ఆసిఫాబాద్ కాంగ్రెస్ లో లొల్లిలొల్లి..

ఆసిఫాబాద్ కాంగ్రెస్ లో లొల్లిలొల్లి..
  •  
  • కుటుంబ సర్వే ప్రణాళిక మీటింగ్​లో కొట్టుకున్న రెండు వర్గాలు
  • బయటపడ్డ వర్గ విబేధాలు.. ఇరు వర్గాల కార్యకర్తలకు గాయాలు

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బయటపడింది. కుటుంబ సర్వే కార్యచరణ ప్రణాళికలో భాగంగా డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్​లో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల, విద్యార్థి, యువజన సంఘాలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అయితే తమకు సమాచారం ఇవ్వకుండా మీటింగ్ నిర్వహిస్తున్నారని పార్టీ ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్​చార్జ్​ అజ్మీర శ్యామ్ నాయక్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభా వేదికకు వచ్చి నినాదాలు చేశారు. దీంతో విశ్వ ప్రసాద్, శ్యామ్ నాయక్ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కుర్చీలు విసురుకున్నారు. దాడులు చేసుకోవడంతో ఇరువర్గాల కార్యకర్తకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు. శ్యామ్ నాయక్ వర్గీయులను హాల్ నుంచి బయటకు పంపించి గేటుకు తాళం వేసి లోపల మీటింగ్ నిర్వహించారు. దీంతో గేటు బయట శ్యామ్ నాయక్ మద్ధతుదారులు నిరసనకు దిగారు. దాడి చేసిన విశ్వప్రసాద్ రావు వర్గీయులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో శ్యామ్ నాయక్, ఆయన వర్గీయు లను పోలీసులు స్టేషన్​కు తరలించారు.