ఉద్యోగులు, టీచర్ల మధ్య చిచ్చుపెట్టే కుట్ర

తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెతో ముందు వరుసలో నిలిచిన ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్ల సమస్యలు తీర్చడంలో సీఎం కేసీఆర్‌‌‌‌కు చిత్తశుద్ధి లేదు. మొదటిసారి ఎన్నికైనప్పుడు ‘ఎంప్లాయిస్‌‌‌‌ ఫ్రెండ్లీ’ ప్రభుత్వమని ప్రకటించి, ఇప్పుడు ‘ఎంప్లాయిస్‌‌‌‌ ఎనిమి’ సర్కార్‌‌‌‌గా మారినందుకు కేసీఆర్‌‌‌‌ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వచ్చింది. ఎన్నో మాటలు చెప్పిన టీఆర్ఎస్‌‌‌‌ సర్కారు ఉద్యోగులు, టీచర్లకు ఒరగబెట్టింది ఏమీ లేదు. పైగా ఇప్పుడు టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారంటూ.. వారిని ఉద్యోగుల నుంచి వేరు చేసే కుట్ర జరుగుతోంది.

ఉద్యోగులు, టీచర్ల విషయంలోనూ ‘ఆర్టీసీ ఫార్ములా’

నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరుగుతోందని తెలంగాణ సాధించుకుంటే, కేసీఆర్‌‌‌‌ సీఎం అయిన తర్వాత ఉద్యోగ సంఘాల ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె సమయంలో సంఘాలను విభజించి, వాటి అవసరమే లేదని ప్రకటించారు. కొందరు ఆర్టీసీ కార్మికులను ప్రగతి భవన్‌‌‌‌కు పిలిపించుకుని ఎన్నో ప్రకటనలు చేసి ఒక్కటి కూడా అమలు చేయని ఘనత కేసీఆర్‌‌‌‌దే. ఈ ఏడాది జనవరి 1న ఉద్యోగ సంఘాల బాధ్యులను ప్రగతి భవన్‌‌‌‌కు పిలిచి సమస్యలపై చర్చిస్తారనుకుంటే, భోజనాలు పెట్టి సంతృప్తిపరిచిన తీరు దారుణం. ఆర్టీసీ సమ్మెలో అనుసరించిన నీతిని మరోసారి ఉద్యోగ, టీచర్ల విషయంలో కేసీఆర్‌‌‌‌ అమలు చేస్తున్నారు. విభజించు పాలించు అన్న ఫార్ములాతో సమ్మె టైమ్‌‌లో ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకుండా ఆర్టీసీ యూనియన్లలో చిచ్చు పెట్టినట్లే, ఇప్పుడు టీచర్లు, ఉద్యోగ సంఘాల విషయంలోనూ వ్యవహరిస్తున్నారు.

టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులే కాదన్నట్లు కుట్రలు

టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులే కారని, వారిని స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌‌‌‌, జిల్లా పరిషత్‌‌‌‌ యాజమాన్యాలకు బదలాయిస్తారని వార్తలు వస్తున్నాయి. ఉద్యోగులు, టీచర్లు ఒక్కటి కాదన్న వార్తలను కేసీఆర్‌‌‌‌ కానీ, ప్రభుత్వం కానీ ఖండించకపోవడం వల్ల ఇది ప్రభుత్వం చేస్తున్న కుట్రగానే ఉద్యోగులంతా భావిస్తున్నారు. టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులేనని ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న చరిత్రను కేసీఆర్‌‌‌‌ మరచిపోవద్దు. ముఖ్యమంత్రి అంటే ప్రజలందరికీ తండ్రిలాగ ఉండాలి. కానీ, తన అవసరానికి వాడుకుని వదిలిపెట్టొద్దని కోరుతున్నాం.

