
హైదరాబాద్, వెలుగు: పెళ్లయిన కుమార్తె కారుణ్య నియామకానికి అర్హురాలేనని, దీనికి సంబంధించి అన్ని పత్రాలతో సమర్పించిన వినతి పత్రాన్ని పునఃపరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పోలీసు శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన భర్త మహమ్మద్ యూసఫ్ కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తూ మృతి చెందినందున కారుణ్య నియామకం కింద తన కుమార్తె మారియం ఫాతిమాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని షహీన్ సుల్తానా అనే మహిళ నగర పోలీసు కమిషనర్ ను కోరింది.
అయితే, ఆమె వినతి తిరస్కరణకు గురైంది. దాంతో షహీన్ సుల్తానా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..పిటిషనర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని, కుమారుడు కెనడాలో ఉంటూ తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదని, ఒక కుమార్తె భర్తతో మరోచోట కాపురం చేస్తోందన్నారు. మరో కుమార్తె మరియం ఫాతిమానే షహీన్ సుల్తానా బాగోగులను చూసుకుంటోందని తెలిపారు.
మరియం ఫాతిమా నిరుద్యోగి కావడంతో తల్లి అనారోగ్యానికి చికిత్స కూడా అందించలేకపోతున్నారని కోర్టుకు వివరించారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ..పిటిషనర్ భర్త తనపై ఆధారపడినవారిలో భార్య పేరు మాత్రమే ఇచ్చారని..అందువల్ల కారుణ్య నియామకం కింద దరఖాస్తును తిరస్కరించారన్నారు.
కోర్టు స్పందిస్తూ..వివిధ కోర్టుల తీర్పుల ప్రకారం పెళ్లయిన కుమార్తె కారుణ్య నియామకానికి అర్హురాలేనని, అయితే కొన్ని షరతులకు లోబడి ఉండాలన్నారు. అన్ని పత్రాలను పునఃపరిశీలించి 8 వారాల్లో కారుణ్య నియామకంపై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేసింది.