వికారాబాద్​ కలెక్టర్​పై దాడి వెనుక కుట్ర!

  • కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్​ కార్యకర్త సురేశ్
  • కొడంగల్ ​మాజీ ఎమ్మెల్యేపట్నం నరేందర్​రెడ్డి అనుచరుడిగా గుర్తింపు 
  • అటాక్​కు కొద్ది గంటల ముందు బీఆర్​ఎస్​ నేతకు 42 సార్లు ఫోన్లు​ 
  • పరారీలో సురేశ్​, 16 మంది అరెస్టు
  • అందరి కాల్​డేటా తీస్తున్న పోలీసులు

వికారాబాద్ / కొడంగల్, వెలుగు: వికారాబాద్​జిల్లా లగచర్లలో కలెక్టర్ ​ప్రతీక్​జైన్, ఇతర అధికారులపై సోమవారం జరిగిన దాడి వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలను సేకరిస్తున్నారు. దాడిలో కీలక నిందితుడిగా భావిస్తున్న బీఆర్​ఎస్​ కార్యకర్త సురేశ్​ పరారీలో ఉన్నాడు. సురేశ్​ పక్కా ప్లాన్​ ప్రకారమే కలెక్టర్​ను, ఇతర అధికారులను ప్రజాభిప్రాయ సేకరణ సభ నుంచి గ్రామానికి తీసుకెళ్లినట్లు పోలీసులు చెప్తున్నారు.
గ్రామంలో కలెక్టర్​ నాలుగు అడుగులు వేయగానే.. కొందరు దాడికి తెగబడ్డారని, ఇదంతా పథకం ప్రకారమే జరిగినట్లు తెలుస్తున్నదని అంటున్నారు. సురేశ్​ వెనుక ఎవరున్నారు? దాడికి ముందు అతడు ఎవరెవరితో మాట్లాడారు? అనే వివరాలు రాబడ్తున్నారు. దాడికి ముందు ​బీఆర్ఎస్  మాజీ ఎమ్మెల్యేతో  42 సార్లు సురేశ్​ ఫోన్​ మాట్లాడినట్టు పోలీసులు
గుర్తించారు. 

సురేశ్​ది కీలకపాత్ర 

సురేశ్ ​మాట మీద లగచర్లకు వెళ్లిన కలెక్టర్​తో ఎవరూ మాట్లాడడానికి సిద్ధంగా లేకపోగా..  నినాదాలు చేస్తూ దాడి చేశారు. దీన్నిబట్టి ఈ దాడికి బీఆర్ఎస్ లీడర్​సురేశ్ ​రెచ్చగొట్టిన మాటలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కలెక్టర్​ రాకముందే సురేశ్​ అక్కడి గ్రామస్తులను రెచ్చగొట్టి రాళ్లు, కర్రలతో సిద్ధంగా ఉంచాడని, ప్లాన్​ప్రకారం అక్కడికి వచ్చిన కలెక్టర్​ను, ఇతర అధికారులను తీసుకువెళ్లి దాడి చేయించినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు ఇదివరకే ప్రకటించారు. రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని, అందుకే దాడి చేశారని చూపించేందుకు, దీనివల్ల ఒక పార్టీకి లబ్ధి జరిగేలా చేసేందుకు సురేశ్​ ఇలా చేశారని తెలుస్తున్నది. దాడి చేసిన తర్వాత సురేశ్​తోపాటు మరికొందరు దొరక్కుండా పరారయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

సురేశ్.. మాజీ ఎమ్మెల్యే అనుచరుడు

కలెక్టర్​ను లగచర్లకు తీసుకుపోయిన బీఆర్ఎస్ ​కార్యకర్త సురేశ్​ ఓ మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా తెలుస్తున్నది. ఇప్పటికే ఆయన ఆ పార్టీ వర్కింగ్ ​ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి, హరీశ్​రావు, ఇతర లీడర్లను కలిసిన ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారగా.. పట్నం నరేందర్​రెడ్డి మంగళవారం దీనిపై స్పందించారు. ‘సురేశ్ మా పార్టీ కార్యకర్త. రోజూ నాకు ఫోన్లు చేస్తూ ఉంటాడు. అధికారులపై దాడి రోజు కూడా నాకు ఫోన్ ​చేశాడు. అతడికి అక్కడ భూమి ఉంది. ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరిస్తున్నాం అని చెప్పాడు. బహిష్కరించమని చెప్పా’ అని స్పష్టం చేశారు. 

