కాంగ్రెస్లో చేరికలకు గేట్లు ఓపెన్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చిందని, ఇక నుంచి తాను పీసీసీ ప్రెసిడెంట్గా తన రాజకీయం ఏమిటో చూపిస్తానని చెప్పారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పదేపదే అంటున్నరు. వాళ్లు ప్రభుత్వాన్ని పడగొడ్తామంటే చూస్తూ ఊరుకోం” అని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎలాంటి ఫిరాయింపులకు పాల్పడలేదని, కానీ ఇప్పటి నుంచే తాను రాజకీయం ప్రారంభించానని, తమ పార్టీలోకి పొద్దున్నే ఒక గేటు తెరిచామని, మొత్తం ఇంకా తెరవలేదని అన్నారు.
కుట్రలు తిప్పి కొడ్తం
వంద రోజులు మంచి పరిపాలన అందించడానికే ప్రయత్నించామని, ఎవరు వచ్చినా చేరికలు అనే విధానానికి పోకుండా పరిపాలన మీదే దృష్టి పెట్టామని సీఎం రేవంత్ చెప్పారు. ‘‘ప్రతిరోజు బీఆర్ఎస్, బీజేపీ వాళ్లు ప్రభుత్వాన్ని పడగొడుతాం.. పడగొడుతాం అని కుట్రలు చేస్తున్నరు. కుట్రలను తిప్పి కొట్టాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడానికి అవకాశం ఇవ్వకుండా.. కేసీఆర్ మొదలు కడియం శ్రీహరి లాంటి వాళ్లు కూడా ప్రభుత్వం మూడు నెలలు ఉండదని అంటున్నరు.
ALSO READ | యూనిట్ కరెంట్ ను కేసీఆర్ రూ.10 కొంటే.. రేవంత్ రూ.5కే కొంటున్నారు
బీజేపీ నేత లక్ష్మణ్ కూడా ఎంపీ ఎన్నికలు అయిన వెంటనే ఆపరేషన్ మొదలుపెడ్తమనడం దేనికి సంకేతం? ఈ వంద రోజుల్లో ఎక్కడైనా, ఏదైనా ఫిరాయింపులకు గానీ, రాజకీయంగా గానీ, వేరే రకంగా గానీ ఏమైనా మేం ప్రయత్నం చేశామా ? ఈ రోజు వాళ్లిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతున్నరు. ప్రభుత్వాన్ని పడగొడుతామని అంటున్నరు. వాళ్లు పడగొడితే చూసుకుంటూ కూర్చుంటమా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిన్రు. కొట్టకుండా ఉంటమా ? కొడుతం కదా..” అని సీఎం అన్నారు.