![కాంగ్రెస్ ఓటు షేర్ పెరిగింది.. 2020లో 4.3%.. ఇప్పుడు 6.39%.. కానీ పార్టీకి ఒక్క సీటూ దక్కలేదు](https://static.v6velugu.com/uploads/2025/02/congresss-vote-share-increased-but-the-party-did-not-get-a-single-seat_3E9lLUrsoM.jpg)
- వరుసగా మూడోసారీ జీరో
- కాంగ్రెస్ ఓటు షేర్ పెరిగింది కానీ పార్టీకి ఒక్క సీటూ దక్కలేదు
- వరుసగా మూడోసారీ జీరో
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మూడోసారీ ఖాతా తెరవలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ జీరోకే పరిమితమైంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఓటు షేర్ మాత్రం పెంచుకోగలిగింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 4.3 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్.. ఈసారి 6.39 శాతం ఓట్లు సాధించింది. అంటే 2.1 శాతం ఓట్లను పెంచుకోగలిగింది. ఢిల్లీలో చివరిసారి 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 40.31 శాతం ఓట్లు సాధించి కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. ఇక ఆ తర్వాత నుంచి ఆ పార్టీ పరాజయం పాలైంది. 2013లో 24.55 శాతం, 2015లో 9.7 శాతం, 2020లో 4.3 శాతం ఓటు షేర్ మాత్రమే సాధించగలిగింది. అయితే ఈసారి ఓటు షేర్ పెరగడంతో 2030లో తప్పకుండా గెలుస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది.
ముగ్గురికే డిపాజిట్..
ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురు మాత్రమే డిపాజిట్లు దక్కించుకోగలిగారు. మిగతా వాళ్లంతా డిపాజిట్లు కోల్పోయారు. వీరిలో అభిషేక్ దత్తా, రోహిత్ చౌదరి, దేవేందర్ యాదవ్ (బాదలీ) ఉన్నారు. పార్టీ అభ్యర్థుల్లో ఒక్క అభిషేక్ దత్తా మాత్రమే రెండో స్థానంలో నిలవగా.. మిగతా వాళ్లందరూ మూడు, నాలుగు స్థానాలకు పరిమితమయ్యారు. పార్టీలోని ప్రముఖ నేతలెవరూ తమ ప్రభావం చూపలేకపోయారు. కాంగ్రెస్ ఢిల్లీ చీఫ్ దేవేందర్ యాదవ్, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కా లాంబా, మాజీ మంత్రి హరూన్ యూసుఫ్ తదితరులు ఓడిపోయారు.