మీటర్ల కంటే మెయిల్స్ లోనే బార్క్ ప్రతినిధుల నిర్ణయాలు
కీలక అధికారుల మెయిల్స్, చాట్ విశ్లేషణతో వెలుగులోకి
అటు మీటర్ల మానిప్యులేషన్.. ఇటు డేటా ట్యాంపరింగ్
రేటింగ్ లోపాలపై ముందే అలర్ట్ చేసినా నిర్లక్ష్యం
హైదరాబాద్, వెలుగు: టీవీ చానెళ్లకు రేటింగ్ లు ఇచ్చే BARC (బ్రాడ్ క్యాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్) సంస్థలో మీటర్ల డేటా కంటే మెయిల్స్ లో వచ్చే సూచనలే బలంగా పనిచేసినట్లు నిర్ధారణ అయింది. ఏ చానెల్ కు ఎంత రేటింగ్ పెంచాలి, ఎవరికి తగ్గించాలి, ఎవరిని ఏ పొజిషన్ లో ఉంచాలో కూడా మెయిల్స్ లోనే నిర్ణయించేసినట్లు ఆధారాలతో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ముంబయిలో BARC రేటింగ్ స్కాంలో దర్యాప్తు జరుగుతుండగా తాజాగా బార్క్ అధికారుల మెయిల్స్ పై ఫోరెన్సిక్ రిపోర్ట్ బయటికి రావడం మరింత కలకలం రేపుతోంది. ఇందులో BARC మాజీ సీఈవో, సీవోవో పాటు పలు కీలక అధికారుల మధ్య రేటింగ్ గురించి మెయిల్స్, చాట్స్ ఉన్నాయి. ఇంగ్లిష్ చానెళ్లతో పాటు తెలుగు చానెళ్ల రేటింగ్ గురించే ఈ మెయిల్స్ లో ఉన్నట్లు గుర్తించారు. BARCలో అక్రమాలపై అంతర్గత విచారణ బాధ్యతను ముంబైకి చెందిన ARCP (అక్విజరీ రిస్క్ కన్సల్టింగ్ ప్రై.లి.) అనే సంస్థకు గతేడాది మార్చిలో అప్పగించారు. గతంలో కీలక స్థానాల్లో పనిచేసిన అధికారుల కమ్యూనికేషన్ మెయిల్స్, చాట్స్ ను ఈ సంస్థ ఫోరెన్సిక్ విశ్లేషణ చేసి గతేడాది జులైలోనే BARCకు సమర్పించింది. అయితే దాన్ని బయటపెట్టకుండా ఇంతకాలం దాచారు. రేటింగ్ స్కాం దర్యాప్తులో భాగంగా ముంబై పోలీసులు రిపోర్టును బయటికి తీశారు. ఇదే కేసులో ఇప్పటికే BARC మాజీ సీఈవో పార్థో దాస్ గుప్తా అరెస్టవగా, మాజీ సీఈవో రోమిల్ రామ్ గర్హియా అరెస్టై బెయిల్ పై బయటికొచ్చారు. ARCP ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఈ ఇద్దరితోపాటు మాజీ ప్రొడక్ట్ హెడ్ వెంకట్ సుజిత్, మాజీ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ పేఖం బసు, రజనీశ్ రాథోడ్, మాజీ వైస్ ప్రెసిడెంట్-వెస్ట్ రుషబ్ మెహతా మధ్య మెయిల్స్, సంభాషణలు ఉన్నాయి. ఓ మెయిల్ లో ‘ముఖ్యమైన చానెల్స్ అన్నీ పడిపోతున్నాయి. V6 ఒక్కటే పెరుగుతోంది. దీనిపై మరోసారి దృష్టిపెట్టండి’ అని రాశారు. మరికొన్ని చానెళ్ల రేటింగ్‌ను ఎంత పెంచాలి, ఎంత తగ్గించాలి, కొన్ని చానెళ్లకు ఏ చానెల్ తర్వాత పొజిషన్‌లో ఉంచాలి లాంటివీ మెయిల్స్‌లోనే సూచనలు చేశారు. రేటింగ్ మీటర్ల నిర్వహణను చక్కబెట్టడం పోయి సొంతగానే చానెళ్ల రేటింగ్స్ ను నిర్ణయించినట్లు వెల్లడి కావడం కలకలం రేపుతోంది. రేటింగ్ మానిప్యులేషన్ మొత్తం BARC అధికారులకు తెలిసే జరిగిందని స్పష్టమైంది. ఇళ్లలో పెట్టే రేటింగ్ మీటర్ల నిర్వహణలో లోపాలున్నాయనీ, డబ్బులిచ్చి మీటర్లను మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. స్టింగ్ ఆపరేషన్లలోనూ ఇది బయటపడింది. ఇప్పుడు ఏకంగా BARC అధికారులే మాట్లాడుకొని డేటాను మార్చేస్తున్నట్లు ఆధారాలతో బయటపడడంతో రేటింగ్ విశ్వసనీయతే సందేహంలో పడింది. ముంబై కేసుతో 3 నెలల పాటు దేశవ్యాప్తంగా న్యూస్ చానెల్స్ రేటింగ్స్ నిలిపేస్తున్నట్లు BARC ప్రకటించింది. పరిస్థితి చూస్తే మరికొన్ని నెలలు ఇది కొనసాగొచ్చని చెబుతున్నారు. ట్యామ్ పేరుతో గతంలో ఇచ్చిన రేటింగ్ విధానంపై విమర్శలు రావడంతో దాని ప్లేస్‌లో BARC తెరపైకి వచ్చింది. ప్రపంచంలోనే బెస్ట్ టెక్నాలజీతో, ట్యాంపరింగ్ కు అవకాశం లేకుండా చేస్తామంది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ట్యామ్ కంటే అధ్వానంగా BARC పనిచేస్తోందని మీడియా వర్గాలు అంటున్నాయి.
V6 పైనే టార్గెట్ ఎందుకు?
2012 లో మొదలైన V6 న్యూస్ తెలంగాణలో తిరుగులేని ప్రజాదరణ పొందింది. ప్రజాసమస్యలు, సామాజిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు తెలంగాణ భాష, సంప్రదాయాలకు పెద్దపీట వేసింది. హైదరాబాద్ గల్లీల నుంచి మారుమూల పల్లెల వరకు తెలంగాణ సమాజం పూర్తిస్థాయిలో ఆదరించడంతో V6 మంచి రేటింగ్ ను దక్కించుకుంటూ వచ్చింది. V6 ఆదరణను తట్టుకోలేక, దాన్ని తక్కువ చేసి చూపించడానికి ఏదో రకంగా కుట్రలు జరుగుతూ వచ్చాయి. అందులో భాగంగానే BARC రేటింగ్ మీటర్లను ట్యాంపర్ చేయడానికి ప్రయత్నించారు. ఇది గతంలోనే ఓ స్టింగ్ ఆపరేషన్లో వెలుగులోకి వచ్చింది. మరోవైపు నేరుగా BARC అధికారుల జోక్యంతో రేటింగ్ ను తగ్గించి చూపించేందుకు ప్రయత్నించినట్లు ఇప్పుడు బయటపడింది. జనం ఆదరణ వల్ల మరింత మెరుగైన రేటింగ్ వచ్చే అవకాశం ఉన్నా తగ్గించి చూపే కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. రేటింగ్ లో హెచ్చుతగ్గులను గుర్తించి గతంలోనే V6 ప్రతినిధులు BARC కు రిప్రజెంటేషన్లు ఇచ్చారు. మెయిల్స్ ద్వారా కూడా సమస్యలను దృష్టికి తీసుకెళ్లారు. అయితే వీటిని BARC యాజమాన్యం పట్టించుకోలేదు. రేటింగ్ డేటాలో లోపాలు లేవని బుకాయించారు. 2016 నవంబర్లో కక్షగట్టి తప్పుడు ఆరోపణలతో V6పైనే రేటింగ్ సస్పెన్షన్ విధించారు. దీనిపై V6 యాజమాన్యం ముంబై హైకోర్టును ఆశ్రయించింది. BARC తీరుపై హైకోర్టు ప్రశ్నించడంతో లోపాలు బయటపడతాయని భయపడి సస్పెన్షన్ వెనక్కి తీసుకుంది. ఇదే కేసులో V6పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు రూ.11 కోట్ల పరువునష్టం దావా ఇప్పటికీ కోర్టులో ఉంది. నాటి కేసు కారణంగానే BARC నిర్వహణ రూల్స్ లో మార్పులు చేసుకున్నారు. ఫిర్యాదుల కోసం అంబుడ్స్ మన్ కమిటీని ఏర్పాటు చేశారు. రేటింగ్ లోపాలను మాత్రం సరి చేసుకోలేదు. అప్పటి BARC సీవోవో రోమిల్, సీఈవో పార్థో దాస్ గుప్తానే ఇప్పుడు రేటింగ్ అక్రమాల కేసులో అరెస్టయ్యారు.
