
కాంగ్రెస్ నేత షమా తీరుపై బీజేపీ ఫైర్
దుమారం రేగడంతో కామెంట్లు డిలీట్
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ చేసిన కాంమెట్లు దుమారం రేపాయి. దీంతో ఆ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆమె కామెంట్లకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆమెను ఆదేశించామని, క్రీడాకారులను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు. పార్టీ ఆదేశాలతో షమా కూడా తాను చేసిన పోస్టులను, కామెంట్లను ట్విట్టర్ నుంచి సోమవారం డిలీట్ చేశారు.
అసలేం జరిగిందంటే..
ఆదివారం న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 15 రన్స్‌కే ఔటయ్యాడు. దీనిపై షమా మహమ్మద్ ట్వీట్ చేశారు. రోహిత్ ఫిట్‌గా లేడని, ఆయన బరువు తగ్గితే మంచిదన్నారు. టీమిండియా గత కెప్టెన్లతో పోలిస్తే రోహిత్ శర్మ అంతగా ఆకట్టుకునే కెప్టెన్ కాదని కామెంట్ చేశారు. దీనిపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు బాడీషేమింగ్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీమిండియాలో రాహుల్ గాంధీ ఆడితే బెటర్ అని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారేమోనని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ కెప్టెన్సీలో పదేండ్లుగా కాంగ్రెస్ నేతలు ఓడిపోతున్నారని, ఢిల్లీలో డకౌట్ అయ్యారని సెటైర్ వేశారు. షమా కామెంట్లపై నెటిజన్ల నుంచి కూడా విమర్శలు రావడంతో ఆమె వివరణ ఇచ్చుకున్నారు. తాను మామూలుగానే అన్నానని, కపిల్ దేవ్, ధోనీ, కోహ్లీ వంటి కెప్టెన్లతో పోల్చినప్పుడు రోహిత్ ఆ స్థాయిలో లేడని చెప్పుకొచ్చారు. ఆ మాత్రం ఒపీనియన్ చెప్పే హక్కు కూడా లేదా అంటూ ఆమె ప్రశ్నించారు. ఈ వివాదంపై కాంగ్రెస్ స్పందిస్తూ కంట్రోల్ చర్యలు చేపట్టగా, షమా తాను చేసిన ట్వీట్లను తొలగించారు.
రోహిత్‌ను టీమ్‌లోంచి తీసెయ్యాలి: టీఎంసీ ఎంపీ
రోహిత్‌శర్మపై షమా కామెంట్లను టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ సోమవారం సమర్థించారు. రోహిత్ శర్మ అధిక బరువు కారణంగా ఫిట్‌గా లేడని, ఆయన టీమ్‌లో ఉండకూడదని అన్నారు. రెండేండ్లకోసారి సెంచరీ కొట్టేవాళ్లు టీమ్‌లో ఎందుకని ప్రశ్నించారు. తానేం రాజకీయం మాట్లాడట్లేదని, క్రికెట్ అభిమానిగానే చెప్తున్నానని అన్నారు.