోవడంపై ఆమె తల్లి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం తన కూతురు ఎంతో కష్టపడి సేవ చేసిందని.. పార్టీ కార్యకర్తలు ప్రతి నిత్యం తమ ఇంటికి వస్తూపోతూ ఉంటారని ఆమె చెప్పింది. స్థానికంగా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్న కొందరు తన కూతురి ఎదుగుదల చూసి ఓర్వలేక ఆమెను హత్య చేశారని సవిత నర్వాల్ సంచలన ఆరోపణ చేసింది.
ఫిబ్రవరి 27న తన కూతురితో చివరి సారిగా మాట్లాడానని, సీనియర్ కాంగ్రెస్ నేత భూపేందర్ సింగ్ హుడా ర్యాలీలో తన కూతురు పాల్గొందని హిమాని నర్వాల్ తల్లి చెప్పింది. ఆ తర్వాత రోజు నుంచి తన ఫోన్ స్విచాఫ్ వచ్చిందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీలో తన కూతురు పదేళ్ల నుంచి యాక్టివ్గా పనిచేస్తోందని, తన కూతురు చనిపోయాక ఏ సీనియర్ లీడర్ కూడా కనీసం పరామర్శించలేదని సవిత నర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసు దర్యాప్తునకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని, ఇప్పటికే కొన్ని కీలక విషయాలు తెలిశాయని.. త్వరలో నిజానిజాలను బయటపెడతామని పోలీసులు తెలిపారు. ఆమె శరీరంపై గాయాలున్నాయని, పోస్ట్ మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించామని పోలీస్ అధికారి బిజేంద్ర సింగ్ చెప్పారు.