ఇదిగో.. అదిగో అంటూ పీఆర్సీపై సాగదీత ధోరణి

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం ఐదేండ్లు పాలన చేస్తుంది. ఐదేండ్ల పాలన పూర్తయిన తర్వాత మరో దఫా అధికారం చేపట్టాలని కోరుకుంటే ప్రజలకు ఆమోదయోగ్యమైన పనులు చేయడం ఆనవాయితీ. కానీ, కేసీఆర్‌‌‌‌ సర్కారు కొన్ని వర్గాలను కక్ష సాధింపు ధోరణిలో చూసి, వారి సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు ఐదేండ్లకు ఒకసారి వేతన పెంపు చేయడం ఆనవాయితీగా వచ్చే తంతు. కానీ, 2018 జూలై 1 నుంచి 11వ పీఆర్సీ వర్తించాల్సి ఉండగా.. అంతకుముందే 2018 మే 16న ఉద్యోగ సంఘాలతో సమావేశమైన కేసీఆర్‌‌‌‌ అదే ఏడాది జూన్‌‌‌‌ 2న ఐఆర్‌‌‌‌ను, ఆగస్టు 15న ఫిట్‌‌‌‌మెంట్‌‌‌‌ను ప్రకటించుకుందామని చెప్పి మాట తప్పారు. 33 నెలలుగా ఇదిగో పీఆర్సీ, అదిగో పీఆర్సీ అంటూ ఊరిస్తూ, ఉద్యోగులతో దోబూచులాడుతున్నారు. మొన్నటికి మొన్న డిసెంబర్‌‌‌‌ చివరలో పీఆర్సీ అమలు చేస్తానని, రిపోర్ట్‌‌‌‌ కూడా తెప్పించారు. కానీ ముగ్గురు సభ్యులతో‌‌ కమిటీని నియమించి సంఘాలతో చర్చించాలని చెప్పి ఆలస్యం జరిగేలా చూశారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌ రావడంతో ఎన్నికల కోడ్‌‌‌‌, త్వరలో నాగార్జునసాగర్‌‌‌‌ ఉప ఎన్నిక, మరికొన్ని రోజులకు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో మరికొన్ని నెలలు పీఆర్సీ అమలు విషయాన్ని పొడిగించాలనే ఎత్తుగడను కేసీఆర్‌‌‌‌ చేస్తున్నారు.

ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి, టీచర్లను పట్టించుకోలె

ఉద్యోగ సంఘాలకు ఈ రోజు ప్రభుత్వం దగ్గర ప్రాధాన్యత లేదు. ఉమ్మడి రాష్ట్రంలో జాయింట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంత వరకూ గుర్తింపు లేకుండా చేశారు. తాత్కాలిక గుర్తింపును ఇస్తూ, టీచర్ల యూనియన్లను గుర్తింపు సంఘాల జాబితా నుంచి తొలగించారు. జాయింట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ లేకుండా ఈ ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. సంక్షేమ పథకాలను ఎరవేసి రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌‌‌‌.. మాయ మాటలతో నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లను మోసం చేస్తున్నారు. ఉద్యోగులు, టీచర్లకు ప్రమోషన్లు అని చెప్పి.. ఉద్యోగులకు మాత్రమే పదోన్నతులు ఇచ్చి, టీచర్లను పట్టించుకోకపోవడం టీచర్లపై నిర్లక్ష్య, కక్ష సాధింపు వైఖరిని తెలియజేస్తోంది. టీచర్లు జాతి నిర్మాతలు. జాతి నిర్మాణం అనేది తరగతి గది నుంచే మొదలవుతుంది. అలాంటి టీచర్లను తెలంగాణ పక్కన పెట్టడం సరికాదు. మీరు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడతారు. అభివృద్ధి అంటే వంద అంతస్తుల మేడలు, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు కావు. విద్యాపరమైన అభివృద్ధే అసలైన రాష్ట్రాభివృద్ధి. ఈ విషయాన్ని ఇకనైనా ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి.

45 శాతానికి తగ్గితే ఉద్యోగుల కోపాన్ని చూస్తరు

ఇటీవల కాలంలో పెరిగిన ధరల కారణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఫిట్‌‌‌‌మెంట్‌‌‌‌ 7.5 శాతానికి తగ్గించడం కేసీఆర్‌‌‌‌ ఆదేశాల మేరకే జరిగింది. ఫిట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రకటన విషయంలో తుది నిర్ణయం కేసీఆర్‌‌‌‌దే కాబట్టి.. గత పీఆర్సీలకు భిన్నంగా కాకుండా ఫిట్‌‌‌‌మెంట్‌‌‌‌ను 45 శాతానికి తగ్గకుండా ఇవ్వాలి. అలా జరగకుంటే వచ్చే ఎన్నికల్లో ఉద్యోగ వర్గాల కోపాన్ని కేసీఆర్‌‌‌‌ చవిచూడాల్సి వస్తుంది. కేసీఆర్‌‌‌‌కు పీఆర్సీ అమలుపై చిత్తశుద్ధి ఉంటే, యూనివర్సిటీలకు వీసీల నియామకానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరినట్లే, పీఆర్సీ అమలుకు అనుమతి తీసుకోవాలి.                                                      -బి.మోహన్‌‌‌‌రెడ్డి, బీజేపీ రిటైర్డ్‌‌‌‌ టీచర్స్‌ ఎంప్లాయిస్‌ సెల్​ చైర్మన్‌‌‌‌