- కేంద్ర బడ్జెట్లో అన్యాయంపై పలు చోట్ల ఫ్లెక్సీలు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో మరోసారి ‘గాడిద గుడ్డు’ ఫ్లెక్సీలు వెలిశాయి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిటీలోని పలు బస్టాప్ లు, ముఖ్య కూడళ్ల వద్ద ‘గాడిద గుడ్డు’ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అనే ప్రచారాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.
“తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే.. కేంద్ర బడ్జెట్ లో బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది? గాడిద గుడ్డు ” అనే పేరుతో టాయ్ ఎగ్ ను ముద్రించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. లోక్ సభ ఎన్నికల ముందు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెలిసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు.. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనిపించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రోడ్లపై వెళ్తున్న జనం దృష్టిలో ఇవి పడడంతో వారు ఆసక్తిగా చర్చించుకోవడం కనిపించింది.