డెహ్రాడూన్: దేశంలో రైలు ప్రమాదాలకు జరుగుతోన్న వరుస కుట్రలు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్లు పెట్టి ట్రైన్ యాక్సిడెంట్‌కు ప్లాన్ చేయగా.. తృటిలో పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే.. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో రైల్వే ట్రాక్‌పై సిమెంట్ దిమ్మెను పెట్టి మరో భారీ విధ్వంసానికి తెరలేపారు. దాదాపు 70 కిలోల బరువున్న సిమెంట్ దిమ్మెను ట్రాక్‌పై అమర్చగా.. వేగంగా దూసుకొచ్చిన ట్రైన్ ఈ దిమ్మెను ఢీకొట్టింది.
ఈ ఘటనలో ట్రైన్ ముందు భాగం దెబ్బతినగా.. పెను ప్రమాదం తప్పింది. ఇదిలా ఉండగానే.. తాజాగా ఉత్తరఖాండ్‌లో మరో ట్రైన్ యాక్సిడెంట్‌కు భారీ కుట్ర జరిగింది. ఉత్తరఖాండ్‌లోని బిలాస్ పూర్-- రుద్రాపూర్ సిటీ మధ్య నడిచే గుజరాత్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైలును పట్టాలు తప్పించేందుకు దుండగులు ప్లాన్ చేశారు. ఈ మేరకు పట్టాలపై ఆరడగుల ఐరన్ రాడ్డును అడ్డుగా పెట్టారు. పట్టాలపై ఐరన్ రాడ్ గమనించిన లోక్ పైలట్ వెంటనే అప్రమత్తమై ట్రైన్‌ను ఆపేశాడు.
వెంటనే రుద్రాపూర్ స్టేషన్ మాస్టర్‌తో పాటు సంబంధిత అధికారులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు.. పట్టాలపై ఐరన్ రాడ్డును తొలగించి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లోక్ పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పడంతో అధికారులతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.