అంతరించిపోతున్న’ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్’ను ఫిబ్రవరిలోగా రక్షించే ప్రణాళికలపై స్పష్టత ఇవ్వాలని ఈ మధ్యనే భారత ఉన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి వై.వి.చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అధిక ప్రసార విద్యుత్తు లైన్లను ఢీకొనడం వల్ల ఈ పక్షి జాతులు అంతరించి పోతున్నాయని, వాటిని కాపాడే ప్రణాళికలను రూపొందించాలని పేర్కొంది.
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, భారత్, పాకిస్తాన్ దేశాల్లో కనిపించే అత్యంత బరువైన భూమిపై నివసించే పక్షి. ఇది ప్రపంచంలో కనిపించే అతిపెద్ద ఎగిరే పక్షి జాతులలో ఒకటి. దీని శాస్త్రీయనామం ‘ఆర్డియోటిస్ నిగ్రిసెప్స్’ దీనిని మాల్తోక్, రీబూట్, గోదావన్, తక్దీర్, సోహన్ చిడియా మొదలైన పేర్లతో, వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. ఇది చాలా నిశ్శబ్ద పక్షి . తెలుగు రాష్ట్రాల్లో దీన్ని బట్ట మేక పిట్ట అని పిలుస్తారు.
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అరుపు పులి గర్జనను పోలి ఉండడం వల్ల దీనిని గగన్ బేర్ లేదా గురైన్ అని కూడా పిలుస్తారు. ఇది అవకాశవాది, సర్వభక్షకి,పురుగులను తినడానికి ఇష్టపడుతుంది. రైతుకు స్నేహితుడు. గతంలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మాంసంలో కామోద్దీపన గుణాలు ఉన్నాయని నమ్మకం కలిగి ఉండేవారు. కానీ ఇది వాస్తవం కాదు. భారతదేశ జాతీయ పక్షి ఎంపిక పరిశీలనలో ఉన్నప్పుడు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్‌ను ప్రముఖ భారతీయ పక్షి శాస్త్రవేత్త ‘సలీం అలి’చే ప్రతిపాదించబడింది. కానీ కొన్ని కారణాలు ‘ఇండియన్ పీ పౌల్’ కు అనుకూలంగా మారాయి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి జనాభాలో విపరీతమైన తగ్గుదల కారణంగా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ప్రమాదకరమైన జాతుల రెడ్ లిస్ట్‌లో చేర్చబడింది. 2011లో, బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ కూడా ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి జాతిని అంతరించిపోతున్న, క్రిటికల్ ఎండేంజర్డ్ జాతిగా వర్గీకరించింది.
బస్టర్డ్ జనాభా తగ్గుతోంది
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సర్వభక్షకి. ఇది ఎడారులలో జీవించే జంతువుల వలె, నీటిని అందుబాటులో ఉన్నప్పుడు తాగి, లేనప్పుడు కూడా ఎక్కువ కాలం జీవించగలవు. చాలా అరుదుగా రెండు గుడ్లు పెడుతుంది. 27 రోజులు పొదుగుతుంది. ఆవాసాలను కోల్పోవడం, వేటాడడం అనే రెండు ప్రధాన కారణాలవల్ల గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మనుగడ ముప్పుగా మారిందని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఇండియాలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ జనాభా 200గా అంచనా వేయబడింది. కర్ణాటకలోని రాణి బెన్నూర్, బ్లాక్ బక్ అభయారణ్యం వద్ద కూడా ఆవాసంలో మార్పులు రావడం కృష్ణ జింక, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ల జనాభా పై ప్రభావం కనబడింది. మహారాష్ట్రలోని బస్టర్డ్ అభయారణ్యంలో కేవలం 9, అలాగే గుజరాత్ లో కేవలం 48 గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ లు ఉన్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారతదేశంలో బ్రిటిష్ పాలన కాలం నుండే అగ్రశ్రేణి స్పోర్ట్స్ జీవిగా పరిగణించబడే బస్టర్డ్ ను మాంసం కోసం వేటాడడం జరిగేది.
అన్ని రాష్ట్రాల్లో సంరక్షణ చర్యలు
భారత వన్యప్రాణి చట్టం 1972లోని షెడ్యూల్ 1లో ఈ పక్షి చేర్చబడింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీని సంరక్షణకు అనేక రక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేశాయి. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో నాలియా, ఆంధ్రప్రదేశ్‌లోని రోల్లపాడు, మహారాష్ట్రలోని బస్టర్డ్ అభయ అరణ్యం, రాజస్థాన్‌లోని ఎడారి జాతీయ ఉద్యానవనం చాలా ముఖ్యమైనవి. పరిరక్షణ చట్టాలు అనేకం ఉన్నప్పటికీ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ జనాభా బాగా తగ్గింది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సంరక్షణకు సరియైన జీవ పరిశోధనను చేయడం కూడా ఎంతో అవసరం.
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పరిరక్షణకు, వన్యప్రాణి సంరక్షణ చట్టంను కఠినంగా అమలు చేయాలి. ఈ అంతరించిపోతున్న పక్షిని సంరక్షించడానికి భారతదేశంలో ‘ప్రాజెక్టు బస్టర్డ్’ను ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విత్తన వ్యాప్తి, కీటకాల నియంత్రణ, వ్యవసాయ ఉత్పాదకతలో, పర్యావరణ సమతుల్యతలో ప్రముఖ పాత్ర కలిగిన ఈ పర్యావరణహిత ‘గ్రేట్ ఇండియన్ బస్టర్డ్’ను సంరక్షించుకోవాలి. భారత ఉన్నత న్యాయస్థానం ఆదేశించినట్లుగా సరైన ప్రణాళికలను సిద్ధం చేసుకుని ఈ పక్షి జాతికి రక్షణ కలిగించి అంతరించిపోకుండా కాపాడుకునే బాధ్యత మన అందరి పైన ఉంది.
డా. చిందం రవీందర్,పీహెచ్డీ (పర్యావరణ శాస్త్రం)