బీసీ సోయి బలపడాలి

బీసీ సోయి బలపడాలి

మూడు నాలుగు దశాబ్దాలుగా బీసీల రాజ్యాధికారంపై చర్చ తెలుగు సమాజంలో జోరుగా సాగుతోంది.  ముఖ్యంగా మండల్ అనుకూల, వ్యతిరేక ఉద్యమాల అనంతరం బీసీవాదం చర్చ ఊపందుకుంది.  బీసీ వాదం అనేది కేవలం  విద్యార్థి రంగం వరకే పరిమితం అయింది.  విశాల జన బాహుళ్యంలోకి బీసీ వాదాన్ని తీసుకెళ్లడంలో బీసీవాదులు  విఫలం చెందారు.  మొక్కుబడి కార్యాచరణలో  సంఘాలన్నీ కూడా  పాలకులతో  కేవలం లాబీయింగ్​కే పరిమితం అవుతున్నాయి.  బీసీ సోయిని, ఉమ్మడి రాజకీయ స్పృహను మేల్కొల్పటంలో బీసీ సంఘాలన్నీ కూడా వెనకపడ్డాయి.  

ఉమ్మడి బీసీ సమైక్యతకు పట్టుగొమ్మలాంటి కులసంఘాలు,  బీసీ సంఘాల మధ్య సమన్వయం లేకపోవడం బీసీల ఉద్యమానికి ప్రధాన లోపంగా ఉంది.  ఆచరణతో  కూడిన కార్యాచరణ,  ప్రజా నిర్మాణం,  బలమైన భావజాలం కూడిన సిద్ధాంతం లేని ఏ ఉద్యమాలైన విజయ తీరాలకు చేరవు. బీసీలు అని జట్టులు కట్టడం తప్ప నిజంగా బీసీలుగా పిలువబడుతున్న వృత్తి కులాలను పురికొల్పడంలో బీసీవాదులకు ఉన్న వ్యూహం, ఎత్తుగడలు  ఏమీ లేవు.

గ్రామీణ ప్రాంతాల్లో బలపడని బీసీవాదం

బీసీ ఉద్యమానికి కావలసిన ఉమ్మడి భావజాలం ఏదీ ఇప్పటివరకు ఆచరణ రూపు దాల్చలేదు. తెలుగు నేలపై  ఇప్పటివరకు సాగిన బీసీల కార్యాచరణ కేవలం సంక్షేమ పథకాల సాధనకు పరిమితం అయ్యింది.  బీసీ నినాదాన్ని పట్టణ ప్రాంతంలో  రౌండ్ టేబుల్, సదస్సులకే  పరిమితం చేశారు.  గ్రామసీమలోకి బీసీ వాదం వెళ్లలేదు.  గ్రామీణ ప్రాంతాల్లో బీసీల ఉనికి, అస్తిత్వం బలపడ్డ దాఖలాలు లేవు.  ఉమ్మడి రాష్ట్రంలోగాని,  తెలంగాణ రాష్ట్రంలో గాని జరిగిన ఎన్నికలు బీసీ ప్రయోగం కూడా సక్సెస్ కాలేదు. 

బీసీ వాదంపై ఏర్పడ్డ పార్టీలు  నెలలు  నిండక ముందే జెండా పీకేశాయి.  సామాజిక న్యాయం  ఎజెండాగా ఏర్పడ్డ  ప్రజారాజ్యం సమైక్య రాష్ట్రంలో ఉనికి చాటుకోలేకపోయింది. రాష్ట్రం సాధనలో  కేసీఆర్ తప్పుడు వ్యూహాలను తప్పుపడుతూ ఆవిర్భవించిన  విజయశాంతి పార్టీ తల్లి తెలంగాణ,  దేవందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీల మనుగడ మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది.  బీసీవాదం  సమైక్య రాష్ట్రాన్ని  ప్రభావితం చేయలేకపోయింది.  ప్రాంతీయ ఆకాంక్షకు జత కట్టలేకపోయింది.  

రెండు వైఫల్యాలకు కారణం సిద్ధాంత, నాయకత్వ ఆచరణ లోపాలే ప్రధాన కారణాలు.  బీసీ వాద సమూహాలు బీసీలు అంటే కేవలం సీట్ల పంచాయితీగా మాత్రమే చర్చకు పెట్టడం తప్ప బీసీ జీవితాలు, వృత్తి సాంస్కృతిక  వైరుధ్యాలను వారి ఆర్థిక కోణాలను ఆవిష్కరించలేకపోయారు.  ఏ వాదం అధికారంలోకి రావాలన్నా పదికాలాలపాటు ఉనికిలో ఉండాలన్నా అపార్టీకి భావజాలం, సైద్ధాంతిక పునాది  ప్రధానం. అది లోపిస్తే ఆశయాలు నినాదాలకే  పరిమితం అవుతాయి.

-  దొమ్మాట వెంకటేశ్​