నమ్మి వెళ్లినందుకు  

వికారాబాద్​ కలెక్టర్ ప్రతీక్​ జైన్​కు ​మృదు స్వభావిగా పేరుంది. ప్రజా సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని, నిజాయితీ గల అధికారి అని అందరూ చెప్పుకుంటారు. సోమవారం ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా దుద్యాలకు వచ్చిన ఆయన రైతుల కోసం గంటపాటు వేచి చూశారు. బీఆర్ఎస్​ కార్యకర్త సురేశ్ ​వచ్చి లగచర్లకు ఆహ్వానించగా, అక్కడున్న కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు వద్దని సర్ది చెప్పినట్టు సమాచారం. అయితే తాను ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి వచ్చానని, వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి అభిప్రాయం తెలుసుకోవడం తన డ్యూటీ అని లగచర్లకు వెళ్లినట్టు అక్కడున్న వారు చెబుతున్నారు.  సురేశ్​ను నమ్మి వెళ్లినందుకు రాజకీయ కుట్రతోనే కలెక్టర్​పై దాడి జరిగిందని అంటున్నారు. 

కాల్​ డేటాలో విస్తుపోయే నిజాలు

కలెక్టర్​, అధికారులపై దాడి జరగడానికి ప్రథమ కారణం సురేశ్​ అని తెలుసుకున్న పోలీసులు అతడి  ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు. అతడు ఎవరెవరితో మాట్లాడాడు? ఎప్పుడు మాట్లాడాడు? ఎక్కువ సార్లు ఎవరికి ఫోన్​ చేశాడు? అన్న వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డట్టు సమాచారం. కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి ముందు సురేశ్..​ బీఆర్ఎస్‌‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేతో 42 సార్లు ఫోన్​మాట్లాడినట్టు గుర్తించారు. నరేందర్​రెడ్డి.. సురేశ్​ను లైన్​లో ఉంచి ఆ పార్టీ ముఖ్య నేతతో 6 సార్లు ఫోన్​ మాట్లాడినట్టు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ కుట్ర ఉందన్న అనుమానాలు బలపడడంతో.. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. 

పరారీలో సురేశ్​..16 మంది అరెస్ట్​

దాడి జరిగిన తర్వాత అలర్టయిన పోలీసులు లగచర్ల గ్రామంలో 28 మందిని అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు. అప్పటికే సురేశ్​తో పాటు మరికొందరు గ్రామం నుంచి పరారైనట్టు గుర్తించారు. విచారణ తర్వాత 12 మందిని వదిలేసి.. 16 మందికి పరిగి ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని రిమాండ్​కు తరలించామని వికారాబాద్​ఎస్పీ నారాయణ రెడ్ది తెలిపారు. ప్రధాన నిందితుడు సురేశ్​ కోసం స్పెషల్ ​టీమ్స్​ గాలిస్తున్నాయని, అతడు దొరకగానే ఇంకా ఎవరెవరు దీని వెనక ఉన్నారనే విషయం తెలుస్తుందని, అందరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేశారు.

ప్లాన్​ ప్రకారమే దాడి: ఐజీ సత్యనారాయణ  

లగచర్ల ఘటన పక్కా పథకం ప్రకారమే జరిగిందని హైదరాబాద్‌‌ రేంజ్‌‌ ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. కలెక్టర్‌‌ ప్రతీక్ జైన్‌‌‌‌పై దాడి, కర్రలు, రాళ్లతో అధికారుల వాహనాల విధ్వంసం వెనుక కుట్ర ఉన్నదని  వెల్లడించారు. పక్కా ప్లాన్‌‌ ప్రకారమే విధ్వంwసానికి పాల్పడ్డారని తెలిపారు. దీని వెనుక స్థానిక బీఆర్ఎస్ నేత సురేశ్​ కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించామన్నారు. 57 మందిని అదుపులోకి తీసుకుని దాడికి పాల్పడిన 16 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఈ ఘటనపై మంగళవారం మంత్రి శ్రీధర్‌‌‌‌బాబుతో భేటీ అయిన అనంతరం ఐజీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 

సురేశ్​ కావాలనే కలెక్టర్‌‌‌‌ను గ్రామంలోకి తీసుకెళ్లినట్టు గుర్తించామని తెలిపారు.ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 3 నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. సురేశ్  పరారీలో ఉన్నాడని, అతడికోసం గాలిస్తున్నట్టు చెప్పారు.ఈ ఘటనలో బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేత సురేశ్​ను ప్రధాన నిందితుడిగా చేర్చినట్టు తెలిపారు. సురేశ్​ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నాడని, యూత్ లీడర్‌‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటన, ఓ కిడ్నాప్  కేసులో సురేశ్​ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కర్రలు,రాళ్లతో దాడులకు పాల్పడిన వారిని ఇప్పటికే గుర్తించామని చెప్పారు. వీరందరి కాల్ డేటాను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. వికారాబాద్‌‌ ఎస్పీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 4 స్పెషల్‌‌ టీమ్స్‌‌ ఏర్పాటు చేశామని తెలిపారు. సురేశ్​తోపాటు మరికొంత మంది కోసం గాలిస్తున్నామని చెప్పారు.ఈ ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవహరించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు.