- కలకలం రేపుతున్న వరుస సూసైడ్లు
- ఈ అకడమిక్ ఇయర్లోనే ఆరుగురు స్టూడెంట్ల ఆత్మహత్య
- మానసిక ఒత్తిళ్లతోనే దారుణాలు
- జాడలేని కౌన్సెలింగులు..
- కేటీఆర్ ఇచ్చిన హామీల్లో వచ్చింది ల్యాప్‌టాప్‌లే
- రెగ్యులర్ వీసీ లేక పర్యవేక్షణ కరువు
- ఆందోళనలో స్టూడెంట్స్, పేరెంట్స్
నిర్మల్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీలో వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు స్టూడెంట్స్, పేరెంట్స్ లలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 2008 నుం చి ఇప్పటివరకు ట్రిపుల్ ఐటీలో 32మంది స్టూడెంట్లు చనిపోయారు. ఈ ఒక్క అకడమిక్ ఇయర్ లోనే దాదాపు ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గడిచిన రెండు నెలల్లోనే ముగ్గురు విద్యార్థులు సూసైడ్ చేసుకోవడంతో క్యాంపస్‌లో కలకలం మొదలైంది. ఈ ఆత్మహత్యలకు కారణాలేంటో ఇప్పటివరకు స్పష్టత లేదు. ఘటన జరగ్గానే ట్రిపుల్ఐటీ ఆఫీసర్లు.. కమిటీలు వేస్తున్నా, నివేదికలను మాత్రం బయటపెట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ల్యాప్‌టాప్‌లు తప్ప ఏ హామీ నెరవేర్చలే..
రెండేండ్ల నుంచి బాసర ట్రిపుల్ ఐటీలో రోజుకో ఘటన జరుగుతూనే ఉన్నది. క్వాలిటీ లేని ఫుడ్, ఫ్యాకల్టీ కొరత, లైబ్రరీ తదితర సమస్య పరిష్కరించాలనే డిమాండ్‌తో గతేడాది జూన్ 14వ తేదీ నుంచి దాదాపు నెల రోజుల పాటు స్టూడెంట్స్ ఆందోళన చేశారు. మొదట్లో ఈ ఆందోళనలను అణచివేసేందుకు విశ్వప్రయత్నాలు చేసిన సర్కారు, స్టూడెంట్లు పట్టువీడకపోవడంతో ప్రభుత్వమే దిగివచ్చింది.
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు క్యాంపస్ ను సందర్శించి విద్యార్థులకు భరోసా ఇచ్చినా చాలా హామీలు నేటికీ నెరవేర్చలేదు. రెగ్యులర్ వీసీ నియామకం, టీచింగ్ ఖాళీల భర్తీ, మెస్ ఏజెన్సీల మార్పు, అందరికీ ల్యాప్‌టాప్‌ల అందజేత, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, హాస్టల్ రూమ్ లకు రిపేర్లు, క్లాస్ రూమ్‌ల మాడిఫికేషన్లాంటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పగా, కేవలం స్టూడెంట్లందరికీ ల్యాప్ టాప్ లు అందజేశారు. మిగిలిన ఏ హామీని నెరవేర్చలేదని స్టూడెంట్లు ఆరోపిస్తున్నారు.
రెగ్యులర్ వీసీ లేడు.. పర్యవేక్షణ లేదు..
ట్రిపుల్‌ఐటీని సందర్శించినప్పుడు ఇకపై మూడు నెలలకోసారి తాను క్యాంపస్ కు వస్తానని చెప్పిన కేటీఆర్ ఏడాదిగా ఇటువైపు కన్నెత్తి చూడలేదు. మరోవైపు కీలకమైన వీసీ పోస్టును ఇప్పటికీ నియమించలేదు. ప్రస్తుతం ఇన్చార్జి వీసీ వెంకటరమణ ఉన్నత విద్యమండలి వైస్ చైర్మన్ కావడంతో అందుబాటులో ఉండడంలేదు. ఇక డైరెక్టర్ సతీశ్‌కుమార్ సైతం తరచూ హైదరాబాద్ వెళ్తారని, దీంతో సిబ్బందిపై పర్యవేక్షణ కరువైందని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే స్టాఫ్ పలుమార్లు స్టూడెంట్స్ ముందు కొట్లాడుకున్నప్పటికీ వాళ్ల మీద కనీస చర్యలు తీసుకోలేదు. పైగా తమ ఆగడాలను ఎక్కడ బయటపెడ్తారోనని విద్యార్థులనే ఉల్టా కంప్లయింట్స్ పేరిట బెదిరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జాడలేని కౌన్సిలింగ్ లు..
ట్రిపుల్ ఐటీ అంటేనే స్టూడెంట్లపై చదువులు, పరీక్షల ఒత్తిడి ఉంటుంది. క్యాంపస్ వాతావరణం సరిగ్గా లేకపోవడం, స్టడీస్‌లో వెనుకబాటు, హోమ్‌సిక్, ఇతర వ్యక్తిగత కారణాల వల్ల కూడా విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు. ముఖ్యంగా ప్రెషర్లో ఒత్తిడి, కుంగుబాటు ఎక్కువ ఉంటోంది. ఇలాంటి విద్యార్థుల్లో మనోధైర్యం నింపేందుకు నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాల్సి ఉన్నా ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. కనీసం స్టడీస్‌లో వెనుకబడిన స్టూడెంట్స్పైనా ఫోకస్ పెట్టడం లేదని విద్యార్థులు అంటున్నారు. దీనికితోడు తోటి విద్యార్థుల కండ్ల ముందే ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో చాలా మంది స్టూడెంట్లు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెలలో ఇప్పటికీ ముగ్గురు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నా కౌన్సెలింగ్ ఇప్పించే ప్రయత్నం చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొత్త మెస్ లపై స్పందన కరువు..
ఏడాది కింద ఆందోళన టైంలో స్టూడెంట్లు ప్రధానంగా మెస్‌లలో క్వాలిటీ ఫుడ్ పెట్టడం లేదని ఆరోపించారు. దీంతో ఆయా మెస్‌ల నిర్వాహకులను తొలగించి కొత్తవాళ్లను తీసుకుంటామని అప్పట్లో ఉన్నతాధికారులు హామీనిచ్చారు. కొత్తగా మెస్ ల నిర్వహణ కోసం టెండర్లు సైతం ఆహ్వానించారు. కానీ, సాంకేతిక కారణాలతో టెండర్ దాఖలు చేసిన సంస్థలకు అర్హత దక్కలేదు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన ఆఫీసర్లు ఆ పని చేయకపోవడంతో ఎప్పట్లాగే పాత సంస్థలే క్యాంపస్ లో మెస్ లను నిర్వహిస్తున్నాయి. దీనిని బట్టి ట్రిపుల్ ఐటీలో సమస్యల పరిష్కారంపై సర్కారుకు, అధికారులకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.