- ముగ్గురిని హతమార్చేందుకు రూ.14 లక్షలకు డీల్
- ఐదుగురు నిందితుల అరెస్టు
జగిత్యాల/కోరుట్ల, వెలుగు: ఆస్తితో పాటు కుటుంబం మీద పట్టు సంపాదించాలన్న దురాశతో ఓ ఆర్ఎంపీ సొంత బావమరిదితో పాటు మరో ఇద్దరిని హత్య చేయించేందుకు కుట్రపన్నాడు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌తో రూ.14 లక్షలకు డీల్ చేసుకున్నాడు. మర్డర్ ప్లాన్‌ను తెలుసుకున్న పోలీసులు నలుగురు గ్యాంగ్ మెంబర్లతో పాటు ఆర్ఎంపీని అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగుకు చెందిన ఆర్ఎంపీ ధనకంటి సంపత్ కు.. కన్నాపూర్ కు చెందిన తన బావమరిది సంకోజి విష్ణువర్ధన్ తో ఆర్థిక లావాదేవీలున్నాయి. విష్ణును అడ్డు తొలగించుకుంటే ఆస్తి కలిసిరావడంతో పాటు కుటుంబం మీద పెత్తనం చేయవచ్చని సంపత్ భావించాడు.
ఈ క్రమంలో గతంలో అనారోగ్యానికి గురైన విష్ణుకు ఓవర్‌డోస్ ఇంజక్షన్లు ఇచ్చాడు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో విష్ణు, విష్ణు బావమరిది అజయ్, పైడిమడుగులో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్న రాజేందర్ ను కూడా హత్య చేయించాలని సంపత్ కుట్ర చేశాడు. తన స్నేహితుడు శేఖర్ సలహాతో హత్యాయత్నం కేసులో నిందితుడైన కోరుట్లకు చెందిన ఆకుల అశోక్ ను సంపత్ సంప్రదించాడు. ఆర్ఎంపీ రాజేందర్ హత్యకు రూ.4 లక్షలు, విష్ణు, అజయ్‌ల హత్యకు రూ.10 లక్షలు ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నాడు. అడ్వాన్సుగా రూ.లక్ష ఇచ్చాడు. ఈ నెల 5న రాత్రి పైడిమడుగులో ఆర్ఎంపీ రాజేందర్‌ను హత్య చేయాలని స్కెచ్ వేసి విఫలమయ్యారు. 11న చిట్టి డబ్బుల కోసం విష్ణు పైడిమడుగుకు వచ్చి సంపత్ ను కలిశాడు. తిరిగి వెళ్తుండగా తననెవరో వెంబడిస్తున్నట్లు అనుమానం వచ్చి కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మొత్తం కుట్రను బయటకు లాగారు.