- సీపీఐకి టికెట్లు ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- కొత్తగూడెంలో సెల్ టవరెక్కిన ఎడవల్లి కృష్ణ వర్గం
- అంబేద్కర్ విగ్రహం వద్ద పోట్ల అనుచరుల నిరసన
- చెన్నూరు సీటు కోసం మందమర్రి నేషనల్ హైవే పై ఆశావహుల ధర్నా
భద్రాద్రి కొత్తగూడెం/కోల్‌బెల్ట్ , వెలుగు : పొత్తుల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం, చెన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ సీట్లను సీపీఐకి ఇవ్వొద్దంటూ ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ ఆశావహులు, వారి అనుచరులు సోమవారం ఆందోళనలకు దిగారు. కొత్తగూడెం సీటును టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన అనుచరుడైన రాజేశ్ పోస్టాఫీస్ సెంటర్లోని సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఎడవల్లికి టికెట్కన్ఫమ్ చేసేంత వరకు టవర్ దిగేది లేదని ప్రకటించాడు.
మరో వైపు పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు వర్గానికి చెందిన అనుచరులు నిరసన తెలిపారు. కాంగ్రెస్ టికెట్ పోట్ల నాగేశ్వరరావుకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు మంచిర్యాల జిల్లా చెన్నూరు సీటును సీపీఐకి కేటాయించవద్దంటూ మందమర్రిలో కాంగ్రెస్ సీటు ఆశిస్తున్న నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. మందమర్రి పాతబస్టాండ్వద్ద నేషనల్ హైవే 363 ఫోర్‌లేన్ రోడ్డుపై కాంగ్రెస్టికెట్ఆశిస్తున్న లీడర్లు సొతుకు సుదర్శన్, మేకల శంకర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఆశావహులు మాట్లాడుతూ 60 ఏండ్లుగా ప్రతిసారీ చెన్నూరు సీటు కాంగ్రెస్‌కు కేటాయిస్తున్నారని, ఈ సారి సీపీఐకి ఇస్తున్నారని ప్రచారం జరుగుతుండడంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు 65 నుంచి 70 వేల వరకు ఓటు బ్యాంకు ఉందన్నారు. గెలిచే సీటును వదులుకోవద్దన్నారు. దీనివల్ల ఏండ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన లీడర్లు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందన్నారు. సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ఎండీ అఫీజ్, ఉపాధ్యక్షులు ఎండీ పాషా, పట్టణ మాజీ జనరల్ సెక్రెటరీ సోతుకు రాజయ్య, ఆలం శంకర్, తాడగోని కనకయ్య, మాయ లింగయ్య, కత్తెర్ల ఐలయ్య, గుండవేని నాగయ్య, ముద్రకోల కొమురయ్య, పాలమాకుల నరసింహులు పాల్గొన్నారు.