వర్షాలు విజృంభిస్తున్న వేళ కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. జిల్లాల్లో పదుల సంఖ్యలో ఈ కేసులు నమోదవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కరీంనగర్లోని ఓ గురుకుల పాఠశాలలో ఏకంగా 60 మంది విద్యార్థులకు కండ్లకలక అయింది.
వారం రోజులుగా ఈ సమస్యతో బాధపడుతున్న విద్యార్థుల పరిస్థితి తాజాగా వెలుగులోకి వచ్చింది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణా కాలనీలోని మహాత్మ జ్యోతిబాఫులే బీసీ గురుకులంలో కొద్ది రోజుల క్రితం పలువురు విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు.
అప్పటికే తోటి విద్యార్థులతో కలిసిపోయారు. దీంతో ఒక్కొక్కరుగా అస్వస్థకు గురి కావడంతో అప్రమత్తమైన టీచర్లు డాక్టర్లకు సమాచారం అందించారు. డాక్టర్లు పరీక్ష చేసి కండ్లకలకగా గుర్తించారు. అప్పటికే దాదాపు 60 మంది విద్యార్థులకు ఈ అంటువ్యాధి సోకింది.
విద్యార్థులు కళ్ల నుంచి నీరు రావడం.. జ్వరంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అంటువ్యాధి కావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కొందరు పేరెంట్స్ తమ పిల్లల్ని ఇళ్లకు తీసుకెళ్తున్నారు.