
న్యూఢిల్లీ: భారత కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిట్ మ్యాన్‌పై షామీ చేసిన కామెంట్స్ పొలిటికల్ టర్న్ తీసుకోగా.. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. కోట్లాది మంది భారతీయుల తరుఫున టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న రోహిత్ శర్మపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని.. భారత్‌కు, భారతీయులకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం అనడానికి ఇదే నిదర్శమనమని కాషాయ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది.
షామా కామెంట్స్‌పై పలువురు మాజీ క్రీడాకారులు, నెటిజన్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారత జాతీయ జట్టు కెప్టెన్‌ను ఇలా అవమానించడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ పార్టీకి చురకలంటిస్తున్నారు. రోహిత్ శర్మ భారత్ కు ఐసీసీ కప్ అందించాడని గుర్తు చేస్తున్నారు. షామా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో అలర్ట్ అయిన కాంగ్రెస్ హైకమాండ్ డ్యామేజ్ కంట్రోల్‌కు దిగింది. ఈ మేరకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై చేసిన బాడీ షేమింగ్ ట్వీట్ తక్షణమే సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయాలని కాంగ్రెస్ ఆదేశించింది.
ALSO READ | క్రికెటర్ నైతికతను దెబ్బ తీసేందుకే ఇలాంటి కామెంట్స్: షామా మొహమ్మద్‌పై బీసీసీఐ విమర్శలు
పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు రోహిత్ శర్మ గురించి చేసిన ట్వీట్‌ను షామా మొహమ్మద్ ఎక్స్ (ట్విట్టర్) నుంచి తొలగించారు. షామా కామెంట్స్‌పై బీసీసీఐ కూడా స్పందించి.. ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐసీసీ టోర్నీ జరుగుతోన్న సమయంలో భారత జట్టు కెప్టెన్ గురించి మాట్లాడటం అతడి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేనని మండిపడింది.
అసలు షామా మొహ్మమద్ ఏమన్నారు..?
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ 17 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ శర్మ విఫలం కావడంతో కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి షామా మొహ్మమద్ భారత కెప్టెన్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అధిక బరువు ఉన్నారు.. అతడు బరువు తగ్గాల్సి ఉందని బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు షామా.
అంతేకాకుండా.. భారతదేశం ఇప్పటివరకు కలిగి ఉన్న అత్యంత ఆకట్టుకోలేని కెప్టెన్ కూడా రోహిత్ శర్మనేనని షామా ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే రోహిత్ పై షామా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై అటు రోహిత్ ఫ్యాన్స్‌తో పాటు బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. రోహిత్ సారథ్యంలో భారత్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సాధించిందని ఆమెకు కౌంటర్ ఇస్తున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్.
అందులో తప్పేం లేదు..:
కెప్టెన్ రోహిత్ శర్మపై తాను చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో షామా మొహ్మమద్ మరోసారి స్పందించారు. నేను ఒక క్రీడాకారుడి ఫిట్‌నెస్ గురించి ట్వీట్ చేశాను.. అతని శరీరాన్ని అవమానించడానికి కాదు అని క్లారిటీ ఇచ్చారు. అథ్లెట్లు ఫిట్‌గా ఉండాలని నేను ఎప్పుడూ నమ్ముతానని.. ఇందులో భాగంగానే రోహిత్ కొంచెం బరువుగా ఉన్నాడని నేను భావించానని ఆమె వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఇది ఒక సాధారణ ట్వీట్ అని.. ఇలా చెప్పడంలో తప్పేముంది..? ఇది ప్రజాస్వామ్యం అని పేర్కొన్నారు. తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు తనకు ఉందని షామా అన్నారు.