ప్రజాహిత యాత్రపై దాడికి కాంగ్రెస్ యత్నం

ప్రజాహిత యాత్రపై దాడికి కాంగ్రెస్ యత్నం
  • రాములపల్లి వద్ద బైఠాయించిన కాంగ్రెస్ కార్యకర్తలు 
  • ఇరుపార్టీల కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు
  • కాంగ్రెస్ నేతల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం

సిద్దిపేట/హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా  హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. హుస్నాబాద్​లో  పెట్టిన ప్లెక్సీలను చించివేవేశారు.  దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉద్రిక్తత  కొనసాగుతోంది. కరీంనగర్​ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి నుంచి రెండోరోజు ప్రజాహిత యాత్ర ద్వారా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ కు ఇవాళ  బండి సంజయ్ చేరుకోనున్నారు. యాత్రను అడ్డుకునేందుకు పట్టణ శివారులో కాంగ్రెస్ కార్యకర్తలు, ఇదే సమయంలో బండికి స్వాగతం పలకడానికి బీజేపీ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకున్నాయి. డౌన్ డౌన్... ఖబడ్దార్ అంటూ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల ప్రతి నినాదాలతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ప్రజాహిత యాత్ర క్యాంపు వైపునకు కాంగ్రెస్ కార్యకర్తలు రాకుండా, అలాగే బీజేపీ కార్యకర్తలను,పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తిని కూడా ప్రజాహిత యాత్రకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామ శివారులో.. హుస్నాబాద్ మండలం రాములపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంత్రి పొన్నంపై బండి వివాదాస్పద కామెంట్స్ చేశారని  హస్తం నేతలు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

 ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదు (బాక్స్​)
మరోవైపు భారీ బందోబస్తు మధ్య బొమ్మనపల్లి నుంచి ప్రజాహిత యాత్ర ప్రారంభమైంది.  శాంతియుతంగా చేస్తున్న యాత్రను అడ్డుకోవద్దని కాంగ్రెస్​ నేతలకు బండి సంజయ్  సూచించారు. తాను ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. తాను తప్పుగా మాట్లాడినట్లు భావిస్తే కేసు పెట్టి లీగల్ గా చర్యలు తీసుకోవాలని సంజయ్ సూచించారు.  ప్రజాహిత యాత్రను అడ్డుకోవాలని చూస్తే ఖబడ్దార్ అంటూ కాంగ్రెస్​ నేతలను బండి హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలను యాత్రకు అనుమతించాలని పోలీసులను బండి సంజయ్ కోరారు.  లేకుంటే తానే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఎదుట బైఠాయిస్తానని హెచ్చరించారు.

బండి సంజయ్ ని తిరగనివ్వబొం (బాక్స్​)
  భీమదేవరపల్లి : మంత్రి పొన్నం ప్రభాకర్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ ను  భీమదేవరపల్లి మండలంలో తిరుగనివ్వబోమని మండల కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం  ముల్కనూరులో ప్రజాహిత పాదయాత్రకు ఏర్పాటు చేసిన బీజేపీ ఫ్లెక్సీలను చించివేసి, ఆ ఫ్లెక్సీలపై  'కాదు కాదు.. వీడు సన్నాసే' అని రాసి నిరసన తెలియజేశారు.  కాగా ఇవాళ సాయంత్రం భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి ఎంపీ  సంజయ్ పాదయాత్ర చేరుకోనున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.