- మార్చి నెలాఖరులోగా క్లియర్ చేయాలని ఆదేశాలు
- కరీంనగర్జిల్లాలో పెండింగ్ అప్లికేషన్లు 36,771
- సిటీ పరిధిలోనే 24,712..
- వీటిని క్లియర్ చేస్తే బల్దియాలకు రూ.300 కోట్లు ఆమ్దానీకి చాన్స్
కరీంనగర్, వెలుగు: మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల పరిశీలనకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ దరఖాస్తులను మార్చి నెలాఖరులోగా క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో మున్సిపల్ ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం 36,771 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉండగా, ఇందులో ఒక్క కరీంనగర్ బల్దియా పరిధిలోనే 24,712 దరఖాస్తులు ఉన్నాయి. మొత్తం అప్లికేషన్లు క్లియర్ అయితే కరీంనగర్‌లోపాటు, ఇతర మున్సిపాలిటీలకు సుమారు రూ.300 కోట్ల మేర ఆదాయం వచ్చే చాన్స్ ఉంది.
రెగ్యులరైజేషన్ చార్జీలు ఇలా..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లలోనే ప్లాట్లు కొనుగోలు చేయాలి. లేఅవుట్లలో రేట్లు ఎక్కువగా ఉండడంతో పేద, మధ్యతరగతి ప్రజలు నాన్ లేఅవుట్ ప్లాట్లను కొనుగోలు చేశారు. ఈ ప్లాట్లలో ఇల్లు కట్టుకోవాలంటే ప్లాట్ కొనేనాటికి సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ వ్యాల్యూలో 14 శాతం సర్ చార్జీగా చెల్లించాలి. 100 చ.మీ(120 గజాలు) ప్లాటుకు చదరపు మీటర్‌కు రూ.200 చొప్పున, 101 చ.మీ(121 గజాలు) నుంచి 300 చ.మీ(358 గజాలు) వరకు చదరపు మీటర్ కు రూ.400 చొప్పున, 301 చ.మీ. నుంచి 500 చ.మీ. వరకు చ.మీ.కు రూ.600, 500 చ.మీ.పైగా విస్తీర్ణం ఉన్న ప్లాట్ కు రూ.750 చొప్పున బేసిక్ రెగ్యులరైజేషన్ చార్జీలుగా నిర్ణయించారు.
ఆగస్టు 20, 2020 నాటికి సబ్ రిజిస్ట్రార్ ల్యాండ్ మార్కెట్ వ్యాల్యూను బట్టి గజం రూ.3వేల లోపు ఉంటే మొత్తం బేసిక్ చార్జీల్లో 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. రూ.3001 నుంచి రూ.5 వేల వరకు ఉంటే మొత్తం బేసిక్ చార్జీల్లో 50 శాతం, రూ.5001 నుంచి రూ.10 వేల వరకు ఉంటే 75 శాతం, రూ.10 వేలు దాటితే బేసిక్ చార్జీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఓపెన్ ప్లాట్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయితే ప్లాట్ల ఓనర్లకు ఊరట కలగనుంది. ప్రభుత్వరంగ సంస్థల భూములు, అసైన్డ్ భూములు, ఎండోమెంట్, వక్ఫ్, కోర్టు వివాదాలు, ఇతర వివాదాల్లోని స్థలాలను ఎల్ఎర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయరు. ఎల్ఆర్ఎస్ వల్ల ఇంటి పర్మిషన్ తోపాటు, బ్యాంకు లోన్ ప్రాసెస్ ఈజీ కానుంది.
బల్దయాలకే ఆదాయం..
ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చే ఆదాయమంతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ఖజానాకే వెళ్లనుంది. ఇందుకోసం బ్యాంకుల్లో ప్రత్యేక అకౌంట్‌ను కూడా ఓపెన్ చేయించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 26,829 అప్లికేషన్లు రాగా ఇందులో 2,117 మంది చార్జీలు చెల్లించి, అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించారు. 224 అప్లికేషన్లును ఆఫీసర్లు రిజెక్ట్ చేశారు.
ఇంకా 24,712 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో 5,094 అప్లికేషన్లు రాగా, 787 ప్రాసెస్ లో ఉండగా, 4,297 పెండింగ్ లో ఉన్నాయి. హుజూరాబాద్ లో 3,981 అప్లికేషన్లు రాగా 195 పరిష్కారం కాగా, 3,786 పెండింగ్ లో ఉన్నాయి. చొప్పదండిలో 1400 అప్లికేషన్లలో 84 ప్రాసెస్ కాగా, 1,316 పెండింగ్ లో ఉన్నాయి. కొత్తపల్లి మున్సిపాలిటీలో 2,660 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ అప్లికేషన్లన్నీ పరిష్కరిస్తే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.200 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు మరో రూ.100 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.