జంట జలాశయాల పరిరక్షణ బాధ్యతలు హైడ్రాకు అప్పగింత

  • ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరాకే వాటర్​బోర్డు పరిమితం 
  • సమీపంలో ఆక్రమణలను పట్టించుకోకపోవడమే  కారణం 
  • విజిలెన్స్​ సెల్ ఉన్నా  కాపాడలేకపోయిన వాటర్​బోర్డు  
  • అందుకే హైడ్రాకు అప్పగింత 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​నగర తాగునీటి అవసరాలను తీరుస్తున్న చారిత్రక ఉస్మాన్​సాగర్, హిమాయత్​ సాగర్​పరీవాహక ప్రాంతాలు, జలాశయాల పరిరక్షణ బాధ్యత ఇక హైడ్రానే చూసుకోనుంది.

హైదరాబాద్​మెట్రోవాటర్​బోర్డు ఏర్పాటు తర్వాత ఈ రెండు జలాశయాలను బోర్డు పరిధిలోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి కూడా వాటర్​బోర్డు అధికారులు జంట నగరాలకు తాగునీటిని సరఫరా చేసే విషయంలోనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. కానీ క్యాచ్​మెంట్​ఏరియాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఆక్రమణల గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కబ్జాలు పెరిగాయి.  

పెద్ద సంఖ్యలో కబ్జాలు

3.9 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఉస్మాన్​సాగర్​కు 46 చదరపు కిలోమీటర్ల పరివాహక వైశాల్యం ఉండగా.. జలాశయ పరిధిలో 84 గ్రామాలున్నాయి. ఇందులో కీలకమైన జన్వాడ, శంకర్​పల్లి, మంచిరేవుల, కోకాపేట, నార్సింగి, ఖానాపూర్​, బొంతక్​పల్లి, చిన్న మంగళారం, మొత్కుపల్లి, అప్పాజిగూడ, చిల్కూరు, హిమాయత్​నగర్, మేకన్​గడ్డ వంటివి ఉన్నాయి. ఉస్మాన్​సాగర్​సమీపంలో ప్రస్తుతం నానక్​రామ్​గూడ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్​వంటి ప్రాంతాలు ఐటీహబ్​గా అభివృద్ధి చెందాయి.

హిమాయత్​సాగర్​కూడా 2.9 టీఎంసీల సామర్థ్యంతో 35  చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. శంషాబాద్, మొయినాబాద్, అజీజ్​నగర్, కొత్వాల్​గూడ, కవ్వగూడ, సుల్తాన్​పల్లి, నర్కుడా, నాగిరెడ్డిగూడ, తదితర ప్రాంతాలు దీని పరిధిలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే నేరుగా హిమాయత్​సాగర్​, ఉస్మాన్​సాగర్​లకు చేరుకుంటాయి. హిమాయత్​సాగర్, ఉస్మాన్​సాగర్​ పరీవాహక ప్రాంతాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం1995లో జీవో111 తీసుకువచ్చింది. దీని ప్రకారం జలాశయాలకు 10 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు, భారీ పరిశ్రమలు చేపట్టకూడదని జీవోలో స్పష్టం చేశారు.

కానీ అలాంటివి వెలుస్తున్నా మెట్రోవాటర్​బోర్డు అడ్డుకోవడంలో విఫలమైంది. బోర్డుకు ప్రత్యేకంగా విజిలెన్స్​సెల్ ఉన్నా కాపాడలేకపోయింది. దీంతో వారసత్వ కట్టడాలుగా ఈ రెండు జలాశయాల పరిరక్షణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు జలాశయాలకు సమీపంలోని ఫాంహౌస్​లు, ఇతర చోట్ల నుంచి వచ్చి కలుస్తున్న మురుగు రాకుండా చేయడం, అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కబ్జాలు తొలగించే ఆలోచనతోనే హైడ్రాకు అప్పగించినట్టు స్పష్టమవుతున్నది.  

చారిత్రక నేపథ్యం 

నిజాం కాలం నాటి ఈ రెండు జలాశయాలకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. 1908లో మూసీకి భారీ వరద రావడంతో హైదరాబాద్​నగరం నీట మునిగి వేల సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. దీంతో భవిష్యత్​లో మళ్లీ అలాంటి సంఘటన పునరావృతం కాకుండా అప్పటి నిజాం నవాబ్​మీర్​ఉస్మాన్​అలీఖాన్​ మూసీకి ఎగువన రెండు జలాశయాలు కట్టించాలని నిర్ణయించి సర్​మోక్షగుండం విశ్వేశ్వర్యను నగరానికి రప్పించారు. ఆయన ఇచ్చిన ప్లాన్​ ప్రకారమే ఈ రెండు జలాశయాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఉస్మాన్​సాగర్​1920లో పూర్తికాగా, హిమాయత్​ సాగర్​1927లో పూర్తయ్యింది.