
దుబ్బాక, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయిస్తానన్న హామీ ఏమైందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీశారు. బుధవారం దుబ్బాక మండలం హబ్షీపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆయనను అడ్డుకున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలేమిటో రాతపూర్వకంగా ఇవ్వాలని ఎమ్యెల్యే సూచించారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్‌ప్రభుత్వమే కదా అనడంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. దీంతో, ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం కొబ్బరికాయ కొట్టి నెలలు గడుస్తున్నా పనులు పూర్తవడం లేదని కాంగ్రెస్కార్యకర్తలు ఆరోపించారు. అంతకుముందు చేగుంట మండలం కసాన్పల్లి, దౌల్తాబాద్ మండలం మాచిన్పల్లి గ్రామాల సరిహద్దులోని రామాయంపేట, శంకరంపేట కెనాల్స్ పనులను ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. రామాయంపేట, శంకరంపేట, గజ్వేల్ డివిజన్ ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్అండ్బీ, విద్యుత్, ఫారెస్ట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మిరుదొడ్డి మండలం ధర్మారం, దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చేర్వాపూర్, చెల్లాపూర్, దుంపలపల్లి, దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.