
మెదక్, వెలుగు : స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావుపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు బుధవారం రాత్రి బీఆర్ఎస్కు చెందిన 5వ వార్డు కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మెదక్లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆంజనేయులు ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్రావులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని
బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనను విరమింపజేసే ప్రయత్నం చేశారు. అయినా కాంగ్రెస్ కార్యకర్తలు కదలమని భీష్మించారు. పోలీసులు సముదాయించడంతో గురువారం ఉదయం వరకు క్షమాపణ చెప్పకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆందోళనలో కాంగ్రెస్ లీడర్లు జీవన్ రావు, పవన్, తాహెర్, మీర్జా అలీబేగ్ పాల్గొన్నారు.