BARC చేయాల్సిందేంటి?
BARC రేటింగ్ అక్రమాలపై వరుసగా ఆధారాలు బయటికి వస్తుండటంతో సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం వచ్చింది. ఇండస్ట్రీలు, అడ్వర్టయిజ్ మెంట్ ఏజెన్సీలు, బ్రాడ్ క్యాస్టింగ్ సంస్థలు భాగస్వాములుగా ఉన్న వ్యవస్థలో ఇంత భారీ అక్రమాలు బయటపడడం BARC ప్రతిష్ఠనే దెబ్బతీసింది. ప్రజలకు సరైన వార్తలు, వాస్తవాలను అందించడానికి బదులు రేటింగ్ ను మేనేజ్ చేసుకుంటే సరిపోతుందనుకునే పరిస్థితి వచ్చింది. అటు ప్రకటనలపై ఇండస్ట్రీ ఖర్చు పెట్టే రూ. వేల కోట్లు తప్పుడు రేటింగ్‌తో వృథా అవుతున్నాయని ఆందోళన ఉంది. వీటికి చెక్ పెట్టేలా BARC లో మార్పులు చేయాలి. రేటింగ్ మీటర్ల నిర్వహణలో టెక్నాలజీని వాడుకోవాలి. మీటర్ల సంఖ్యను మేనేజ్ చేయలేని స్థాయిలో పెంచాలి. ప్రత్యేకంగా న్యూస్ చానెళ్ల రేటింగ్‌పై అనుమానాలున్నాయి. న్యూస్ రేటింగ్ విశ్లేషణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. చానెళ్ల ఆర్గానిక్ వ్యూయర్ షిప్‌ను గుర్తించే యంత్రాంగం ఉండాలి. చానెళ్ల నుంచి సబ్ స్క్రిప్షన్ ఆధారంగానే పనిచేసే BARC సంస్థ సరైన రేటింగ్ ఇవ్వకపోవడం సేవాలోపంగానే చూడాలి. దీనికి బాధ్యత తీసుకోవాలి. పరిహారం ఉండాలి.
BARC పైసలతో రోలెక్స్ లు.. ఫెరారీలు
రేటింగ్ అక్రమాలపై ARCP ఫోరెన్సిక్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలు గులోకి వచ్చాయి. అక్రమాల్లో భాగం ఉన్న BARC అధికారుల పనితీరును ఇది బయటపెట్టింది. రిపోర్ట్ ప్రకారం 2016 నుంచి 2019 వరకు BARC కీలక అధికారులందరికీ రేటింగ్ మానిప్యులేషన్ లో భాగం ఉంది. వీరంతా తమకు నచ్చినట్లుగా రేటింగ్ ను మారుస్తూ వచ్చారు. ముఖ్యంగా ఇంగ్లీష్, తెలుగు న్యూస్ రేటింగ్ లో కొన్ని చానెళ్లకు అనుకూలంగా పనిచేసినట్లు ఆధారాలున్నాయి. రిసెర్చ్ ను, రేటింగ్‌ను కంట్రోల్ చేయడంతో పాటు దీన్ని వ్యతిరేకించిన ఉద్యోగుల ను బదిలీచేయించారు. ఖరీదైన గిప్టుల కోసం బార్క్ నిధులనూ దుర్వి నియోగం చేశారు. 2017లో ఓ ఈవెంట్ పేరుతో పార్థో దాస్ గుప్తా తన సొంత విలాసాల కోసం ఫెరారీని హైర్ చేయించుకున్నారు. 2018లో రోమిల్ రోలెక్స్ వాచ్ కొన్నారు. దాన్ని రేటెంతో బయటపెట్టకుండా ఆ ఖర్చు మొత్తాన్ని దాస్ గుప్తా బార్క్ నుంచి చెల్లించారు. దీన్ని రోమిల్ బర్త్ డే గిఫ్ట్ గా లెక్కల్లో చెప్పారు. ఫోరెన్సిక్ డేటా రిపోర్ట్ ను గతేడాది జులైలోనే ఇచ్చినా బయటికి రాకుండా తొక్కి పెట్టారు. ముంబయి పోలీసుల దర్యాప్తుతో ఇది తాజాగా ఇప్పుడు బయటికొచ్చింది.